AP CM Jagan Chappals Cost: ఓరి దేవుడోయ్.. ఏపీ సీఎం జగన్ రెడ్డి కాళ్లకున్న చెప్పులు అంత కాస్ట్లీనా..?

ABN , First Publish Date - 2023-05-17T12:03:58+05:30 IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan Reddy) రూటే సపరేటు. ఆయన ఏం చేసినా రిచ్‌గానే ఉంటుంది. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలకు తావివ్వడంలో..

AP CM Jagan Chappals Cost: ఓరి దేవుడోయ్.. ఏపీ సీఎం జగన్ రెడ్డి కాళ్లకున్న చెప్పులు అంత కాస్ట్లీనా..?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan Reddy) రూటే సపరేటు. ఆయన ఏం చేసినా రిచ్‌గానే ఉంటుంది. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలకు తావివ్వడంలో ఆయనను మించిన సీఎం ఉండకపోవచ్చు. ఇల్లు మొదలుకుని ఆయన కాళ్లకు తొడుక్కునే చెప్పుల దాకా ప్రతీ అంశం చర్చనీయాంశం అవుతుండటం గమనార్హం. కాళ్లకు తొడుక్కునే పాదరక్షలకు ఎవరైనా ఎంత డబ్బు వెచ్చిస్తారు? రూ.500, రూ.1000 పోనీ కాస్త కాస్ట్లీగా కొనుక్కునే వాళ్లు 10,000 వరకూ ఖర్చు చేసి చెప్పులు కొనుక్కుంటారేమో బహుశా. ఎంత బ్రాండెడ్ చెప్పులకైనా 50,000 వరకూ ఖర్చు చేస్తారేమో. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ దేశంలోనే సంపన్న సీఎంల్లో ఒకరు కావడంతో ఆయన స్థాయికి తగ్గట్టుగా లక్ష రూపాయల విలువైన చెప్పులు వాడుతున్నారని టీడీపీ ఎద్దేవా చేసింది. ఏపీ సీఎం జగన్ రెడ్డి చెప్పుల విలువ (CM Jagan Chappals Cost) అక్షరాలా 1,34,800 రూపాయలుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది.

FwI7Q4yWYAEJHVb.jpg

ఏపీలో అప్పుడే ఎన్నికలొచ్చేశాయనే రీతిలో టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని రెండు పార్టీలు వదిలిపెట్టడం లేదు. సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నాయి. తాజాగా.. టీడీపీ సోషల్ మీడియా విభాగం కూడా జగన్ చెప్పుల విలువను హైలైట్ చేస్తూ పోస్టులతో వైసీపీకి చుక్కలు చూపిస్తోంది. ఈ విమర్శలను ఎలా తిప్పి కొట్టాలో తెలియక వైసీపీ సోషల్ మీడియా మల్లగుల్లాలు పడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమీక్షల్లో, చివరకు అసెంబ్లీలో కూడా 60 రూపాయల ఖరీదైన హిమాలయా వాటర్ బాటిల్ నీళ్లు తాగుతున్నారని, కాస్టీ వాటర్ బాటిల్స్ వినియోగిస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అప్పట్లో వైసీపీ పనిగట్టుకుని మరీ దుష్ప్రచారం చేసింది. జగన్ ఒక్క రూపాయి జీతం తీసుకుంటున్న సీఎం అని, ఆయన జీతం డబ్బులను కూడా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్న మహా నేతగా జగన్ రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా ఆకాశానికెత్తేసింది. మరి.. ఈ చెప్పుల సంగతి ఏంటని అడిగితే వైసీపీ సోషల్ మీడియా విభాగం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం కొసమెరుపు. పైగా.. జగన్ కాళ్లకు తొడుక్కున్న చెప్పులు, లక్ష రూపాయల విలువైనవిగా చెబుతున్న చెప్పులు వేరువేరని చెప్పుకొస్తుండటం కవర్ చేయడానికి వైసీపీ పడుతున్న పాట్లకు అద్దం పడుతోంది.

jagan-london.jpg

ఒక్క చెప్పులు మాత్రమే కాదు జగన్ తాడేపల్లిలో తన ఇంటి కోసం వెచ్చించిన ఖర్చు కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే తాడేపల్లి ప్యాలెస్‌కు సంబంధించి ప్రజాధనాన్ని భారీగానే ఖర్చు చేశారు. 2019 నవంబర్‌లో వైసీపీ సర్కార్ అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం.. తాడేపల్లి ప్యాలెస్‌ మెయింటెనెన్స్‌కు జీవో నంబర్.307 విడుదల చేసి కోటీ 20 లక్షల రూపాయలు మంజూరు చేశారు. జీవో నంబర్ 308 కింద తాడేపల్లి ప్యాలెస్‌లో ఫర్నీచర్ నిమిత్తం రూ.39 లక్షలు మంజూరు చేశారు. జీవో నంబర్.306 కింద హైదరాబాద్‌లోని జగన్ లోటస్‌పాండ్ నివాసంలో ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం రూ.35.5 లక్షలు విడుదల చేశారు. 2019 అక్టోబర్‌లో జగన్ తాడేపల్లి ఇంట్లో అల్యూమినియం కిటికీల ఏర్పాటు కోసం రూ.73 లక్షలు ఖర్చు చేశారు. అదే సంవత్సరం జులైలో 3.63 కోట్ల రూపాయలు తాడేపల్లి నివాసంలో ఎలక్ట్రో-మెకానికల్ పనుల కోసం ప్రభుత్వం మంజూరు చేసింది.

JAGAN.jpg

ఇలా చెప్పుకుంటూ పోతే తాడేపల్లి ప్యాలెస్‌పై జగన్ సర్కార్ ఖర్చు చేసిన ప్రజా ధనం అంతాఇంతా కాదు. ఒక్క రూపాయి జీతం తీసుకుంటున్నారని అప్పట్లో జగన్‌ను ఆకాశానికెత్తేసిన వైసీపీ నేతలకు ఈ కోట్ల రూపాయల ఖర్చు గురించి గుర్తులేకపోవడం శోచనీయం. ఇక.. జగన్ బెంగళూరు ప్యాలెస్ గురించి కథలుకథలుగా అప్పట్లో చెప్పుకున్న సంగతి తెలియంది కాదు. మొత్తంగా చూసుకుంటే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ధరించిన చెప్పుల విలువ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ మరోసారి పోస్టుల యుద్ధం చేసుకునేందుకు కారణమైంది.

Updated Date - 2023-05-17T17:18:07+05:30 IST