Vizag Jagan House: అబ్బో.. విశాఖలో జగన్ ఇంటి కోసం సీక్రెట్‌గా పెద్ద కథే నడుస్తోందిగా..!

ABN , First Publish Date - 2023-02-07T13:31:06+05:30 IST

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (AP CM Jagan Reddy) విశాఖకు (Visakhapatnam) వెళ్లేందుకు తహతహలాడుతున్నారా..? ఉగాది (Ugadi) రోజున గృహప్రవేశానికి ముహూర్తం కుదిరిందా..? గోప్యంగా జగన్ ఇంటి (Vizag Jagan House) కోసం అన్వేషణ సాగుతోందా..?

Vizag Jagan House: అబ్బో.. విశాఖలో జగన్ ఇంటి కోసం సీక్రెట్‌గా పెద్ద కథే నడుస్తోందిగా..!

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (AP CM Jagan Reddy) విశాఖకు (Visakhapatnam) వెళ్లేందుకు తహతహలాడుతున్నారా..? ఉగాది (Ugadi) రోజున గృహప్రవేశానికి ముహూర్తం కుదిరిందా..? గోప్యంగా జగన్ ఇంటి (Vizag Jagan House) కోసం అన్వేషణ సాగుతోందా..? బీచ్ రోడ్డులో అనువైన ఇంటి కోసం రహస్యంగా వెతుకులాట మొదలైందా..? విశాఖలో జగన్ ఇంటి కోసం రూ.100 కోట్లు (Jagan House 100 Crores) ఖర్చు చేస్తున్నారనే వార్తల్లో నిజమెంత..? బెంగళూరు ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్‌లో (Tadepalli Palace) తలదన్నేలా విశాఖలో జగన్ ఉండబోయే ఇల్లు ఉంటుందా..? తాడేపల్లి ఇంటి మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తోంది..? తాడేపల్లి ప్యాలెస్‌లో ఫర్నీచర్‌ కోసం అధికారికంగా ఖర్చు పెట్టిందెంత..? ఉగాది లోపు మాట నెగ్గించుకోవాలని జగన్ సర్కార్ ఎందుకు భావిస్తోంది..? విశాఖలో రుషికొండను తవ్వేస్తూ గ్రీన్ కవరింగ్ చేస్తుండటం వెనుక మతలబు ఏంటి..? విశాఖపట్నంలో సీఎం జగన్ రెడ్డి ఇంటి కోసం జరుగుతున్న అన్వేషణపై, తాజా పరిణామాలపై ప్రత్యేక కథనం.

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చీరాగానే ప్రజావేదిక కూల్చివేతతో అమరావతిపై వైసీపీ ప్రభుత్వ వైఖరేంటో ప్రజలకు స్పష్టంగా చెప్పేశారు. ఆ తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనతో ‘ఆంధ్రుల రాజధాని అమరావతి’ అనే ప్రజల ఆకాంక్షను కాలగర్భంలో కలిపే ప్రయత్నం చేశారు. తాడేపల్లిలో ప్యాలెస్ నిర్మించుకున్నప్పటికీ ఆ రాజధాని ప్రాంతంలో వీచే గాలిని పీల్చుకునేందుకు కూడా జగన్ సిద్ధంగా ఉన్నట్టు లేరు. అందుకే ఆ ప్యాలెస్‌ను ఉన్నపళంగా ఖాళీ చేసి సాగర తీరంలో సేద తీరాలని ఫిక్స్ అయ్యారు. అంతేకాదు.. అమరావతిపై సుప్రీం కోర్టులో దాఖలైన కేసుల విచారణ త్వరగా తేల్చాలని న్యాయస్థానాలను కూడా వైసీపీ సర్కార్ తొందరపెడుతోంది. కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా వీలైనంత తొందరగా విశాఖకు వెళ్లి పంతం నెగ్గించుకోవాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలిసింది. ఒకపక్క ఫోన్ ట్యాపింగ్ వివాదం, మరోపక్క వివేకా కేసులో సీబీఐ దూకుడుతో బుర్ర హీటెక్కిపోతున్న పరిస్థితుల్లో.. వీటన్నింటికీ దూరం జరిగి బీచ్ రోడ్డులో ఇల్లు తీసుకుని రిలాక్స్ అవ్వాలని వైసీపీ అధినేత యోచిస్తున్నట్లు సమాచారం. మూడు రాజధానుల ముచ్చట ఒక కొలిక్కి రాలేదు. హుటాహుటిన విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించాలని తహతహలాడుతున్నా... కోర్టు కేసులు అడ్డంకిగా నిలిచాయి. దీంతో కనీసం అక్కడ తన క్యాంపు కార్యాలయాన్నైనా ఏర్పాటు చేసుకోవాలని సీఎం జగన్‌ యోచిస్తున్నట్లు సమాచారం! తద్వారా మూడు రాజధానుల విషయంలో ఏదో ఒకటి చేశామనిపించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.

బహుశా... మార్చి నెల మూడోవారంలోనే విశాఖలో సీఎం క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేసుకునే అవకాశముంది. గత వారం ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో... త్వరలోనే తాను విశాఖకు మకాం మారుస్తానని సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతకుముందే దీనిపై విశాఖ జిల్లా యంత్రాంగానికి సమాచారం అందినట్లు సమాచారం. జిల్లా యంత్రాంగం అత్యంత గోప్యంగా సీఎం క్యాంప్‌ ఆఫీసు కోసం భవనాల అన్వేషణ జరుపుతోంది. దీనిని రుషికొండపైన నిర్మిస్తున్న పర్యాటకశాఖ ప్రాజెక్టు భవనాల్లో ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. కానీ... మార్చి మూడో వారానికి రుషికొండపై నిర్మాణాలు పూర్తికావని అధికారులు అంచనాకు వచ్చారు. దీంతో తాత్కాలికంగా రుషికొండ, ఐటీ హిల్స్‌, మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం నాలుగైదు భవనాలను పరిశీలించారు. బీచ్‌ రోడ్డులోని కొన్ని భవనాలతోపాటు... ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉప కులపతి, రిజిస్ట్రార్‌ బంగ్లాలను కూడా పరిశీలించారు. ఈ అన్వేషణ మొత్తం గోప్యంగానే సాగుతోంది.

ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్తు పక్క నుంచి అధికారులు రహదారి విస్తరణ పనులు చేపట్టడం కూడా ఆ మార్గంలో జగన్ కొత్త ఇల్లు ఉండబోతోందనే ప్రచారానికి కారణమైంది. రూ.100 కోట్లయినా పర్లేదని, తాడేపల్లి ప్యాలెస్‌ను తలదన్నే రీతిలో ఇల్లు ఉండాలని అధిష్టానం నుంచి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. విశాఖ రాజధానిగా వైసీపీ తలచినట్లు జరిగితే జగన్ పర్మినెంట్ నివాసం కూడా దాదాపుగా ఉగాది నుంచి ఉండబోయే ఆ ఇల్లే అవుతుందని తెలుస్తోంది. ఉగాది లోపు క్యాంపు కార్యాలయం కమ్ ఇంటిని చూసుకుని మార్చి 22 లేదా 23 తేదీల్లో గృహ ప్రవేశం చేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

విశాఖలో విలాసవంతమైన ఇంటి కోసం జగన్ కోట్లు ఖర్చు చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో వైసీపీ అధినేతపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఆరో తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జగన్ సర్కార్.. కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధపడి జగన్ కొత్త ఇంటి కోసం వెతుకులాడటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్‌కు పెట్టిన ఖర్చును గుర్తుచేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే ఆయన తాడేపల్లి ప్యాలెస్‌కు సంబంధించి ప్రజాధనాన్ని భారీగానే ఖర్చు చేశారు. 2019 నవంబర్‌లో వైసీపీ సర్కార్ అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం.. తాడేపల్లి ప్యాలెస్‌ మెయింటెనెన్స్‌కు జీవో నంబర్.307 విడుదల చేసి కోటీ 20 లక్షల రూపాయలు మంజూరు చేశారు. జీవో నంబర్ 308 కింద తాడేపల్లి ప్యాలెస్‌లో ఫర్నీచర్ నిమిత్తం రూ.39 లక్షలు మంజూరు చేశారు. జీవో నంబర్.306 కింద హైదరాబాద్‌లోని జగన్ లోటస్‌పాండ్ నివాసంలో ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం రూ.35.5 లక్షలు విడుదల చేశారు.

2019 అక్టోబర్‌లో జగన్ తాడేపల్లి ఇంట్లో అల్యూమినియం కిటికీల ఏర్పాటు కోసం రూ.73 లక్షలు ఖర్చు చేశారు. అదే సంవత్సరం జులైలో 3.63 కోట్ల రూపాయలు తాడేపల్లి నివాసంలో ఎలక్ట్రో-మెకానికల్ పనుల కోసం ప్రభుత్వం మంజూరు చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే తాడేపల్లి ప్యాలెస్‌పై జగన్ సర్కార్ ఖర్చు చేసిన ప్రజా ధనం అంతాఇంతా కాదు. ఒక్క రూపాయి జీతం తీసుకుంటున్నారని అప్పట్లో జగన్‌ను ఆకాశానికెత్తేసిన వైసీపీ నేతలకు ఈ కోట్ల రూపాయల ఖర్చు గురించి గుర్తులేకపోవడం శోచనీయం. ఇక.. జగన్ బెంగళూరు ప్యాలెస్ గురించి కథలుకథలుగా అప్పట్లో చెప్పుకున్న సంగతి తెలియంది కాదు. జగన్ ఇప్పటివరకూ ఉన్న నివాసాలను పరిశీలిస్తే.. విలాసవంతమైన ఇంటికి వైసీపీ అధినేత ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదేమైనా.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జగన్ సర్కార్ రాజధానిపై సుప్రీంలో విచారణ సాగుతుండగానే కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడి కొత్త ఇంటి కోసం వెతుకులాట సాగిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. పైగా.. విశాఖను రాజధానిగా చేసుకుని పాలన సాగిస్తామని చెబుతున్న జగన్ సర్కార్ రుషికొండను బోడిగుండు చేయడంపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రుషికొండపై (Rushikonda) పర్యావరణ విధ్వంసం పరిశీలనకు వచ్చే కేంద్ర కమిటీ సభ్యులను ఏమర్చే యత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. హరిత రిసార్ట్స్‌ పునర్మిర్మాణం పేరుతో రుషికొండపై గత రెండేళ్లుగా పనులు సాగుతున్నాయి. ఇందుకోసం రుషికొండను ఇష్టానుసారం తవ్వేసి, బోడిగుండు చేసిసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో, నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో కేసులు నడుస్తున్నాయి. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని, అనుమతించిన విస్తీర్ణానికి మించి కొండను తవ్వేశారంటూ ఆధారాలతో సహా కొంతమంది హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో.. హైకోర్టు నియమించిన కమిటీ పరిశీలనకు రానున్న నేపథ్యంలో ‘జియో మ్యాటింగ్‌’ పేరుతో కొండను తవ్విన ప్రదేశంలో ఆకుపచ్చ రంగు ఉన్న మెష్‌‌ను జగన్ సర్కార్ ఏర్పాటు చేయడం కొసమెరుపు.

Updated Date - 2023-02-07T13:32:00+05:30 IST