Kanna Lakshmi Narayana: కన్నా జనసేనలోకా, టీడీపీలోకా అనే ప్రశ్నకు సమాధానం వచ్చేసింది..!

ABN , First Publish Date - 2023-02-19T12:03:12+05:30 IST

బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshmi Narayana) ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంలో స్పష్టత వచ్చేసింది. టీడీపీలో చేరాలని..

Kanna Lakshmi Narayana: కన్నా జనసేనలోకా, టీడీపీలోకా అనే ప్రశ్నకు సమాధానం వచ్చేసింది..!

అమరావతి: బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshmi Narayana) ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంలో స్పష్టత వచ్చేసింది. టీడీపీలో చేరాలని గుంటూరు జిల్లాకు చెందిన ఈ సీనియర్ నేత నిర్ణయించుకున్నారు. ఇదే విషయమై తన అనుచరులతో ఆదివారం నాడు కన్నా సమావేశం నిర్వహించారు. టీడీపీలో చేరితేనే తగిన గౌరవం దక్కుతుందని కన్నా అనుచరులు కూడా అభిప్రాయపడ్డారు. దీంతో.. అనుచరుల ఆమోదంతో కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో (Kanna Lakshmi Narayana TDP) చేరేందుకు డిసైడ్ అయ్యారు. ఫిబ్రవరి 23న చంద్రబాబు సమక్షంలో కన్నా టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం కన్నా లక్ష్మీనారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో బీజేపీలో చేరానని.. సామాన్య కార్యకర్త నుంచి పార్టీ పటిష్ఠానికి కృషి చేశానని చెప్పారు. ‘2019 ఎన్నికలకు 10 నెలల ముందు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆ సమయంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పర్యటించి బీజేపీ తరఫున అభ్యర్థులను నిలబెట్టగలిగాను.

పాలక, ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది నాయకులను బీజేపీలోకి చేర్చగలిగాను. అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న అనాలోచిత, అజ్ఞాన నిర్ణయాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశాను. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక పోరాటాలు చేశాను. సోము వీర్రాజు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆయన ఏకపక్ష ధోరణి, కక్ష సాధింపు చర్యలతో విసిగిపోయాం. పార్టీ కోసం, ప్రధాని మోదీ, అమిత్‌ షాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లూ భరించాం. ఇక మా వల్ల కావడం లేదు. పార్టీని వీడడానికి కేవలం వీర్రాజే కారణం. మరే ఇతర సమస్యలూ లేవు. రాజకీయ జీవితంలో ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశాను. నాకు పదవులు అవసరం లేదు. పని చేసుకుంటూ పోతే వాటంతటే అవే వస్తాయి. ప్రస్తుతానికి ఏ పార్టీలో లేను. ఏ పార్టీలో చేరేదీ కార్యకర్తలతో చర్చించి త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తా’ అని వెల్లడించారు.

కాపుల రిజర్వేషన్లు, వంగవీటి రంగా గురించి మాట్లాడితే నాయకుడిగా ఎదుగుతామని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వంటి వారు అనుకుంటుంటారని కన్నా ఎద్దేవాచేశారు. ‘కృష్ణా జిల్లాకు రంగా పేరుపెట్టాలని జరిగిన పోరాటాల్లో ఆయన ఎందుకు పాల్గొనలేదు? కాపు రిజర్వేషన్లపై కేంద్రంతో చర్చలు జరిపి, వాటి సాధనకు రాష్టప్రభుత్వంతో పోరాటాలు చేస్తే బాగుండేది. ఇటువంటి ఓవర్‌నైట్‌ నాయకులను నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలామందిని చూశాను. రాష్ట్రంలో కాపులు సందిగ్ధంలో లేరు. వారి సమస్యలను ఎవరు పరిష్కరిస్తారో వారికి బాగా తెలుసు’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-02-19T12:05:51+05:30 IST