YuvaGalam : నాన్నకు ప్రేమతో.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా

ABN , First Publish Date - 2023-09-28T15:28:48+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuva Galam Padayatra) మరోసారి వాయిదా పడింది...

YuvaGalam : నాన్నకు ప్రేమతో.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuva Galam Padayatra) మరోసారి వాయిదా పడింది. అక్టోబర్-03న సుప్రీంకోర్టులో (Supreme Court) స్కిల్ డెవలప్మెంట్ కేసుకు (Skill Development Case) సంబంధించి వాదనలు ఉన్న నేపథ్యంలో యువగళం పాదయాత్ర వాయిదా వేస్తున్నట్లు టీడీపీ అధికారిక ప్రకటన చేసింది. పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని టీడీపీ ముఖ్య నేతలు.. లోకేష్‌ను కోరారు. దీంతో తెలుగు తమ్ముళ్ల అభిప్రాయాలతో యువనేత ఏకీభవించి.. యువగళం పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించారు. త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పున:ప్రారంభ తేదీని ప్రకటించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.


nara-lokesh-2.jpg

వాయిదా ఎందుకంటే..?

కాగా.. కక్ష సాధింపుతో అనేక కేసులు తెరపైకి తెచ్చి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని టీడీపీ నేతలు కన్నెర్రజేస్తున్నారు. ఈ సమయంలో లోకేష్ ఢిల్లీలో ప్రతినిత్యం అడ్వకేట్లతో సంప్రదింపులు చేయడం చాలా అవసరమని టీడీపీ ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుందని లోకేష్‌తో ముఖ్యనేతలు చెప్పగా.. యువనేత పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. కాగా.. యువగళం పాదయాత్ర శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది.

lokesh-padayatra-wg1.jpg

అరెస్ట్ చేస్తారా..?

ఇదిలా ఉంటే.. లోకేష్‌ను కూడా అక్రమంగా అరెస్టు (Lokesh Arrest) చేస్తే.. అదే ముహూర్తానికి పాదయాత్ర మొదలుపెట్టేందుకు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి (Nara Brahmini) సిద్ధమయ్యారు. ఆమెకు ఇప్పటికే అన్ని విషయాలను కుటుంబసభ్యులు వివరించినట్లు తెలుస్తోంది. నారా, నందమూరి కుటుంబాలకు చెందిన బ్రాహ్మణి పాదయాత్ర చేస్తే ప్రజల్లో సానుభూతి ఎక్కువగా వస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక బ్రాహ్మణి పాదయాత్ర అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అధికారపార్టీ నేతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో టీడీపీ పట్ల సానుభూతి వస్తుందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊహించినదానికంటే ఎక్కువగా నిరసనలు, సానుభూతి ఉందనేది అధికారపార్టీ ఎమ్మెల్యేల మాట. మహిళలు, యువతలో వస్తున్న సానుభూతి ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Lokesh-and-CBN-Advocate.jpg

అక్టోబర్-03న ఇలా..!

కాగా.. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను అక్టోబరు-03న విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బుధవారం ఆ పిటిషన్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టితో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే ఈ కేసు విచారణ నుంచి జస్టిస్‌ భట్టి తప్పుకొన్నారు. ‘‘ఈ కేసు విచారణకు జస్టిస్‌ భట్టి విముఖత వ్యక్తం చేశారు’’ అని జస్టిస్‌ ఖన్నా తెలిపారు. దాంతో చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే స్పందిస్తూ... దాని గురించి తామేమీ చెప్పలేమని, త్వరగా కేసు విచారణకు వచ్చేలా చూడాలని కోరారు. వచ్చే వారం ఇతర ధర్మాసనం ముందు కేసును చేర్చాలని సూచిస్తామని జస్టిస్‌ ఖన్నా అనగా... చంద్రబాబు తరఫున మరో న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి ముందు మరోసారి పిటిషన్‌ను ప్రస్తావిస్తామన్నారు. 5నిమిషాల పాటు సమయమిస్తే చర్చించుకొని వస్తామని లూథ్రా కోరగా అందుకు ధర్మాసనం అంగీకరించింది. ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు జస్టిస్‌ భట్టి సభ్యుడిగా లేని ఇతర ధర్మాసనం ఎదుట వచ్చే నెల 3వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో చేర్చాలని రిజిస్ట్రీని జస్టిస్‌ ఖన్నా ఆదేశించారు. అయితే, ‘వచ్చేవారం’ అనే ప్రస్తావన వద్దని లూథ్రా అభ్యర్థించగా... ఆ వాఖ్యను జస్టిస్‌ ఖన్నా తొలగించారు.

supre-chandrababu.jpg

Updated Date - 2023-09-28T15:36:59+05:30 IST