Mahabubnagar: ఆ జిల్లాలో కాకరేపుతున్న వరుస రాజీనామాలు..!

ABN , First Publish Date - 2023-03-15T13:14:46+05:30 IST

వనపర్తి జిల్లాలో రెండు ప్రధాన పార్టీల కీలక నేతల రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. మంత్రి నిరంజన్‌రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ కొందరు బీఆర్‌ఎస్‌ కీలక నేతలు కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి ...

Mahabubnagar: ఆ జిల్లాలో కాకరేపుతున్న వరుస రాజీనామాలు..!

వనపర్తి బీఆర్ఎస్‌లోని రాజీనామాలు.. అన్ని పార్టీలపైనా ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పుడు అదే రాజీనామాల ఫీవర్‌.. కాంగ్రెస్‌లోనూ ముసలం పుట్టిస్తోంది. కాంగ్రెస్‌లో చిన్నారెడ్డి, బీఆర్ఎస్‌లో నిరంజన్‌రెడ్డి.. కొందరికి టార్గెట్‌ అయ్యారు. ఆయా పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు కమలనాథులు కంకణం కట్టుకున్నారు. ఎవరికివారు చేస్తున్న ప్రయత్నాలతో వనపర్తి రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్‌ పెరిగింది. ఇంతకీ.. బీఆర్ఎస్‌లోని విభేదాలకు కారణమేంటి?.. నిరంజన్‌రెడ్డి, చిన్నారెడ్డి ఎందుకు టార్గెట్‌ అయ్యారు?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-2754.jpg

నలుగురు వనపర్తి మున్సిపల్‌ కౌన్సిలర్ల రాజీనామా

వనపర్తి జిల్లాలో రెండు ప్రధాన పార్టీల కీలక నేతల రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. మంత్రి నిరంజన్‌రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ కొందరు బీఆర్‌ఎస్‌ కీలక నేతలు కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కీలక ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా బీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పారు. మంత్రి నిరంజన్‌రెడ్డి కోసం అహర్నిశలు పని చేస్తే.. నిత్యం అవమానిస్తూనే ఉన్నారని ఆరోపిస్తూ.. వనపర్తి జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి.. పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. వారితోపాటు 10 మంది సర్పంచ్‌లు, 8 మంది ఎంపీటీసీలు కూడా రాజీనామా చేశారు. ఆ వ్యవహారం జనాల్లోకి పూర్తిగా వెళ్లిందో లేదో.. కాంగ్రెస్‌లోనూ అదే తరహా ముసలం పుట్టుకొచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నారెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దంటూ నలుగురు వనపర్తి మునిసిపల్‌ కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌కు ఐదుగురు కౌన్సిలర్లు ఉన్నా.. మెజార్టీ సభ్యులు చిన్నారెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నవారే. వాళ్లంతా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారన్న ప్రచారం వారం నుంచి చక్కర్లు కొడుతూనే ఉంది.

Untitled-2958.jpg

ఒకరు వెనక్కి తగ్గగా.. నలుగురు రాజీనామా

ఇక.. వనపర్తి కాంగ్రెస్‌లోని తాజా పరిస్థితులతో చిన్నారెడ్డి ఓ మెట్టు దిగినట్లే కనిపిస్తోంది. ఇప్పటివరకు.. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థినని చెప్పుకున్న చిన్నారెడ్డి.. కాస్తా తగ్గి.. అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అంటున్నారు. టికెట్ ఎవరికిచ్చినా.. కాంగ్రెస్‌ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. దాంతో.. ఓ కౌన్సిలర్‌ చిన్నారెడ్డి నిర్ణయాన్ని గౌరవిస్తూ వెనక్కి తగ్గగా.. మిగతా నలుగురు మాత్రం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అయితే.. చిన్నారెడ్డి తప్ప కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎవరున్నా.. పార్టీకి సేవ చేస్తామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక.. బీజేపీ విషయానికి వస్తే.. ఆయా పార్టీల నుంచి రాజీనామా చేసేవాళ్లను ఆహ్వానించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో.. బీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలంతా ఖిల్లా ఘణాపురం మండలంలోని ఓ మారుమూల పల్లెలో సమావేశం ఏర్పాటు చేసుకుంటే.. వనపర్తి నుంచి వెళ్లేవారికి వాహన సౌకర్యం కల్పించారు. వారంతా బీజేపీలో చేరతారని కమలనాథులు ధీమాతో ఉన్నారు. కానీ.. బీఆర్ఎస్‌ను వీడిన పెద్ద నేతలకు.. అటు కాంగ్రెస్‌.. ఇటు బీజేపీ వల వేస్తున్నాయి. అయితే.. ఆ నేతలు మాత్రం.. తమలో ఒకరికి.. అంటే.. పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డికి టికెట్‌ ఇస్తే పార్టీలోకి వస్తామంటూ రాయబారాలు నడుపుతున్నారు.

Untitled-284577.jpg

రాజీనామాలు ఓ నాటకం అంటూ ఆరోపణలు

వాస్తవానికి.. మంత్రి నిరంజన్‌రెడ్డిపై తిరుగుబావుటా ఎగుర వేసిన నేతలు.. గతంలో టీడీపీ.. కాంగ్రెస్‌లో పనిచేసినవారే. మంత్రి నిరంజన్‌రెడ్డి ఓటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్ఎస్‌ నేతలు.. రాజకీయ పునరేకీకరణతోనే సాధ్యమవుతుందని భావించి.. అందుకనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ప్రస్తుతం చిన్నారెడ్డిపై తీవ్రస్థాయిలో అసమ్మతి ఉండడం.. తెలంగాణలో ఇప్పటికిపుడు మళ్లీ టీడీపీ ప్రభంజనం ఉండదు కాబట్టి.. రావుల చంద్రశేఖర్‌రెడ్డి లాంటి మచ్చలేని నేతను హస్తం గూటికి తీసుకొచ్చి పోటీ చేయించడం.. లేకుంటే.. ఐక్యతగా మంత్రిని వ్యతిరేకిస్తున్న నేతల్లో ఎవరో ఒకరు.. ఏదైనా పార్టీ నుంచి బరిలో నిలవాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో.. బీఆర్ఎస్ అసమ్మతి నేతల రాజీనామాల తర్వాత పరిణామాలతో వనపర్తి రాజకీయాలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి చుట్టే తిరుగుతున్నాయి. అటు.. బీఆర్ఎస్‌ నేతలు కూడా.. ఓ మాజీ ఎమ్మెల్యే డైరెక్షన్‌లో జెడ్పీ చైర్మన్.. ఎంపీపీలు.. సర్పంచుల రాజీనామాల నాటకం ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. దానికి తగ్గట్లే.. రావుల చంద్రశేఖర్‌రెడ్డికి మద్దతుగా ఉండేందుకు సిద్ధపడ్డారని తెలుస్తోంది.

Untitled-2588.jpg

మొత్తంగా.. వనపర్తి నియోజకవర్గ బీఆర్ఎస్‌లో వర్గపోరు మంత్రి నిరంజన్‌రెడ్డికి షాకిచ్చేలాగే కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి కీలక నేతలు రాజీనామా చేయడం వెనుక నిరంజన్‌రెడ్డిని ఓడించాలనే లక్ష్యం ఉన్నట్లు టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికల నాటికి వనపర్తి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Updated Date - 2023-03-15T13:14:46+05:30 IST