AP politics: అవునా పాపం.. లండన్‌లో ఉన్నావా? ప్రజలకు అన్నీ తెలుసులే..!!

ABN , First Publish Date - 2023-10-09T19:17:33+05:30 IST

చంద్రబాబు అరెస్ట్‌లో తన పాత్ర ఏమీ లేదంటూ ఏపీ సీఎం జగన్ ముసిముసి నవ్వులు చిందించారు. చంద్రబాబును కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదని.. అసలు తనకు ఆయనపై ఎలాంటి కక్షా లేదని నవ్వుతూనే వివరించారు.

AP politics: అవునా పాపం.. లండన్‌లో ఉన్నావా? ప్రజలకు అన్నీ తెలుసులే..!!

విజయవాడలో సోమవారం జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం జగన్ భుజాలు తడుముకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌లో తన పాత్ర ఏమీ లేదంటూ ముసిముసి నవ్వులు చిందించారు. చంద్రబాబును కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదని.. అసలు తనకు ఆయనపై ఎలాంటి కక్షా లేదని నవ్వుతూనే వివరించారు. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన సమయంలో తాను భారతదేశంలోనే లేనని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ఉందని.. దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నానని అంటున్నాడని జగన్ ఆరోపించారు. ఇవన్నీ బీజేపీతో కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అక్రమాలు అని .. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో సహా రాష్ట్రంలో సగం మంది బీజేపీ నేతలు టీడీపీ వాళ్లే అని జగన్ అన్నారు.

అయితే జగన్ ఆరోపణలు వింటే ఆయన బీజేపీని టార్గెట్ చేస్తున్నారా అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం జగన్ మళ్లీ మైండ్ గేమ్ ప్రారంభించారని.. కేంద్రంతో కలిసే చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయించారని.. అందులో ఎలాంటి సందేహం లేదని.. అయితే ఇప్పుడు నింద మొత్తం బీజేపీపైనే నెట్టాలని జగన్ భావిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బీజేపీతో దోస్తీ చేస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు పడవు అని.. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చని బీజేపీపై ఏపీ ప్రజలు గుర్రుగా ఉన్నారని.. అందుకే ఇప్పుడు జగన్ కొత్త నాటకానికి తెరతీశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు తాను ఇండియాలోనే లేని సమయంలో చంద్రబాబును కేంద్రమే అరెస్ట్ చేయించిందన్న రీతిలో జగన్ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. అవునా పాపం అప్పుడు జగన్ లండన్‌లో ఉన్నారా.. అసలు ఆయనకు ఈ విషయంపై సమాచారమే లేదా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్‌లు ఎద్దేవా చేస్తున్నారు.


అటు వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టింది. ‘ఆ నవ్వులో శాడిజం తప్ప... స్వచ్ఛత ఏది జగన్? మీ కక్ష సాధింపు గురించి, మీ సైకో చేష్టల గురించి ఏపీ ప్రజలకు బాగా తెలుసు. 'లండన్ లో ఉన్నా' అని చెప్తే 'అవునా పాపం' అనుకునే పిచ్చివాళ్ళు లేరు రాష్ట్రంలో’ అంటూ తన ట్వీట్‌లో టీడీపీ పేర్కొంది.


మరోవైపు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘అరెస్ట్ చెయ్యమని చెప్పినవాడు చేతులెత్తేసాడు... అరెస్ట్ చేసిన వారు బుక్కైపోతారు. దేవుడి స్క్రిప్ట్ అదిరిపోలా’ అంటూ ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-10-09T19:17:33+05:30 IST