CBN Case : చంద్రబాబు కేసులో ఇవాళ జరిగిన వాదనలు ఏంటి.. కోర్టు బయట దూబె ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-10-06T16:09:39+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) స్కిల్ అక్రమ కేసులో (Skill Development Case) కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నాడు ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై మరోసారి వాదనలు జరిగాయి...

CBN Case : చంద్రబాబు కేసులో ఇవాళ జరిగిన వాదనలు ఏంటి.. కోర్టు బయట దూబె ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) స్కిల్ అక్రమ కేసులో (Skill Development Case) కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నాడు ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై మరోసారి వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి (Ponnavolu Sudhakar Reddy), చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్‌ ప్రమోద్ కుమార్ దూబె (Pramod Kumar Dubey) వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా దూబె.. చంద్రబాబు పాత్ర ఏంటి..? ఇన్‌కమ్ ట్యాక్స్ వివరాలు, ఎన్నికల సంఘానికి అందజేసిన వివరాలను నిశితంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి వివరించారు. వాదనలు పూర్తయ్యాక దూబె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


Chandrababu-Arrest.jpg

ఇంతకీ దూబె ఏమన్నారు..?

చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్లపై వాదనలు వినిపించాం. టీడీపీ బ్యాంకు అకౌంటులోకి స్కిల్ డెవలప్మెంట్ స్కాం డబ్బులు వచ్చాయని బురద జల్లుతున్నారు. వాటి వివరాలను ఇన్ కంట్యాక్స్, ఎన్నికల సంఘానికి అందచేశాం. ఆ డాక్యుమెంట్ తెచ్చి స్కిల్ డెవలప్మెంట్ నిధులుగా చెబుతున్నారు. 2022 జనవరిలో కేసు నమోదు చేస్తే ‌ఇప్పటికీ దర్యాప్తు సాగుతున్నట్లు సిఐడీ చెబుతోంది. ఈ కేసులో ఇప్పటికే 13 మంది బెయిల్‌పై బయట ఉన్నారు. ప్రధాన నిందితులకు కూడా బెయిల్ ఇచ్చారు. 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ దాటాక, పోలీసు కస్టడీ తీసుకోకూడదు. ఇప్పటికే రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారు. అన్యాయంగా చంద్రబాబును ఈ కేసులో ఇరికించారు. కార్పరేషన్‌కు, ప్రైవేటు సంస్థలకు మధ్య ఒప్పందం జరిగింది. ఇందులో చంద్రబాబు పాత్ర ఎక్కడా లేదు. మా వాదనలు పూర్తి స్థాయిలో వినిపించాం. సోమవారం తీర్పు ఇస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పారు’ అని దూబె మీడియాకు వెల్లడించారు. అయితే దూబె మాటలు విన్న తర్వాత టీడీపీ శ్రేణులు చాలా ధీమాగా ఉన్నాయి. కచ్చితంగా ఈ కేసులో చంద్రబాబు బెయిల్ వస్తుందనే ఆశాభావంతోనే ఉన్నారు.

Dubey.jpg

డైరీ సంగతేంటి..?

కాగా.. అంతకుమునుపు కస్టడీకి ఇవ్వాలన్న ఏజీ పొన్నవోలు వాదనలపై ఏసీబీ కోర్టులోనే చంద్రబాబు తరుపు న్యాయవాది దూబె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కస్టడీకి కోరడం, పసలేని వాదనలు ఏంటి ఇవన్నీ అని న్యాయమూర్తికి తమ వాదనలు గట్టిగానే వినిపించారు. ‘ఇప్పటికే రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారు. విచారణలో చంద్రబాబు అన్ని విధాలుగా సహకరించారు. కస్టడీ ముగిసినా ఇప్పటివరకు కేసు డైరీ ఎందుకు సమర్పించలేదు..?’ అని సీఐడీని దూబె ప్రశ్నించారు. ఈ క్రమంలో కేసు డైరీ ఎక్కడ ఉందని సీఐడీ అధికారులను న్యాయమూర్తి కూడా ప్రశ్నించారు.

ACB-Court.jpg

పొన్నవోలు వాదనలు ఏంటి..?

చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో గురువారం నాడే పొన్నవోలు వాదనలు వినిపించారు. ఇవాళ మరికొన్ని వాదనలు వినిపిస్తామని చెప్పి.. శుక్రవారం నాడు పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఆ తర్వాత సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై వాదనలు సుదీర్ఘంగానే సాగాయి. బాబుకు ఈ కేసులో సెక్షన్-409 వర్తిస్తుంది. చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ఖాతాకు నిధులు మళ్లించారు. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దు. సీఐడీకి కోర్టు ఇచ్చిన రెండ్రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు. అందుకే చంద్రబాబును మళ్లీ కస్టడీకి ఇవ్వాలి. ఆయన బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకోవాలి. ఇప్పటికే ఆదాయపన్ను వివరాలు కూడా తీసుకున్నాం. సీఐడీ అధికారులు విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో చంద్రబాబు పాత్ర, ఇతరులకు డబ్బు పంపిణీ అంశాలపై విచారణ చేయాలి. అందుకే మొత్తం ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నాంఅని ఏసీబీ కోర్టును పొన్నవోలు కోరారు. అనంతరం చంద్రబాబు తరఫున ప్రమోద్ దూబె వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే ఒకసారి చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇచ్చారని.. రెండోసారి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఏసీబీ కోర్టులో బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలను అనంతరం తీర్పును సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు వెల్లడించింది.

Ponnavolu.jpg

Updated Date - 2023-10-06T16:37:04+05:30 IST