DK ShivaKumar or Siddaramaiah: సీఎం సీటంటే మాటలా.. డీకే, సిద్ధరామయ్య.. ఇద్దరూ సైలెంట్‌గా ఇంత చేశారా..?

ABN , First Publish Date - 2023-05-15T17:33:41+05:30 IST

కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది సరే.. ముఖ్యమంత్రి ఎవరు ? డీకేనా లేదా సిద్ధరామయ్యనా..? కాంగ్రెస్ హైకమాండ్ ఎవరి వైపు మొగ్గుచూపుతుంది..? అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో..

DK ShivaKumar or Siddaramaiah: సీఎం సీటంటే మాటలా.. డీకే, సిద్ధరామయ్య.. ఇద్దరూ సైలెంట్‌గా ఇంత చేశారా..?

కర్ణాటకలో కాంగ్రెస్ (Karnataka Congress) గెలిచింది సరే.. ముఖ్యమంత్రి ఎవరు ? డీకేనా లేదా సిద్ధరామయ్యనా..? కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) ఎవరి వైపు మొగ్గుచూపుతుంది..? అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో ఈ ప్రశ్నలే హాట్ టాపిక్‌గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మించి డీకే, సిద్ధరామయ్యలో ఎవరు సీఎం అవుతారనే ప్రశ్నపై కోట్లలో బెట్టింగ్‌లు సాగుతున్నాయి. కర్ణాటక కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న డీకే, సిద్ధరామయ్య ఎవరికి వారు తానే సీఎం అవుతాననే ధీమాతో ఉన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చుకునే విషయంలో ఎవరికి వారు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

డీకే శివకుమార్‌కు మఠాధిపతులు, ఒక్కలిగ సంఘం అండగా నిలిచింది. డీకే శివకుమార్‌ గెలుపొందిన ఎమ్మెల్యేలతో ఆదివారం ఉదయం సదాశినగర్‌లో భేటీ అయ్యారు. మధ్యాహ్నం తుమకూరు జిల్లాలోని నొణవినకెరె మఠానికి వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సిద్దగంగామఠానికి వెళ్లి శివకుమారస్వామిజీ సమాధికి పూజలు చేశారు. ఈలోగానే విజయనగర్‌లోని ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానందనాథస్వామిజీ, స్ఫటికానందపురి మఠాధిపతి నంజావధూత స్వామిజీ సమక్షంలో కీలక సమావేశం జరిగింది. ఒక్కలిగ సంఘం అధ్యక్షుడు సీఎన్‌ బాలకృష్ణ, కరవే అధ్యక్షుడు నారాయణగౌడ సమక్షంలో ఒక్కలిగ సమాజం నుంచి గెలుపొందిన 29 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఒక్కలిగలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందేనని నిర్మలానందనాథ స్వామిజీ డిమాండ్‌ చేశారు. ఇదే అభిప్రాయాన్ని ప్రస్తావించేలా మాగడి ఎమ్మెల్యే బాలకృష్ణకు బాధ్యతలు అప్పగించారు.

మరోవైపు సిద్దరామయ్య ఆదివారం ఉదయం నుంచి బిజీగానే గడిపారు. ఆయనకు ఆప్తుడు, శిష్యుడు హెబ్బాళ్‌ ఎమ్మెల్యే బైరతి సురేశ్‌ అపార్ట్‌మెంట్‌లో రహస్య సమావేశం నిర్వహించారు. ఆప్తులైన సీనియర్లు ఆర్‌వీ దేశ్‌పాండే, మహదేవప్పతోపాటు 20 మందికి పైగా కలసినట్టు సమాచారం. మధ్యాహ్నం తర్వాత సీనియర్‌ నేత కేజే జార్జ్‌ నివాసానికి మకాం మార్చారు. అక్కడికి 40-50 మంది దాకా ఎమ్మెల్యేలు చేరారు. అనంతరం సాయంత్రం హోటల్‌ వద్ద డీకే, సిద్దూ అభిమానులు వీరంగం చేశారు. ఇద్దరి తరపున ప్లకార్డులు ప్రదర్శించి జిందాబాద్‌లతో హోరెత్తించారు. కర్ణాటక కాంగ్రెస్‌లో జరిగిన, జరుగుతున్న ఈ పరిణామాలతో ఒక విషయం మాత్రం స్పష్టమైంది. కాంగ్రెస్ అధిష్టానం మధ్యే మార్గంగా.. డీకే శివకుమార్‌కు, సిద్ధరామయ్యకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే తప్ప ఏ ఒక్కరిని ముఖ్యమంత్రిగా ప్రకటించినా కర్ణాటక కాంగ్రెస్‌లో కల్లోల పరిణామాలు చోటుచేసుకునే పరిస్థితి లేకపోలేదు.

Updated Date - 2023-05-15T17:34:42+05:30 IST