AP Capital : వైఎస్ జగన్ వద్దన్నా.. ప్రపంచ భవిష్య నగరాల్లో అమరావతి.. ఇదీ కదా రేంజ్ అంటే..!

ABN , First Publish Date - 2023-03-03T23:50:16+05:30 IST

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచ పటంలో నిలపాలని నారా చంద్రబాబు నాయుడు ఎన్నో కలలు కన్నారు. ఇందుకోసం 33 వేల ఎకరాల భూమిని కూడా నాడు సేకరించారు...

AP Capital : వైఎస్ జగన్ వద్దన్నా.. ప్రపంచ భవిష్య నగరాల్లో అమరావతి.. ఇదీ కదా రేంజ్ అంటే..!

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచ పటంలో నిలపాలని నారా చంద్రబాబు నాయుడు ఎన్నో కలలు కన్నారు. ఇందుకోసం 33 వేల ఎకరాల భూమిని కూడా నాడు సేకరించారు. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలనే ఆకాంక్షతో ఎన్నో డిజైన్లు చేయించారు. వీటిలో చాలా వరకు పనులు కూడా ప్రారంభించారు. అయితే.. 2019లో ప్రభుత్వం మారాక పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. 2014-2019 మధ్య టీడీపీ ప్రారంభించిన నిర్మాణ పనులు తప్పితే నాటి నుంచి నేటి వరకూ ఒక్క అడుగు ముందుకు పడలేదు.. ఒక్క ఇటుక కూడా వేసిన పరిస్థితుల్లేవ్. అసలు అమరావతి ఊసే లేదు. అధికార వికేంద్రీకరణ పేరుతో వైసీపీ మూడు రాజధానులను ప్రతిపాదించింది. దీంతో ప్రపంచ పటంలో నిలవాల్సిన అమరావతిలో.. పేరు గొప్ప, ఊరు దిబ్బ అనేలా పరిస్థితులు నెలకొన్నాయి.. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా ఇది అక్షరాలా నిజం. అయితే అమరావతిని వైసీపీ తిరస్కరించినప్పటికీ ప్రపంచ ప్రతిష్టాత్మక మేగజైన్ ‘ఆర్కిటెక్చరల్ డైజెస్ట్’ గుర్తించింది. ఆ మ్యాగజైన్ ఏమని గుర్తించింది..? అసలు అమరావతి పేరు ఎందుకొచ్చింది..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.

ఇదీ అమరావతి అంటే..!

‘ఆర్కిటెక్చరల్ డైజెస్ట్’ అనేది పేరుగాంచిన ప్రతిష్ఠాత్మక మ్యాగజైన్. ప్రపంచ స్థాయి మ్యాగజైన్ అయిన ఇది అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా నడుస్తోంది. 1920లో ప్రారంభమైన ఈ మ్యాగజైన్ ఇటలీ, చైనా, ఫ్రాన్స్, లాటిన్ అమెరికా, జర్మనీ, స్పెయిన్, మెక్సికోతో పాటు పలు దేశాల్లో ఎడిషన్లు, వెబ్‌సైట్లు నడుస్తున్నాయి. ఇందులో మొత్తం ప్రపంచ స్థాయిలోని కట్టడాలను ప్రచురిస్తూ ఉంటుంది. ఇటీవల ప్రపంచలోనే అత్యద్భుతమైన 6 భవిష్య నగరాలను ఈ మ్యాగజైన్ గుర్తించింది. ఈ ఆరింటిలో అమరావతి ఉండటం విశేషం. వాస్తవానికి ఈ మ్యాగజైన్ గుర్తించినవి ఏదో ఆషామాషీగా భవిష్య నగరాలైతే కాదు. వీటి కోసం తయారు చేయబడిన డిజైన్లు, స్థానిక పరిస్థితులు, పర్యావరణంతో చాలా అంశాల్ని పరిగణనలోకి తీసుకుంది. ఇలాంటి మ్యాగజైనే అమరావతిని భవిష్య నగరంగా కొనియాడిందంటే ప్రతి ఆంధ్రుడు గర్వించాల్సిన విషయమే. చూశారుగా అమరావతి రేంజ్ ఎంతో..!

Amaravati-4.jpg

ఆరు నగరాలివి..!

రాబోయే 50 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతోందనే దానికి.. అమరావతితో పాటు వివిధ దేశాల్లోని మరో 5 నగరాలు అద్దం పట్టనున్నాయని ‘ఆర్కిటెక్చరల్ డైజెస్ట్’ గుర్తించింది. ఇందులో మెక్సికో లోని స్మార్ట్ ఫారెస్ట్ సిటీ, యుఎస్‌ఎలోని టెలోసా, సౌదీ అరేబియాలోని ది లైన్ , దక్షిణ కొరియాలోని ఓషియానిక్స్ బుసాన్, చైనాలోని చెంగ్డు స్కై వ్యాలీ, భారతదేశంలోని అమరావతిని ప్రపంచవ్యాప్తంగా 6 అత్యంత భవిష్యత్ నగరాలుగా నిర్మించబడుతున్నాయని మ్యాగజైన్ తెలిపింది. ఈ ఆరు నగరాలు 50 సంవత్సరాలలో మన ప్రపంచం ఎలా ఉండగలదో చూపిస్తుందని స్పష్టం చేసింది.

Amaravati-1.jpg

అమరావతినే ఎందుకంటే..!

ఏపీ రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో సుమారు 60 % పచ్చదనం, నీరు ఉండేలా ఫోస్టర్+పార్ట్‌నర్స్ రూపొందించిన ప్రణాళికలో ఉంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను దాని కోసం ఉపయోగించాలని ప్రతిపాదిస్తున్నట్లు ప్లాన్‌లో ఉందని మ్యాగజైన్‌లో వివరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలోని భవిష్య నరగాలు ఎలా ఉంటాయో చూపేందుకు ఓ మచ్చుతునకగా.. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అంతా నగరానికి తలమానికగా నిలిచేలా అమరావతి ప్రణాళికను రూపొందించారని తెలిపింది. అంతేకాదు.. ఎలక్ట్రిక్ వెహికల్స్, నీటి ట్యాక్సీలు.. దీంతో పాటు ప్రత్యేకంగా సైకిల్ మార్గాలతో అత్యంత అద్భుతంగా అమరావతిని నిర్మించాలని ప్లాన్‌లో ఉంది. ఇదొక్కటే కాదు.. ఇలా చాలా అంశాల్ని ‘ఆర్కిటెక్చరల్ డైజెస్ట్’ మ్యాగజైన్ పరిగణనలోని తీసుకున్నాకే అమరావతిని అత్యంత అద్భుత నగరాల్లో ఒకటిగా గుర్తించింది. మేగజైన్ ప్రచురించిన ఈ ప్రత్యేక కథనాన్ని చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో ఇప్పుడీ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పోస్టుపై నెటిజన్లు, టీడీపీ వీరాభిమానులు.. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నాయి.

Amaravati-2.jpg

ఎన్నో కలలు.. చివరికిలా..!

వాస్తవానికి.. అమరావతిని ప్రపంచస్థాయి పటంలో నిలపాలని 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడ్డారు. ఇందులో భాగంగా రోడ్లు, కాలవలు, పెద్ద పెద్ద బ్రిడ్జ్‌లు ఇలా చాలా మౌలిక వసతుల నిర్మాణాలు కొద్దిమేర జరిగాయి. అంతేకాదు.. పెద్ద పెద్ద భవన నిర్మాణాలను కూడా బాబు చేపట్టారు. ఇలా మొత్తం 10వేల కోట్ల రూపాయిలు వెచ్చించి అమరావతి నిర్మాణాన్ని ఇలా ప్రపంచమే గుర్తించే పరిస్థితికి చంద్రబాబు తీసుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. మూడు రాజధానులు అని చెప్పి 2019 నుంచి జగన్ సర్కార్ కాలయాపన చేస్తోంది. అమరావతినే వద్దనుకున్న జగన్.. ఇప్పుడు పరిపాలన అంతా నాడు చంద్రబాబు నిర్మించిన భవనాల నుంచే చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. చూశారుగా.. వైసీపీ వద్దనుకున్న అమరావతి రేంజ్ ఎలా ఉందో.. ఇకనైనా జగన్ సర్కార్‌లో మార్పు వస్తుందో రాదో..!

Amaravati-5.jpg

ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఈ మధ్య జగన్ కేబినెట్‌లోని మంత్రులు మరో అడుగు ముందుకేసి.. పేరుకే మూడు రాజధానులే కానీ అసలు సిసలు రాజధాని మాత్రం విశాఖే అని చెబుతున్నారు. రాజధాని అంటే రాష్ట్రం ప్రజల ఆత్మగౌరవం.. అలాంటి ఆత్మగౌరవంతో వైసీపీ చెలగాటమాడుతోంది. ఈ పరిస్థితులు ఒక్క ఆంధ్రాలో తప్ప ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేవు.. ఇకపైనా ఉండకపోవచ్చు. ప్రపంచ దేశాల నుంచి ఇన్వెస్టర్స్, డెలిగేట్స్ విచ్చేసిన వైజాగ్ గ్లోబల్ సమ్మిట్‌లోనూ విశాఖే పరిపాలన రాజధాని అని.. త్వరలోనే ఇక్కడ్నుంచే పరిపాలన సాగుతుందని సీఎం వైఎస్ జగన్ చెప్పడం గమనార్హం. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని నిలువెత్తునా హత్య చేసిందనే ఆరోపణలు లేకపోలేదు. అదే చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే మాస్టర్‌ప్లాన్‌లో అనుకున్నవన్నీ ఆచరణలోకి వచ్చేవి.. ఈపాటికి అమరావతి నగరం అద్భుతంగా ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మూడు రాజధానుల ముఖ్యమంత్రి అని పిలిపించుకుంటున్న జగన్.. చివరికి ఏం చేస్తారో వేచి చూడాలి మరి.

JAgan-and-chandrabab.jpg

Updated Date - 2023-03-04T00:03:29+05:30 IST