BJP Politics: తెలుగు రాష్ట్రాలతో బీజేపీ చెలగాటం.. ఏపీలో రైల్వేజోన్.. తెలంగాణలో పసుపు బోర్డు
ABN , First Publish Date - 2023-10-02T15:42:52+05:30 IST
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాని మోదీ తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఆయన తెలంగాణలో పర్యటించి పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేశారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాలతో చెలగాటం ఆడుతున్నారు. గతంలో విభజన సమయంలో రాజధాని లేని ఏపీకి ఢిల్లీని మించిన రాజధానిని నిర్మించి ఇస్తామని మాట ఇచ్చారు. దీనికి తగ్గట్లుగానే 2015లో అమరావతి నిర్మాణానికి శంకుస్థాపనకు హాజరయ్యారు. కానీ తర్వాత అమరావతి గురించి మరిచిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్ర రాజకీయాలకు తెరతీశారు. అంతేకాకుండా 2019 ఎన్నికలకు ముందు విశాఖకు రైల్వేజోన్ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు రైల్వేజోన్ ఏర్పాటుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్‌నగర్ సభలో ప్రకటించారు. దీంతో ఏపీలో రైల్వే జోన్ మాదిరిగానే తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్‌లు ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ మాటను నమ్మితే అంతే సంగతులు అంటూ హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాని మోదీ తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఆయన తెలంగాణలో పర్యటించి పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేశారు. అయితే గతంలో 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పసుపు రైతులు వందల సంఖ్యలో నిజామాబాద్ బరిలో నిలిచారు. ఆ సమయంలో బీజేపీ గెలిస్తే పసుపుబోర్డు ఏర్పాటు ఖాయమని ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ బాండ్ రాసిచ్చి మరీ ఎన్నికల ప్రచారం చేశారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఆ సంగతే మరిచిపోయారు. మధ్యలో రైతులు ఈ విషయంపై ప్రశ్నిస్తే.. స్పైసిస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసి.. అదే పసుపు బోర్డు అన్నారు. దీంతో తమను మోసం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి బీజేపీ పసుపు రైతులకు గాలం వేసే పనిలో పడింది. 2024లో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లే ముందు మళ్లీ పసుపుబోర్డు హామీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో గత ఐదేళ్లలో పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

పసుపు బోర్డుతో లాభమేంటి?
ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువగా రైతులు పసుపు పండిస్తారు. దేశంలో పండే పసుపులో సుమారు 70 శాతం నిజామాబాద్ ప్రాంతంలోనే పండుతుంది. దీంతో పసుపు బోర్డు ఉంటే తమకు మద్దతు ధర లభిస్తుందని రైతులు ఆశపడుతున్నారు. అంతేకాకుండా పంట అభివృద్ధి, విస్తరణ,నాణ్యత ప్రమాణాలు పాటించడం వంటి అంశాలపై పరిశోధనలు జరిపి సలహాలు ఇవ్వడం, రైతులకు లాభం చేకూరేలా పసుపు ఎగుమతులకు అనువైన పరిస్థితులు కల్పించడం లక్ష్యంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని స్థానిక రైతు సంఘాలు రెండు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాయి.