AP Politics: వచ్చే ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తే ఏం జరుగుతుందో చెప్పేసిన సర్వే..!

ABN , First Publish Date - 2023-05-24T17:34:38+05:30 IST

తెలుగుదేశం, జనసేన పొత్తులపై ఇరు పార్టీల నేతల్లోనూ స్పష్టత వచ్చేసింది. తెలుగుదేశంతో పొత్తుతోనే ఎన్నికలకు వెళతామంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాన్‌ ఇప్పటికే వెల్లడించారు. మినీ మహానాడులో..

AP Politics: వచ్చే ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తే ఏం జరుగుతుందో చెప్పేసిన సర్వే..!

తెలుగుదేశం, జనసేనల్లో జోష్‌

పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు స్థానాలపై టీడీపీ కన్ను

సొంత సర్వేలతో నివేదికలు

మూడు స్థానాలపై జనసేన పట్టు

ఎవరి ధీమా వారిదే

(భీమవరం-ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశం, జనసేన పొత్తులపై (TDP, Janasena) ఇరు పార్టీల నేతల్లోనూ స్పష్టత వచ్చేసింది. తెలుగుదేశంతో పొత్తుతోనే ఎన్నికలకు వెళతామంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ (Janasena Pawan Kalyan) ఇప్పటికే వెల్లడించారు. మినీ మహానాడులో తెలుగుదేశం నేతలు సైతం పొత్తుతోనే ఎన్నికలకు వెళతాం. ఉభయ గోదావరి జిల్లాలో స్వీప్‌ చేస్తామంటూ తేల్చిచెప్పడంతో ఇరు పార్టీల్లోనూ జోష్‌ నెలకొంది. కేడర్‌లో రెట్టింపు ఉత్సాహం ఇనుమడింపచేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని (West Godavari) ఏడు నియోజకవర్గాల్లోనూ పొత్తుల వల్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ (YSR Congress) దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ సర్వే నివేదికలు (Survey Reports) స్పష్టం చేస్తున్నాయి. అయితే పొత్తులో ఏ స్థానం ఎవరికి వెళుతుందనేది ఆసక్తి నెలకొంది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ భీమవరం (Pawan Kalyan Bhimavaram) నుంచి పోటీ చేయడంతో పొత్తులపై పెద్ద చర్చే నడుస్తోంది. భీమవరం నుంచే పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ పోటీ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. ముందస్తు ఎన్నికలు కూడా వస్తాయన్న సంకేతాలు అందు తుండడంతో నియోజక వర్గ నాయకత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి.

తెలుగుదేశం ఇచ్చిన కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. అయితే పొత్తులతో తెలుగుదేశం ముందునుంచే ఒక స్పష్టతతో ఉన్నట్టు కనపడుతోంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ప్రధానంగా దృష్టి పెట్టినట్టు సమాచారం. దాంతో రెండు నియోజకవర్గాల్లో జనసేన బరిలో ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరోవైపు జనసేన కూడా జిల్లాలోని ఏడు నియోజక వర్గాల్లో మూడింటిని తమకు ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు అన్ని నియోజక వర్గాల్లోనూ ఎవరికి వారే తమదే టిక్కెట్టు అనే ధీమాతో ఉన్నారు. తెలుగుదేశం జిల్లా నేతలు మాత్రం కచ్చితంగా రెండు స్థానాలు జనసేన ఖాతాలోకి వెళతాయని నమ్ముతున్నారు. గడచిన ఎన్నికల్లో ఓట్ల లభ్యతను బట్టి జనసేన కూడా తాము ఆశించే స్థానాలపై తర్జనభర్జనలు పడుతోంది. అంతిమంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామన్న ధీమా రెండు పార్టీల్లోనూ ఉంది.

కలసి వస్తున్న అధికార పార్టీ నేతల వైఖరి

అధికార పార్టీ నేతల వైఖరి కూడా ప్రతిపక్షాలకు కలసి వస్తోంది. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అవినీతి దందాతో ప్రజా వ్యతిరేకతను చవిచూస్తున్నారు. ఇది ప్రతిపక్ష పార్టీలకు మేలు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, స్థానిక నాయకత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తెలుగుదేశం నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతల అవినీతిని ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ఇటువంటి నియోజకవర్గాలను పొత్తుల్లోనైనా సరే వదులు కోకూడదన్న ఉద్దేశంతో తెలుగుదేశం అధిష్టానం ఉంది. ఫలితంగా జిల్లాలో రెండు సీట్లను జనసేన ఖాతాలోకి చేర్చి ఐదు స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుందన్న స్పష్టత ఆ పార్టీలో ఉంది. ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని ముందస్తుగానే పార్టీ శ్రేణులను అధిష్టానం అప్రమత్తం చేస్తోంది. రాష్ట్ర స్థాయి నేతలు ఇదే విషయాన్ని కేడర్‌కు నూరిపోస్తున్నారు.

ఐదు స్థానాల్లో సర్వే ?

తెలుగుదేశం పార్టీ పోటీ చేసే ఐదు స్థానాల్లో అధిష్టానం సర్వే చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అందరూ ఊహించినట్టుగానే రెండు నియోజక వర్గాలపై అధిష్టానం దృష్టి పెట్టలేదు. జిల్లాలోని ఐదు నియోజక వర్గాల సర్వే నివేదికలు అధిష్టానం వద్దకు వెళ్లాయి. అందులో ఒక్క నియోజకవర్గంలోనే కాస్త పోటీ ఉంటుందంటూ ప్రజానాడిలో తేటతెల్లమైంది. సామాజిక సమీకరణలతో పాటు, స్థానిక నేత తన సామాజిక వర్గాల్లో ఉన్న పట్టు వల్ల పోటీ ఉంది. అయినా సరే తెలుగుదేశం వైపే ఫలితం ఉంటుందంటూ సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ దృష్టి పెట్టిన ఇతర నాలుగు నియోజక వర్గాల్లో సునాయాస విజయం తధ్యమంటూ అధిష్టానం విశ్వసిస్తోంది.

భీమవరంపై అందరి కన్ను

పొత్తుల్లో భాగంగా భీమవరంపై అందరి దృష్టి పడింది. గతంలో అదే స్థానం నుంచి పవన్‌కళ్యాణ్‌ పోటీ చేశారు. తెలుగుదేశం మూడోస్థానంలో నిలచినప్పటికీ మంచి ఓట్లునే సాధించింది. తెలుగుదేశం, జనసేన పార్టీల ఓట్లును కలిపితే మెజారిటీ దాదాపు 45 వేల వరకు ఉంటుంది. పొత్తులో అక్కడ సునాయాస విజయం తప్పదని రెండు పార్టీలు విశ్వసిస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తే భారీ మెజారిటీ వస్తుందన్న అంచనాలు అందరిలోనూ ఉన్నాయి. భీమవరంలో ఆయనే పోటీ చేస్తారన్న అభిప్రాయం అత్యధికుల్లో ఉంది. ఒక దశలో పిఠాపురంలోనూ పోటీ చేస్తారన్న చర్చ సాగింది. ఒకవేళ పవన్‌ పోటీ చేయకపోతే రెండు పార్టీల నుంచి భీమవరం బరిలో నిలిచేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారు. జనసేన నుంచి టిక్కెట్‌ ఆశించే నాయకుడు ఇదివరకే సొంత సర్వే చేశారు. జనసేన కూడా భీమవరంలో బలీయంగానే ఉందంటూ ఆ పార్టీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. దాంతో పవన్‌ కళ్యాణ్‌ అక్కడ ఆసక్తి చూపకపోయినా సీటు మాత్రం జనసేన ఖాతాలో ఉంటుందన్న విశ్వాసం ఆ పార్టీ కేడర్‌లో ఉంది.

గతం నుంచే పొత్తులు

తెలుగుదేశం, జనసేన పొత్తులపై రెండు పార్టీల అధిష్ఠానాలు స్పష్టత ఇచ్చినప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం ముందునుంచే కలయిక ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీ నాయకులు చర్చించుకునే బరిలో నిలిచారు. ఆచంట, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు సాధించారు. అప్పటినుంచే రెండు పార్టీల మధ్య సయోధ్య ఉంది.

Updated Date - 2023-05-24T17:34:41+05:30 IST