Telugu Student: అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

ABN , First Publish Date - 2023-02-08T08:16:14+05:30 IST

ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన ఓ తెలంగాణ యువకుడిని మృత్యువు ఊహించని రీతిలో కబళించింది.

Telugu Student: అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

ఈ ఘటనలో మరో తెలుగు యువకుడి అరెస్టు

మృతుని స్వస్థలం ఖమ్మం జిల్లా మధిర

మధిర టౌన్‌, ఫిబ్రవరి 7: ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన ఓ తెలంగాణ యువకుడిని మృత్యువు ఊహించని రీతిలో కబళించింది. అతని చేతిలో ఉన్న తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో తూటా తగిలి ఆ యువకుడు కన్నుమూశాడు. అమెరికాలోని అల్బామా నగరంలోని ఓ గ్యాస్‌ స్టేషన్‌ వద్ద మంగళవారం తెల్లవారు జామున(భారత కాలమాన ప్రకారం) జరిగిన ఈ ఘటనలో ఖమ్మం జిల్లా మధిరకు చెందిన మహంకాళి అఖిల్‌ సాయి(25) మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి గోలి రవితేజ(23) అనే మరో తెలుగు యువకుడిని అక్కడి పోలీసులు హత్యానేరం కింద అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన మహంకాళి రాజారావు ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్‌కు మకాం మార్చారు.

హైదరాబాద్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ఆయనకు ఇద్దరు కుమారులు. అఖిల్‌ సాయి పెద్ద వాడు కాగా చిన్న కొడుకు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో అఖిల్‌ సాయి ఎంఎస్‌ చదివేందుకు 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అల్బామాలోని అబర్న్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్న అఖిల్‌.. సమీపంలోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, అక్కడ ఓ సెక్యూరిటీ గార్డుకు చెందిన తుపాకీని అఖిల్‌ పరిశీలిస్తుండగా అది పేలింది. దీంతో అఖిల్‌ తలకు బలమైన గాయమైంది. దీనిపై సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు అఖిల్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మరణించాడని వైద్యులు వెల్లడించారు. ఆ సెక్యూరిటీ గార్డు రవితేజ అని సమాచారం. కాగా, అఖిల్‌సాయి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు అల్బామాలోని తెలుగు విద్యార్థులు, తానా ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారని వారి బంధువులు తెలిపారు.

Updated Date - 2023-02-08T08:19:56+05:30 IST