Kavitha ED enquiry: యాపిల్.. శాంసంగ్.. ‘‘హలో.. కవిత’’ మీ ఫోన్లేమిటో తెలిసిపోయింది

ABN , First Publish Date - 2023-03-22T19:56:19+05:30 IST

ఈడీ ఆదేశాల నేపథ్యంలో మంగళవారం విచారణకు వెళ్లేప్పుడు కవిత వెంట మొబైల్ ఫోన్లను తీసుకెళ్లారు. అంతకుముందు మీడియాకు కూడా చూపించారు. అయితే కవర్లలోని ఈ ఫోన్లను పరిశీలిస్తే...

Kavitha ED enquiry: యాపిల్.. శాంసంగ్.. ‘‘హలో.. కవిత’’ మీ ఫోన్లేమిటో తెలిసిపోయింది

ఒకప్పుడు పుస్తకం చేతిలో ఉండడం గౌరవంగా భావించేవారు. ఇప్పుడు సెల్‌ఫోన్ (Mobiles Phones) పట్టుకుని ఉండడం హోదా అనుకుంటున్నారు. అందులోనూ ఎంత ఖరీదైన సెల్‌ఫోన్ ఉంటే అంత గొప్పగా ఫీలవుతున్నారు. మారిన కాలాన్ని బట్టి.. ప్రతి పని మొబైల్ ద్వారానే అవుతోంది కాబట్టి ఇందులో తప్పులేదని సరిపెట్టుకోవచ్చు. ఇక సినీ, క్రీడా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల ఫోన్ల (celebrities) గురించి అందరికీ ఆసక్తి ఉంటుంది. సమాజంలో వారికున్న పరపతి రీత్యా ఇది సహజం కూడా. వారు ఏ కంపెనీ ఫోన్లు వాడుతున్నారు..? వాటి ఖరీదెంత..? మోడల్ ఏమిటి? అనే విషయాలు చర్చించుకునే వారు కూడా ఉంటారు.

సెల్‌ఫోన్ల చుట్టూ లిక్కర్ స్కాం..

సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసు (Delhi liquour scam case) అంతా సెల్‌ఫోన్ల చుట్టూనే తిరుగుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ, తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (CM KCR) కూతురు కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సహా ఈ కేసులోని 36 మంది వ్యక్తులు 70 పోన్లను మార్చారు అనేది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అభియోగం. తొలిసారి విచారణ సందర్భంగా కవిత నుంచి మొబైల్‌ ఫోన్‌ను ఈ నెల 11నే ఈడీ (ED Enquiry) తీసుకుంది. వాస్తవానికి ఆ రోజు విచారణకు ఆమె సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లలేదు. విచారణ క్రమంలో.. సాయంత్రం ఆమె డ్రైవర్‌ను ఇంటికి పంపి మరీ ఫోన్‌ను తెప్పించడం గమనార్హం. చివరికి మంగళవారం కవితను వరుసగా రెండో రోజు మొత్తమ్మీద మూడోసారి విచారించిన సందర్భంలోనూ ఫోన్ల విషయమే ప్రధాన పాత్ర పోషించింది. కాగా, కుంభకోణం జరిగిన సమయంలో వాడిన ఫోన్లన్నీ తేవాల్సిందిగా ఎమ్మెల్సీ కవితను ఈడీ ఆదేశించిన సంగతి తెలిసిందే.

Untitled-12.jpg

ఇవిగో ఫోన్లంటూ..

ఈడీ ఆదేశాల నేపథ్యంలో మంగళవారం విచారణకు వెళ్లేప్పుడు కవిత వెంట (MLC Kavitha ED Enquiry) మొబైల్ ఫోన్లను తీసుకెళ్లారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్లేముందు.. రెండు ప్లాస్టిక్ కవర్లలో తెచ్చిన తన మొబైల్‌ ఫోన్లను మీడియాకు చూపించి మరీ వెళ్లారు. ఇదివరకు తాను వినియోగించిన ఫోన్లను తెమ్మని ఈడీ కోరడంపై కవిత మండిపడుతూ ఈడీకి లేఖ రాశారు. ఈడీకి దురుద్దేశాలు ఉన్నప్పటికీ.. వారు అడిగిన మేరకు ఫోన్లను ఇస్తున్నానని లేఖలో తెలిపారు.

యాపిల్ 4.. మిగతావాటిలో శాంసంగ్..

కవిత మంగళవారం ఈడీ కార్యాలయానికి వెళ్తూ ఫోన్లు చూపిన సీన్ (Kavitha mobile phones).. మీడియా పతాక శీర్షికలకు ఎక్కింది. రెండు ప్లాస్టిక్ కవర్లలో ఆమె మొత్తం పది ఫోన్లు తీసుకెళ్లినట్లు కనిపించింది. వాస్తవానికి ముందు రోజు కవితను విచారణ సందర్భంగా ఈడీ ప్రత్యేక కోర్టుకు ఇచ్చిన రిమాండ్ నివేదికలో పేర్కొన్న పది ఫోన్ల గురించి ప్రశ్నించారు. అవి ఏమయ్యాయని అడగ్గా.. ధ్వంసం చేయలేదని, తన వద్దే ఉన్నాయని ఎమ్మెల్సీ బదులిచ్చారు. దీంతో మంగళవారం ఫోన్లను తీసుకురావాలని ఆదేశించారు. ఈ నెల 11న ఒకటి, 21న 10 కవితకు చెందిన మొత్తం 11 ఫోన్లు ఈడీ వద్ద ఉన్నట్లయింది. ఇక కవిత చూపించిన ప్లాస్టిక్ కవర్లలోని ఫోన్లను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. కవిత కుడి చేతిలో ఉన్న సంచిలో నాలుగు ఐఫోన్లు (iPhones) కనిపించాయి. ఇవన్నీ‘ప్లస్’ సిరీస్‌కు చెందినవేనని, జీబీ సైజు కూడా ఎక్కువేనని తెలుస్తోంది. అయితే, వీటిలో రెండు నీలం (బ్లూ) రంగు యాపిల్ ఫోన్లు (Apple phones) కాగా, ఒకటి స్కై బ్లూ కలర్‌లో ఉంది. మరోటి సిల్వర్ కలర్‌గా తెలుస్తోంది. ఇక కవిత రెండో చేతిలోని సంచిలో ఉన్ ఫోన్లు ఇతర కంపెనీలకు చెందినవి. ఇందులో ఒకటి ఫోల్డబుల్ ఫోన్ అని స్పష్టమవుతోంది. మిగతా మూడు శాంసంగ్ (Samsung), ఇతర కంపెనీలవిగా స్పష్టమవుతోంది.

Untitled-13.jpg

గులాబీ రంగు ఫోన్ లేదేం..?

కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, అందులోనూ సీఎం కేసీఆర్ కూతురు. వారి పార్టీ జెండా రంగు ‘‘గులాబీ (పింక్)’’. బీఆర్ఎస్ (BRS party) అధికారంలోకి వచ్చాక.. తెలంగాణ భవన్ (Telangana Bhavan) సహా పార్టీ, ప్రభుత్వపరంగా చేపట్టే అన్ని కార్యక్రమాల్లోనూ ఈ రంగు ఉండేలా చూస్తున్నారు. అన్నిచోట్లా గులాబీ రంగేనా..? అని విమర్శలు వస్తున్నప్పటికీ సర్కారు పెద్దలు ఏమాత్రం లెక్కచేయడం లేదు. వాస్తవానికి చూసేందుకు ప్లజెంట్‌గా ఉండే గులాబీ రంగు మహిళలకు ఎంతో ఇష్టమైనది. బీఆర్ఎస్‌కు మహిళా ఆదరణకు ఈ రంగు కూడా కొంత దోహదం చేసిందని చెప్పొచ్చు. కాగా, దుస్తులు సహా.. ఇతర కారణాల రీత్యా సహజంగానే బీఆర్ఎస్ నేతలు కూడా గులాబీ రంగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదిలా ఉంటే కవిత వాడిన మొత్తం ఫోన్లలో ఒకటి మాత్రమే గులాబీ రంగుకు దగ్గరగా ఉండడం గమనార్హం. మహిళలకు ఎంతో ఇష్టమైన గులాబీ రంగులో వివిధ కంపెనీలు ఫోన్లు తీసుకొచ్చాయి. యాపిల్ సైతం ఈ రంగులో ఎప్పటినుంచో ఫోన్లను విడుదల చేస్తోంది. అయితే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు అయిన కవిత వాడిన ఫోన్లలో గులాబీ రంగుకు దగ్గరగా ఉన్న ఫోన్ ఒక్కటే ఉండడం గమనార్హం. అది కూడా.. యాపిల్ కాకుండా ఇతర కంపెనీ ఫోన్.

మరోవైపు కవితకు చెందిన 11 ఫోన్లు ప్రస్తుతం ఈడీ వద్ద ఉన్నాయి. కవితతో పాటు.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితులైన శరత్‌ రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబు తదితరులు ఫోన్లను మార్చడం గురించి కూడా ఈడీ ప్రశ్నించిందని సమాచారం. అసలు అన్ని ఫోన్లను ఎందుకు మార్చారో అని అడగడంతో పాటు.. ఆ ఫోన్లలో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి స్కాంపై ఆరా తీశారని మీడియా కథనాలు వచ్చాయి.

వంట మనిషి.. తోడి కోడలు..

తనకంటూ సొంతంగా ఫోన్ ఉండదని.. అయితే, యాపిల్ సిరీస్ కొత్తగా వస్తే మాత్రం కొంటూ ఉంటామని గతంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో కవిత చెప్పారు. అంతేకాదు.. తన ఫోన్‌ను వంట మనిషి, తోటి కోడలు వాడుతుంటారని తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్నందున.. చేతిలో ఫోన్ పట్టుకోనని కూడా వ్యాఖ్యానించారు. దాదాపు ఇదే విషయాలను ఆమె మంగళవారం ఈడీ విచారణలోనూ చెప్పినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-03-22T20:00:25+05:30 IST