AP MLC Election Results: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ బ్యాచ్‌కి మైండ్‌ బ్లాంక్‌.. రాజకీయ పరిశీలకులు ఏమంటున్నారంటే..

ABN , First Publish Date - 2023-03-18T17:20:45+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికలు (AP MLC Results) భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను తలపించేలా నువ్వా నేనా అంటూ హోరాహోరీగా సాగాయి. వెలువడ్డ ఫలితాలు, కౌంటింగ్‌ తీరు చూస్తే..

AP MLC Election Results: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ బ్యాచ్‌కి మైండ్‌ బ్లాంక్‌.. రాజకీయ పరిశీలకులు ఏమంటున్నారంటే..

ఎమ్మెల్సీ ఎన్నికలు (AP MLC Results) భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను తలపించేలా నువ్వా నేనా అంటూ హోరాహోరీగా సాగాయి. వెలువడ్డ ఫలితాలు, కౌంటింగ్‌ తీరు చూస్తే ఇది స్పష్టమవుతోంది. వైసీపీ (YCP) తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలింగ్‌ కేంద్రాల సాక్షిగానే డబ్బు పంపిణీ, విచ్చలవిడిగా వలంటీర్ల వినియోగం, దొంగ ఓట్లు వేయించుకున్నా.. మేధావులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల తీర్పు ముందు అధికార దుర్వినియోగం పనిచేయలేదు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఓటరు తను అనుకున్న దానినే సైలెంట్‌గా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తీర్పు ఇచ్చారు. ఫలితాలు చూసి వైసీపీ నేతలకు మైండ్‌ బ్లాక్‌ అయింది. మరికొందరు నిర్వేదంలోకి వెళ్లిపోయారు.

కడప (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండింటిని కలిసి ప్రభుత్వంపై అటు ఉద్యోగ, ఇటు గ్రాడ్యుయేట్‌లలో వ్యతిరేకత లేదని చెప్పాలని సర్వశక్తులు ఒడ్డింది. కడప జిల్లాలో వైసీపీ మద్దతుదారుడుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి ఎంవీ రామచంద్రారెడ్డిని బలపరచగా, పట్టభద్రుల స్థానానికి వెన్నపూస రవీంద్రారెడ్డిని నిలబెట్టింది. గెలుపు కోసం అన్ని అడ్డదారులు వాడుకున్నట్లు చెబుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ రాంగోపాల్‌రెడ్డిని నిలబెట్టింది. ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో వైసీపీ అభ్యర్థులు ప్రైవేటు ఉపాధ్యాయుల ఓట్ల కోసం రూ.5 వేలు పంచగా మరొక అభ్యర్థి ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు రూ.5వేలు పంచారు. పట్టభద్రులకు రూ.1000 చొప్పున పోలింగ్‌ కేంద్రాల వద్ద విచ్చలవిడిగా పంపిణీ చేశారు.

వైసీపీ నేతల మైండ్‌ బ్లాంక్‌

ఓటుకు నోటు ఇచ్చాం. గెలుపు మాదే అంటూ వైసీపీ నేతలు ధీమాతో ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీలో వైసీపీ గెలిస్తే రూ.లక్ష, టీడీపీ గెలిస్తే రూ.3లక్షలు పందెం అంటూ కొందరు బెట్టింగ్‌ పెట్టినట్లు చెబుతారు. అయితే ఫలితాలు చూసి వైసీపీ బ్యాచ్‌కి మైండ్‌ బ్లాంక్‌ అయింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో వైసీపీ మద్దతుదారుడుగా ఎంవీ రామచంద్రారెడ్డి, పీడీఎఫ్‌ నుంచి కత్తి నరసింహారెడ్డి, ఒంటేరు శ్రీనివాసరెడ్డి, అనిల్‌ ప్రసాదరెడ్డి, సీవీ నారాయణరెడ్డితో పాటు పలువురు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఓ ఇద్దరు అభ్యర్థులు సుమారు రూ.20కోట్లకు పైగా ఖర్చుచేసినట్లు చెబుతారు. గెలుపు వన్‌సైడ్‌ అని భావించారు. పోటీలో ఎక్కువ మంది ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలి మంచి మెజార్టీతో గెలుస్తామని భావించారు. అయితే కేవలం 169 ఓట్లతో రామచంద్రారెడ్డి, సమీప అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డిపై గెలిచారు. అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి చావుతప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచామని కొందరు వైసీపీ నేతలు నిట్టూరుస్తున్నారు. అనిల్‌, నారాయణరెడ్డి, కత్తినరసింహారెడ్డికి ఒకటో ప్రాధాన్యత ఓటు వేసన వారు రెండు మూడు ప్రాధాన్యత ఓట్లను రామచంద్రారెడ్డికి వేయడంతో స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. దీనిని వైసీపీ ఇది గెలుపే అంటూ చెప్పుకోలేక ఇబ్బంది పడుతోంది.

గ్రాడ్యుయేట్లు నువ్వా-నేనా

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోరులో టీడీపీ బరిలో లేదు. పీడీఎప్‌ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి మద్దతు ఇచ్చింది. పట్టభద్రుల అభ్యర్థిగా రామగోపాల్‌రెడ్డిని బరిలో నిలిపింది. పట్టభద్రులకు రూ.వేయి చొప్పున పంచడం, దొంగ ఓట్లు వేశారనే ఆరోపణలు వచ్చాయి. డబ్బు పంచాం, దొంగ ఓట్లు వేసుకున్నాం గెలుపు మాదే అనే ధీమా వైసీపీ బ్యాచ్‌లో ఉండేది. కౌంటింగ్‌ మొదలైన తర్వాత వారి భ్రమలు తగ్గుతూ వచ్చాయి. మొదటి రౌండ్‌లో రామగోపాల్‌రెడ్డికి 8,801 ఓట్లు రాగా, రవీంద్రరెడ్డికి 9,467ఓట్లు, రెండో రౌండ్‌లో రామగోపాల్‌రరెడ్డికి 8,851, వైసీపీకి 9,855, మూడో రౌండ్‌లో టీడీపీకి 9,227, వైసీపీకి 9,353, నాలుగో రౌండ్‌లో టీడీపీకి 9,794, వైసీపీకి 9,216.. తొమ్మిదవ రౌండు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థికి 82,740 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 84,153 ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్‌లోను నువ్వా నేనా అన్నట్లుగా వైసీపీకి ధీటుగా టీడీపీకి ఓట్లు వచ్చాయి. కౌంటింగ్‌లో ఓట్లను చూసి వైసీపీలో వణుకు పుట్టింది. అటు ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయుల షాక్‌ నుంచి తేరుకోకముందే అంతకుమించి డబుల్‌ షాక్‌ను గ్రాడ్యుయేట్‌ ఓట్లు ఇస్తున్నారు. ఏ ఎన్నికైనా సరే గెలుపు వైసీపీదే అంటూ సోషల్‌ మీడియాలో వైసీపీ హోరెత్తించేది. అయితే పట్టభద్రుల ఓట్లతో వైసీపీ నేతల కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. ఎక్కడా వైసీపీ నేతల హడావిడి కనిపించలేదు.

ఓటరు మూడేంటో తెలిసింది

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటరు మూడ్‌ను తెలియజేశాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో కడప జిల్లాలో 58,560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 6,813 మంది ఉపాధ్యాయులు ఓట్లు వినియోగించుకున్నారు. పట్టభద్రుల ఓటింగ్‌ పరిశీలిస్తే ఓటర్‌ మూడేంటో ఇట్టే అర్థమవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. డబ్బు పంచి, అధికార బలం ఉపయోగించినా.. ప్రస్తుత పరిస్థితిని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అభివృద్ధిని మరచి నవరత్నాలునమ్ముకున్నామని, కేవలం బటన్‌ నొక్కడం వల్ల మా వెంటే ఉన్నారనుకున్నామనే భ్రమలో ఉన్నామని వాపోతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఓటరు తీరుతో జనం నాడి అర్థమవుతోంది. డేంజర్‌ బెల్స్‌ మోగినట్లేనని వైసీపీ నేతలు అంటున్నారు.

Updated Date - 2023-03-21T12:21:05+05:30 IST