Pawan Kalyan Kuppam: ‘కుప్పానికి పవన్‌ రావాలి’.. ఈ మాటన్నది ఎవరంటే..

ABN , First Publish Date - 2023-07-18T15:02:04+05:30 IST

పూలే విగ్రహం వద్ద ఓ అభిమాని క్రేన్‌కు తాడుకట్టి వేలాడుతూ వాహనంపై ఉన్న పవన్‌కు శాలువా కప్పి, పూలమాల వేయడం జనాన్ని ఆకర్షించింది. అతని విన్యాసం చూసి పవన్‌ కూడా అతడి భుజం తట్టారు. ఎయిర్‌పోర్టు వద్ద కుప్పానికి చెందిన ఓ అభిమాని ‘పవన్‌ కుప్పం రావాలి’ అని బ్యానర్‌ పట్టుకుని తిరగడం కనిపించింది. దీంతో సదరు అభిమానిని పవన్‌ పలకరించగా.. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ దురాగతాలు ఎక్కువైపోతున్నాయని అక్కడికి వచ్చి కార్యకర్తలకు, అభిమానులకు ధైర్యం చెప్పాలని కోరారు.

Pawan Kalyan Kuppam: ‘కుప్పానికి పవన్‌ రావాలి’.. ఈ మాటన్నది ఎవరంటే..

తిరుపతి (ఆంధ్రజ్యోతి): పవన్‌ కల్యాణ్‌ తిరుపతి పర్యటన జన సైనికులకు భరోసాను, అభిమానుల్లో జోష్‌ను నింపింది. శ్రీకాళహస్తి పెళ్లిమండపం వద్ద గత బుధవారం నిరసన తెలుపుతున్న జనసేన జిల్లా కార్యదర్శి కొట్టే సాయిపై సీఐ అంజూ యాదవ్‌ దాడి చేసిన ఘటనను తీవ్రంగా పరిగణించిన పవన్‌ కార్యకర్తపై చేయివేస్తే తనపై వేసినట్టేనని ఆ రోజే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్న ఆయన అప్పటికే భారీగా చేరుకున్న అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోవడంతో అర గంట వరకు విమానాశ్రయం నుంచి బయటకు రాలేకపోయారు. అక్కడి నుంచి వందలాది ద్విచక్రవాహనాలు, పెద్దసంఖ్యలో కార్లలో పార్టీ శ్రేణులతో కలసి ర్యాలీగా తిరుపతికి బయల్దేరారు. దారి పొడవునా జనసేనానిని చూసేందుకు జనం పోటెత్తారు.

తిరుచానూరు, ఎంఆర్‌ పల్లి, వెస్ట్‌ చర్చి, ఎన్టీఆర్‌ సర్కిల్‌ మీదుగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న పవన్‌ అప్పటికే అక్కడ కిక్కిరిసిపోయిన అభిమానులకు అభివాదం చేశారు. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో కలసి ఎస్పీ కార్యాలయం లోపలికి వెళ్లారు. బాధితుడు కొట్టేసాయి, జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌, తిరుపతి ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌, నగర అధ్యక్షుడు రాజా రెడ్డి, శ్రీకాళహస్తి ఇన్‌చార్జి నగరం వినుత, మదనపల్లె ఇన్‌చార్జి రామదాస్‌ చౌదరిలతో పాటు ఇద్దరు లాయర్లు వారి వెంట ఎస్పీ ఛాంబర్‌లోకి వెళ్లారు. దాదాపు 50 నిమిషాలపాటు ఎస్పీతో సమావేశమయ్యారు. అంజూ యాదవ్‌పై చర్యలకు డిమాండు చేస్తూ వినతిపత్రం అందజేశారు.


చేతులెత్తేసిన పోలీసులు

పవన్‌ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ముందస్తుగా పార్టీ శ్రేణులకు సూచించారు. విమానాశ్రయం నుంచి వేలాదిమందితో సాగిన పవన్‌ ర్యాలీ మహిళా వర్సిటీ వద్దకు రాగానే పవన్‌ ప్రయాణిస్తున్న వాహనంతో పాటు, పైలెట్‌ వాహనం, సెక్యూరిటీ వాహనం, మీడియా వాహనాలను మాత్రమే అనుమతించి బారికేడ్లు మూసేశారు. దీంతో ఎయిర్‌పోర్టునుంచి ర్యాలీగా వచ్చిన కార్లు, ద్విచక్రవాహనాలు అక్కడే నిలిచిపోయే పరిస్థితివచ్చింది. పూలే, ఎన్టీఆర్‌ సర్కిళ్ల వద్ద కూడా అభిమానులను పోలీసులు నిలిపివేశారు. మీడియా సమావేశానికి అనుమతి ఇవ్వాలని జనసేన నాయకులు కోరగా ఎస్పీ కార్యాలయం వెలుపల రోడ్డుపై పోడియం ఏర్పాటు చేసుకోవాలని, అటువైపు అభిమానులను రానివ్వకుండా బారికేడ్లతో బందోబస్తు ఏర్పాటు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఆ మేరకు కార్యాలయానికి కుడివైపు పవన్‌ మీడియాతో మాట్లాడేందుకు వీలుగా పోడియం ఏర్పాటు చేశారు.

ఎస్పీ ఆఫీసుకు పవన్‌ రాకముందు వరకు పోడియం వద్ద మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతించిన పోలీసులు ఆయన కార్యాలయం లోపలికి వెళ్లాక చేతులెత్తేశారు. దీంతో రోడ్డుకు రెండు వైపులా పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ సర్కిల్లో అభిమానులపై పోలీసులు స్వల్పంగా లాఠీలకు పనిచెప్పారు. కార్యాలయం వెలుపల పెద్దఎత్తున జనం ఉన్నారనే సమాచారం తెలుసుకున్న ఎస్పీ పరమేశ్వర రెడ్డి మీడియా పోడియం వద్దకు వెళ్లవద్దని పవన్‌కు సూచించినట్టు తెలిసింది. అభిమానులను నియంత్రించలేకపోతున్నామని మీడియా సమావేశం రద్దు చేసుకోవాలని ఎస్పీ కోరడంతో కార్యాలయం నుంచి బయటకు వచ్చిన పవన్‌ జనసమూహాన్ని చూసి పోడియం వద్దకు రాకుండా వాహనంపైనుంచే అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.

కుప్పానికి పవన్‌ రావాలి

పూలే విగ్రహం వద్ద ఓ అభిమాని క్రేన్‌కు తాడుకట్టి వేలాడుతూ వాహనంపై ఉన్న పవన్‌కు శాలువా కప్పి, పూలమాల వేయడం జనాన్ని ఆకర్షించింది. అతని విన్యాసం చూసి పవన్‌ కూడా అతడి భుజం తట్టారు. ఎయిర్‌పోర్టు వద్ద కుప్పానికి చెందిన ఓ అభిమాని ‘పవన్‌ కుప్పం రావాలి’ అని బ్యానర్‌ పట్టుకుని తిరగడం కనిపించింది. దీంతో సదరు అభిమానిని పవన్‌ పలకరించగా.. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ దురాగతాలు ఎక్కువైపోతున్నాయని అక్కడికి వచ్చి కార్యకర్తలకు, అభిమానులకు ధైర్యం చెప్పాలని కోరారు.

మీరు రావడం ఎందుకు సర్‌?

‘దీనికి మీరు రావడం ఎందుకు సర్‌’ అని సీఐ అంజూ యాదవ్‌పై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ను ఎస్పీ అడిగినట్టు తెలిసింది. తమ నాయకుడిపై దాడి జరిగింది కాబట్టే వచ్చానని పవన్‌ చెబుతుండగా, కొట్టే సాయి జనసేన నాయకుడని తెలియకుండా ఘటన జరిగిందని ఎస్పీ చెప్పినట్టు సమాచారం. అంటే సామాన్య ప్రజలైతే మాత్రం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడులు చేస్తారా అని పవన్‌ ప్రతిస్పందించినట్టు తెలిసింది. అదేవిధంగా వలంటీర్ల వ్యవస్థపై కూడా పవన్‌ చర్చించినట్టు తెలిసింది. మహిళలు పెద్దఎత్తున మిస్సవ్వడం, కుటుంబపరమైన సున్నిత అంశాల సమాచారం వలంటీర్లు సేకరిస్తున్నట్టు పవన్‌ ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.

Updated Date - 2023-07-18T15:02:06+05:30 IST