Sonia Gandhi: అడుగడుగునా గండాలున్నా ఎదురీది నిలిచిన సోనియా...

ABN , First Publish Date - 2023-02-25T20:47:42+05:30 IST

సోనియగాంధీ(Sonia Gandhi).. భారతదేశ రాజకీయాల్లో ఈ పేరొక సంచలనం. ఇటలీకి చెందిన సోనియా భారత రాజకీయాల్లో

Sonia Gandhi: అడుగడుగునా గండాలున్నా ఎదురీది నిలిచిన సోనియా...

ఇంటర్నెట్ డెస్క్: సోనియగాంధీ(Sonia Gandhi).. భారతదేశ రాజకీయాల్లో ఈ పేరొక సంచలనం. ఇటలీకి చెందిన సోనియా భారత రాజకీయాల్లో చక్రం తిప్పారు. ప్రధానమంత్రి కాలేదన్న మాటే కానీ.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) వేసిన ప్రతి అడుగు వెనక ఆమె ఉన్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడైన రాజీవ్ గాంధీ(Rajiv Gandhi)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఆపై పెళ్లికి దారితీసింది. 1968లో హిందూ సంప్రదాయ పద్ధతిలో న్యూఢిల్లీలో వీరి వివాహం జరగడంతో ఇండియాకొచ్చి అత్తగారైన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ(Indira Gandhi) నివాసంలో సోనియా కాలుమోపారు. సుదీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో కొనసాగి దేశ రాజీకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన సోనియా.. భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)తో తన ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందన్న వ్యాఖ్యల నేపథ్యంలో ప్రత్యేక కథనం.

తొలి చూపులోనే ప్రేమ

Rajiv-with-sonia.jpg

రాజీవ్ గాంధీ 1956లో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఓసారి స్నేహితులతో కలిసి వర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లారు. అదే వర్సిటీలో చదువుతున్న సోనియాగాంధీ ఆ రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నారు. అప్పుడు తొలిసారి సోనియాను చూసిన రాజీవ్ ఆలస్యం చేయకుండా ఆమెతో ప్రేమలో పడిపోయారు. ఆ తర్వాత వారి ప్రేమ పెరిగి పెద్దదై పెళ్లికి దారితీసింది.

ఇందిరకు ఇష్టం లేకుండానే..

sonia-indira.jpg

రాజీవ్ గాంధీ ఇటలీ అమ్మాయిని ప్రేమించడం, ఆమెనే పెళ్లాడతానని పట్టుబడడం ఇందిరకు ఇష్టం ఉండేదని కాదని చెబుతారు. బాలీవుడ్ దివంగత నటుడు రాజ్‌కపూర్ కుమార్తెతో తన కుమారుడి పెళ్లి చేయాలని ఇందిర అనుకునే వారట. దీనికి కారణం కూడా ఉంది. ఇందిర తండ్రి జవహర్‌లాల్ నెహ్రూ, రాజ్‌కపూర్ తండ్రి పృథ్వీరాజ్ కపూర్ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. ఈ కారణంగా రాజ్‌కపూర్ పెద్ద కుమార్తె రీతుకు ఇచ్చి వివాహం చేయాలని ఇందిర తలపోసినట్టు ప్రముఖ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ తన పుస్తకం ‘లీడర్ యాక్టర్: బాలీవుడ్ స్టార్ పవర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’ (Leader Actor: Bollywood Star Power in Indian Politics)లో రాసుకొచ్చారు. అయితే, రాజీవ్ గాంధీ.. సోనియాను ప్రేమించడంతో ఆమె కోరిక నెరవేరలేదు. కుమారుడి అభీష్టం మేరకు సోనియాతో ఆమె పెళ్లి జరిగింది. వీరికి 1970లో రాహుల్ గాంధీ, 1972లో ప్రియాంక గాంధీ జన్మించారు. ద్వంద్వ పౌరసత్వంపై విమర్శలు రావడంతో 1983లో సోనియాగాంధీ ఇటలీ పౌరసత్వాన్ని వదులుకున్నారు.

రాజీవ్ కోసం ప్రచారం

sonia-with-Rajiv.jpg

ఇందిర హత్య తర్వాత రాజీవ్ ప్రధాని అయ్యారు. దీంతో రాజకీయాలంటే ఇష్టం లేకున్నా సోనియా ప్రజలతో మమేకం కావాల్సి వచ్చింది. భర్తతో కలిసి అనేక రాష్ట్రాలు సందర్శించారు. 1984లో రాజీవ్‌గాంధీ అమేథీ నుంచి బరిలోకి దిగారు. అప్పుడు ఆమె వదిన అయిన మేనకా గాంధీ ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అప్పుడు సోనియా తన భర్త తరపున అమేథీలో ప్రచారం చేశారు.

రాజీవ్ హత్యతో గుండెలవిసేలా రోదించిన సోనియా

Rajiv-assination.jpg

ఎన్నికల ప్రచారంలో ఉండగా 21 మే 1991లో తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్‌గాంధీ మరణించారు. టీవీల్లో చూసి విషయం తెలుసుకున్న దేశ ప్రజలు నివ్వెరపోయారు. రాజీవ్ గాంధీ బతికితే బాగుండని ప్రార్థించారు. కానీ, అవేవీ ఫలించలేదు. అదే సమయంలో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ నివాసం వద్ద కూడా నిశ్శబ్దం రాజ్యమేలింది. చెన్నైలో రాజీవ్ గాంధీ సభలో బాంబు పేలుడు జరిగినట్టు రాజీవ్ ప్రైవేట్ సెక్రటరీ విన్సెంట్ జార్జ్‌కు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ పెట్టేసిన వెంటనే ఆయన 10 జన్‌పథ్‌కు పరుగులు తీశారు. అప్పటికే సోనియా, ప్రియాంక నిద్రపోవడానికి వెళ్లారు. ఆ తర్వాత పి.చిదంబరం భార్య నళినితో జార్జ్ మాట్లాడారు. రాజీవ్ లక్ష్యంగానే పేలుడు జరిగినట్టు ఆమె జార్జ్‌కు చెప్పడంతో కీడు శంకించారు.

ఆ తర్వాత రాత్రి 10.50 గంటలకు నిఘా విభాగానికి చెందిన వ్యక్తినంటూ ఓ అధికారి ఫోన్ చేస్తే రాజీవ్ ఎలా ఉన్నారని జార్జ్ ప్రశ్నించారు. అవతలి వ్యక్తి బొంగురుపోయిన గొంతుతో ‘‘సర్ మనకిక లేరు’’ అని చెప్పడంతో జార్జ్ హతాశులయ్యారు. ఫోన్ పెట్టేసి ‘మేడమ్’ అని గట్టిగా పిలుస్తూ లోపలికి వెళ్లారు. ఆ సమయంలో నైట్ గౌన్‌లో ఉన్న సోనియా.. వెంటనే బయటకు వచ్చారు. జార్జ్ వణికిపోతున్న గొంతుతో.. ‘‘మేడం చెన్నైలో దాడి జరిగింది’’ అని మాత్రం చెప్పగలిగారు. ఆ వెంటనే సోనియా ‘‘ఈజ్ హీ అలైవ్’’ అని అడిగితే.. జార్జ్ మౌనంగా ఉండిపోవడంతో ఘోరం జరిగిందని అర్థం చేసుకుని సోనియా బిగ్గరగా గుండెలవిసేలా రోదించారు. అప్పుడప్పుడే బయట ఉన్న గెస్ట్ రూంలోకి చేరుకుంటున్న కాంగ్రెస్ నేతలందరికీ ఆ ఏడుపులు స్పష్టంగా వినిపించినట్టు జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.

చీలికతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి..

2.jpg

రాజీవ్ మరణం దేశ రాజకీయాల్లో రాజకీయ అస్థిరతకు కారణమైంది. సోనియాగాంధీని ప్రధానిమంత్రిని చేయాలని కాంగ్రెస్ పెద్దలు తలపోసినా అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో పీవీ నరసింహారావును ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. 1996లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చీలిక మొదలైంది. మాధవరావ్ సింధియా, రాజేష్ పైలట్, నారాయణ్ దత్ తివారీ, అర్జున్ సింగ్, మమతా బెనర్జీ, జీకే ముపనార్, పి. చిదంబరం, జయంతి నటరాజన్ వంటి సీనియర్ నాయకులు అప్పటి పార్టీ అధ్యక్షుడు సీతారాం కేసరిపై తిరుగుబాటు చేసి బయటకు వచ్చి పార్టీలో చీలికలు తెచ్చారు. దీంతో సోనియాగాంధీ రంగంలోకి దిగక తప్పలేదు. పార్టీని ఒక్కటి చేసేందుకు నడుంబిగించారు. 1997లో కలకత్తా ప్లీనరీ సమావేశంలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. 1998లో పార్టీ నాయకురాలిగా ఎదిగారు.

పార్టీ ప్రాథమిక సభ్యత్వం స్వీకరించిన 62 రోజుల్లోనే..

3.jpg

కాంగ్రెస్ పార్టీని గాడినపెట్టేందుకు నడుంబిగించిన సోనియాగాంధీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న 62 రోజుల్లోనే పార్టీ ఆమెను అధ్యక్షురాలిగా ఎన్నుకుంది. 1999లో కర్ణాటకలోని బళ్ళారి, ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గాల నుంచి లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత బళ్లారిని వదులుకుని అమేథీకి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత రాయ్‌బరేలీ నుంచి పలుమార్లు విజయం సాధించారు.

ప్రతిపక్ష నేతగా..

4.jpg

1999లో బీజేపీ అధికారంలోకి వచ్చి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు సోనియా గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2004 నుంచి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (UPA)కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇక, సెప్టెంబరు 2010లో వరుసగా నాలుగోసారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎన్నికైన సోనియా.. ఆ పార్టీకి ఎక్కువకాలం అధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తిగా రికార్డులకెక్కారు. అంతేకాదు, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత పార్టీకి అధ్యక్షురాలైన తొలి విదేశీయురాలిగానూ ఆమె ఖ్యాతికెక్కారు.

వివాదాలు..

5.jpg

స్వతహాగా విదేశీయురాలైన సోనియాగాంధీ భారత రాజకీయాల్లో చక్రం తిప్పడం చాలామందికి నచ్చలేదు. దీంతో ఆమెపై ‘విదేశీ’ ముద్ర వేశారు. ఈ ఒక్క కారణాన్ని చూపిస్తూ ఆమె ప్రధానమంత్రి కాకుండా బీజేపీ అడ్డుకుంది. సోనియా కూడా ప్రధానమంత్రి అవకాశం పలుమార్లు తలుపు తట్టినా ఆమె నిరాకరించారు.

మన్మోహన్ వెనక అన్నీ తానై..

manmohan.jpg

2004 ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు యూపీఏ చైర్ పర్సన్‌గా ఉన్న సోనియా గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకు పార్టీ పెద్దలు నానా ప్రయత్నాలు చేసినా సోనియా నిరాకరించారు. అనుభవజ్ఞుడైన మన్మోహన్ సింగ్‌ను ప్రధానిని చేశారు. దీంతో ప్రధాని పదవిని సోనియా త్యాగం చేశారని కాంగ్రెస్ చెప్పుకుంది. 2009లో ఎన్నికల్లో కాంగ్రెస్ మరోమారు విజయం సాధించడంతో అప్పుడు కూడా మన్మోహన్ సింగే ప్రధానిగా కొనసాగారు.

2014 నుంచి కష్టాలు..

6.jpg

2014 నుంచి కాంగ్రెస్ పార్టీని కష్టాలు వేధిస్తున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. కేవలం 44 లోక్‌సభ స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. గత ఎన్నికల్లో మరోమారు ఓడిన కాంగ్రెస్ ఆ తర్వాత పలు రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయింది. ప్రస్తుతం ఆ పార్టీ ఉనికి కోసం పోరాడుతోంది. కాగా, 2013లో ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో సోనియాకు మూడో స్థానాన్ని కల్పించింది. అలాగే టైమ్ మేగజైన్ 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలోనూ సోనియాకు స్థానం దక్కింది.

అనారోగ్యంతో రాహుల్‌కు పగ్గాలు

rahul.jpg

కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలంపాటు అధ్యక్షురాలిగా పనిచేసిన సోనియాగాంధీ నుంచి 2017లో రాహుల్ పార్టీ పగ్గాలు అందుకున్నారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగానూ పనిచేశారు. రాహుల్ నేతృత్వంలో 2019 ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో సోనియా మళ్లీ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎందరు చెప్పినా పగ్గాలు స్వీకరించేందుకు రాహుల్ ఇష్టపడకపోవడంతో గతేడాది ఎన్నికలు నిర్వహించారు. సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే విజయం సాధించి అధ్యక్షుడయ్యారు.

రాజకీయాలకు సెలవు

7.jpg

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన సోనియా రాజకీయాలకు విరామం ఇస్తున్నట్టు హింట్ ఇచ్చారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహిస్తున్న పార్టీ 85వ ప్లీనరీలో రెండో రోజైన శనివారం ఆమె ప్రసంగిస్తూ... భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగుస్తుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్రగా దీనిని అభివర్ణించారు. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసిందని అన్నారు. తన రాజకీయ ఇన్నింగ్స్ ముగియనుందంటూ సోనియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Updated Date - 2023-02-25T20:48:40+05:30 IST