Jagan Publicity Stunts: ‘నవ్వాపుకుంటున్నావ్ కదా’.. అన్ని కబుర్లు చెప్పిన వైసీపీ ఎంతకు తెగించిందంటే..

ABN , First Publish Date - 2023-02-09T17:10:26+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు (AP Politics) వడివడిగా వేస్తున్న అడుగులు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఒకపక్క నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Nara Lokesh Yuvagalam Padayatra), మరోపక్క బస్సు యాత్రకు..

Jagan Publicity Stunts: ‘నవ్వాపుకుంటున్నావ్ కదా’.. అన్ని కబుర్లు చెప్పిన వైసీపీ ఎంతకు తెగించిందంటే..

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు (AP Politics) వడివడిగా వేస్తున్న అడుగులు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఒకపక్క నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Nara Lokesh Yuvagalam Padayatra), మరోపక్క బస్సు యాత్రకు జగన్ (Jagan Bus Yatra) సిద్ధమవుతుండటం, వారాహితో పవన్ రాజకీయ యాత్రకు (Pawan Kalyan Varahi) శ్రీకారం చుట్టడం.. ఇలా నేతలంతా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాల్లో బిజీబిజీగా ఉన్నారు. సోషల్ మీడియా (Social Media) కూడా ఈరోజుల్లో రాజకీయాలకు ప్రభావితం చేసే స్థాయిలో ఉండటంతో ఈ ప్రధాన పార్టీలకు చెందిన సోషల్ మీడియా విభాగాలు కూడా ఫుల్ యాక్టివ్‌గా రంగంలోకి దిగిపోయాయి. ప్రత్యర్థులపై సెటైర్లు, కౌంటర్లతో చెలరేగిపోతున్నాయి. వీటికి తోడు రాజకీయ పార్టీలు తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు ఈ మధ్య తలుపుకు అంటించే స్టిక్కర్లతో (Stickers) చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాయి.

తాజాగా.. జగన్ సర్కార్ (Jagan Govt) అలాంటి వ్యూహమే రచించింది. అయితే.. గతంలో ‘థ్యాంక్యూ సీఎం సార్’ అని ఆటో వెనకాల బోర్డు పెట్టాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన పబ్లిసిటీ పిచ్చికి నిదర్శనమని వైసీపీ అప్పట్లో నీతులు చెప్పింది. అన్ని నీతులు చెప్పిన వైసీపీ తాజాగా.. సొంత డబ్బా కొట్టుకోవడంలో మరో అడుగు ముందుకేసింది. ప్రతి ఇంటిలో వైఎస్‌ జగన్‌ ఫొటో ఉండేలా పక్కా రాజకీయ ప్రచారపర్వానికి తెర తీస్తోంది. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ ఇంటి గుమ్మాలకు స్టిక్కర్లు వేసేందుకు సిద్ధమవుతోంది. కొత్తగా పార్టీ స్థాయిలో నియమించిన గృహసారథుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.

ఇంటి యజమాని అనుమతితో ఈ స్టిక్కర్లు ప్రతి ఇంటికీ అంటించేలా.. కార్యాచరణను అధికార పార్టీ ప్రారంభించింది. అయితే, గ్రామం, వార్డుల్లో భిన్న రాజకీయ అభిప్రాయాలు కలిగిన కుటుంబాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వలంటీర్లను ముందు పెట్టనున్నారు. ప్రజలకు వలంటీర్ల ముఖాలు సుపరిచితం. అందువల్ల పార్టీ కార్యకర్తతో పోల్చితే వలంటీర్లకు గ్రామం, వార్డుల్లో చొరవ ఎక్కువ. భిన్న రాజకీయాలతో ఉండే కుటుంబాల్లోకి చొచ్చుకువెళ్లగలిగే అవకాశం వారికి ఉంటుంది. దీంతో వలంటీర్ల సహకారంతో, గృహసారథుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా జయప్రదం చేయాలని ఆ పార్టీ ఇప్పటికే తన శ్రేణులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. సచివాలయాల్లోకి వెళ్తుంటే వైసీపీ కార్యాలయానికి వెళ్తున్నట్లుందని ఇప్పటికే గ్రామాల్లో వినిపిస్తోన్న మాట. స్టిక్కర్ల కార్యక్రమం కూడా ప్రారంభమైతే ఇళ్లల్లో కూడా వైసీపీ రంగులు, జగన్‌ బొమ్మలతో నిండిపోతాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లేది లేదని జగన్‌ చెబుతూ వస్తున్నారు. కానీ, స్టిక్కర్ల హడావుడి మొదలైతే ఎన్నికల వాతావరణాన్ని ఏడాదిన్నర ముందుగానే రాష్ట్రంలోకి తెచ్చినట్టే!

రాష్ట్ర బడ్జెట్‌నంతా ఏదో పథకం పేరిట జనాల ఖాతాల్లో వేస్తున్న జగన్‌ను వారు వదులుకోబోరని, తమ అధినేత కూడా ఇదే ధీమాతో ఉన్నారని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అభివృద్ధిని గురించి ఎవరూ పట్టించుకోరని, తమకు, తమ కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలే చూస్తారని అంచనా వేస్తున్నాయి. అలాంటి భావనతో ఉన్నవారంతా ఓట్లు వేస్తే చాలని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ అధినేత, మంత్రులంతా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ కార్యకర్త రూపకల్పనకు ఇలాంటి ఆలోచనలనే ఆధారం చేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రామం, వార్డుల్లో రోజూ తిరుగుతుండే వలంటీర్లను ముందు పెడితే జనం నాడి తెలిసిపోతుందని అంచనావేస్తున్నారు. గ్రామాల్లో గానీ, వార్డుల్లో గానీ ఎక్కడైనా స్టిక్కర్లు అంటించేందుకు కుటుంబాల యజమానులు సుముఖత వ్యక్తం చేయకపోతే..అలాంటి వారు పార్టీని ఆదరించరనేది స్పష్టం అవుతుందని, దీనివల్ల ఆయా వలంటీర్ల పనితీరు కూడా తేలిపోతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దానితోపాటు గృహసారథులు పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు ఈ కార్యక్రమం వేదిక అవుతుందని భావిస్తున్నారు. అయితే, గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్లకు స్టిక్కర్లను అంటించే కార్యక్రమం చాలా కుటుంబాలను తీవ్ర ఒత్తిడికి గురిచేయొచ్చు. ఎన్నికలకు సమయం ఇంకా ఏడాది ఉంది. ఒకవేళ స్టిక్కర్లకు అనుమతించకపోతే ఎక్కడ వలంటీర్లు ఈ ఏడాదిలో తమకు అందాల్సిన పథకాలు అడ్డుకుంటారోనని ఆందోళనకు ఆయా కుటుంబాలు గురి అయ్యే అవకాశం ఉంది.

సచివాలయాల భవనాలు, పాఠశాల బిల్డింగులు, విద్యుత్‌ స్తంభాలు, ప్రభుత్వ కార్యాలయాలు... చివరకు చెత్త వాహనాలు, చెత్త కుండీలు... వేటిని వదలకుండా జగన్‌ బొమ్మలు, వైసీపీ రంగులు పూసేస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి..‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ ఇంటి గుమ్మాలకు జగనన్న స్టిక్కర్లు వేసేందుకు సిద్ధమయిపోతున్నారు. దీనికోసం ప్రభుత్వ పథకాలు పొందేవారితోపాటు.. ఆధార్‌ తదితర అవసరాల కోసం వలంటీర్లపై ఆధారపడే దాదాపు ప్రతి కుటుంబాన్నీ టార్గెట్‌ చేస్తూ అధికార పార్టీ నేరుగా రంగంలోకి దిగుతోంది. పీక్‌కు చేరిన ఈ సొంతడబ్బా పిచ్చి చాలా ప్రాంతాల్లో వలంటీర్లనూ ఇబ్బంది పెడుతోంది. పోలవరంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా.. ‘జయము జయము చంద్రన్న’ అని మహిళలు పాడిన పాటను ప్రదర్శించి పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు ఇలా భజన పాటలు పాడించుకున్నారని అపహాస్యం చేసిన జగన్ పార్టీ నేడు పబ్లిసిటీ కోసం ఎంతలా వెంపర్లాడుతుందో, ఎన్ని వేల కోట్లు తగలేస్తుందో చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Updated Date - 2023-02-09T17:11:19+05:30 IST