DK Shivakumar: మల్లికార్జున ఖర్గేతో రెండు గంటల సుదీర్ఘ భేటీ తర్వాత డీకే చెప్పిందొక్కటే..!

ABN , First Publish Date - 2023-05-17T18:52:10+05:30 IST

కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. కర్ణాటక సీఎం పోస్టు కోసం రేసులో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక నేత సిద్ధరామయ్య..

DK Shivakumar: మల్లికార్జున ఖర్గేతో రెండు గంటల సుదీర్ఘ భేటీ తర్వాత డీకే చెప్పిందొక్కటే..!

కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి (Karnataka CM Row) ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. కర్ణాటక సీఎం పోస్టు కోసం రేసులో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (KPCC President DK Shiva Kumar), మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక నేత సిద్ధరామయ్య (Siddaramaiah) పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో (Mallikarjun Kharge) ఇద్దరూ ఎడతెగని భేటీలతో ఉత్కంఠను మరింత పెంచుతుండటం గమనార్హం. కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా నిర్ణయించిందని.. గురువారం సాయంత్రం కంఠీరవ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారని జాతీయ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇంకా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రణ్‌దీప్ సూర్జేవాలా కుండబద్ధలు కొట్టడంతో ఇంకా ఏం తేలలేదని స్పష్టమైంది.

DK-Shivakumar.jpg

ఈ క్రమంలో.. డీకే శివకుమార్ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు, తన గురువు అయిన మల్లికార్జున ఖర్గేతో భేటీ అయి చర్చించారు. ఈ భేటీ దాదాపు 2 గంటలకు పైగా సుదీర్ఘంగా సాగింది. అంతకు మునుపు రాహుల్ గాంధీతో కూడా చర్చించిన డీకే అధిష్టానం ముందు అనూహ్య ప్రతిపాదన తీసుకొచ్చారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేకపోతే మల్లికార్జున ఖర్గేకు ఇవ్వాలని రాహుల్ గాంధీ ముందు డీకే స్పష్టం చేసినట్లు సమాచారం. డీకే శివకుమార్ చేసిన ఈ ప్రతిపాదనతో ఒక విషయం మాత్రం స్పష్టమైంది. ఎట్టి పరిస్థితుల్లో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా అంగీకరించనని డీకే శివకుమార్ స్పష్టం చేసినట్లు సమాచారం.

kharge.jpg

పవర్ షేరింగ్ ఫార్ములాకు కూడా డీకే సిద్ధంగా లేరు. తనకు ఇవ్వని పక్షంలో మల్లికార్జున ఖర్గేకు అవకాశం ఇవ్వాలే కానీ సిద్ధరామయ్యను సీఎంను చేస్తే మాత్రం సహించేది లేదని డీకే పరోక్షంగా రాహుల్‌కు ఈ ప్రతిపాదనతో చెప్పినట్టయింది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్న ఈ పోరులో డీకే శివకుమార్ వేగంగా పావులు కదుపుతున్నారు.

2Siddaramaiah.jpg

కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ తన మద్దతుదారులతో కలిసి ఢిల్లీలోని తన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ నివాసంలో సమావేశం నిర్వహించారు. ‘ఏం చేద్దాం..? కిం కర్తవ్యం ఏంటి’..? అనే విషయాలపై డీకే శివకుమార్ తనకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలతో చర్చించడం గమనార్హం. ఈ సమావేశం తాలూకా ఫొటోలు కూడా బయటికొచ్చాయి. డీకే ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక సమావేశంలో మగడి బాలకృష్ణ, బేలూరు గోపాలకృష్ణ, కునిగల్ రంగనాథ్, ఇక్బాల్ హుస్సేన్.. ఎమ్మెల్యేలు శ్రీనివాస్, వీరేంద్ర పప్పి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-17T18:52:13+05:30 IST