UAE: ఎమిరేట్ ఐడీ కార్డు పోగొట్టుకున్న ప్రవాసులు.. ఇలా చేస్తే 24 గంటల్లో తిరిగి పొందవచ్చు..

ABN , First Publish Date - 2023-02-22T09:50:30+05:30 IST

ఎమిరేట్స్ ఐడీ (Emirates ID) అనేది యునైటేడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని పౌరులు, నివాసితులందరికీ తప్పనిసరి ఉండాల్సిన గుర్తింపు కార్డు.

UAE: ఎమిరేట్ ఐడీ కార్డు పోగొట్టుకున్న  ప్రవాసులు.. ఇలా చేస్తే 24 గంటల్లో తిరిగి పొందవచ్చు..

అబుదాబి: ఎమిరేట్స్ ఐడీ (Emirates ID) అనేది యునైటేడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని పౌరులు, నివాసితులందరికీ తప్పనిసరి ఉండాల్సిన గుర్తింపు కార్డు. ఇది లేకపోతే అక్కడ తిప్పలు తప్పవు. ఈ ఐడీకార్డు హోల్డర్లకు ప్రభుత్వ సేవలను పొందేందుకు, విమానాశ్రయ స్మార్ట్ గేట్‌లను ఉపయోగించి ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌ను సులభంగా పూర్తి చేసే వెసులుబాటు ఉంటుంది. ఇలా ఎంతో ముఖ్యమైన ఈ ఎమిరేట్స్ ఐడీ ఒకవేళ పోగొట్టుకుంటే.. ఇక అంతే సంగతులు. అయితే, ఇలా పోగొట్టుకున్న ఈ ఐడీని కేవలం 24 గంటల్లోనే తిరిగి పొందే వీలు ఉంది. అవును మీరు విన్నది నిజమే. దీనికోసం 'ఫౌరీ' (Fawri) అనే ప్రత్యేక సర్వీస్ ఉంటుంది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజెన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) అదనపు సేవా రుసుముతో ఈ సర్వీస్‌ను అందిస్తుంది.

'ఫౌరీ' సర్వీస్ పొందేందుకు అర్హులు ఎవరంటే..

ఆ దేశంలో నివసిస్తున్న పౌరులు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జాతీయులకు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఏ వయసు వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దీన్ని మొదటిసారి ఐడీ కార్డు జారీకి, గడువు ముగిసిన కార్డుల రెన్యువల్ కోసం, పోగొట్టుకున్న లేదా దెబ్బతిన్న కార్డుల రిప్లేస్ కోసం ఈ సేవాను వినియోగించడం జరుగుతుంది. అలాగే జీసీసీ జాతీయులు కాని ప్రవాసులు తమ పోగొట్టుకున్న లేదా దెబ్బతిన్న గుర్తింపు కార్డులను తిరిగి పొందేందుకు కూడా ఈ సేవ ద్వారా వీలు కలుగుతుంది.

ఇది కూడా చదవండి: గతేడాది దుబాయికి ప్రయాణించిన వారిలో మనోళ్లే టాప్.. ఎంతమంది ప్రయాణించారంటే..

ఎమిరేట్స్ ఐడీ కార్డు పోయిన వెంటనే ఏం చేయాలంటే..

మీ ఎమిరేట్స్ ఐడీ కార్డు పోయినా లేదా దొంగలించబడినా వెంటనే మీ గుర్తింపు ధృవీకరణ పత్రాలతో సమీపంలోని ఐసీపీ కస్టమర్ సర్వీస్ కేంద్రానికి వెళ్లాలి. అక్కడ కార్డును డీయాక్టివేట్ చేయించాలి. ఒకవేళ మీ కార్డు దెబ్బతిన్నట్లైతే మీతో పాటు పాత కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ సర్వీస్‌ను పొందాలంటే కచ్చితంగా ఉండాల్సిన ధృవీకరణ పత్రాల విషయానికి వస్తే.. చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు, ఫ్యామిలీ బుక్ (యూఏఈ జాతీయులు) తీసుకెళ్లాలి. అదే జీసీసీ పౌరులైతే యూఏఈలో నివాసం ఉంటున్నట్లు రుజువు చేసే పత్రం, ఇక ప్రవాసులైతే చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ పర్మిట్‌తో పాటు స్టాంప్ చేయబడిన ఒరిజినల్ పాస్‌పోర్టు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ఎమిరేట్స్ ఐడీ కార్డు తిరిగిపొందే ప్రాసెస్ ఇదే..

* ఐసీఏకు చెందిన ఏదైనా కస్టమర్ సర్వీస్ కేంద్రానికి వెళ్లి సంబంధిత దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. దీనికి ప్రత్యామ్నాయంగా మీరు iTunes లేదా Google Play Store నుంచి UAE ICP యాప్‌ను డౌన్2లోడ్ చేసుకుని ఐడీ కార్డుకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించే వెసులుబాటు ఉంది.

* ఆ తర్వాత అందులో పేర్కొన్న నిర్ధేశిత రుసుము చెల్లించాలి.

* అనంతరం దరఖాస్తు స్టేటస్, డెలివరీ సమయం గురించి ఐసీపీ నుంచి దరఖాస్తుదారునికి సందేశం వస్తుంది. ఎక్స్‌ప్రెస్ సర్వీస్ అప్లికేషన్‌ను సమర్పించిన సమయం నుంచి 24 గంటలలోపు ఐడీ కార్డు జారీ చేయబడుతుంది.

* కార్డు అందుబాటులో ఉందని మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కార్డు దరఖాస్తు రసీదుతో ఎమిరేట్స్ పోస్ట్‌ను సంప్రదించవచ్చు.

ఇది కూడా చదవండి: ఓరి బుడ్డోడా.. నీకు ధైర్యం కూసింత ఎక్కువేరోయ్.. నెటిజన్లను స్టన్ చేస్తున్న వీడియో..!

ఇక దీని రుసుము విషయానికి వస్తే..

పోగొట్టుకున్న లేదా దెబ్బతిన్న ఎమిరేట్స్ ఐడీని తీసుకోవడానికి దరఖాస్తుదారులు ఐసీపీ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అప్లికేషన్ ఫీజుతో కలిసి మొత్తం 370 దిర్హమ్స్‌ (రూ.8,343) చెల్లించాల్సి ఉంటుంది. అదే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఇ-ఫారమ్ ధర 40 దిర్హమ్స్ (రూ.901), ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌కు అదనంగా మరో 150 దిర్హమ్స్ (రూ.3,382) చెల్లించాలి.

Updated Date - 2023-02-22T11:07:57+05:30 IST