Punjab: మీకు నచ్చిన చర్యలు తీసుకోండి.. కాంగ్రెస్‌కు కెప్టెన్ భార్య లేఖ

ABN , First Publish Date - 2023-02-06T14:22:19+05:30 IST

పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ పార్టీ పంపిన షోకాజ్ నోటీసుకు ఆ పార్టీ ఎంపీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్..

Punjab: మీకు నచ్చిన చర్యలు తీసుకోండి.. కాంగ్రెస్‌కు కెప్టెన్ భార్య లేఖ

చండీగఢ్: పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ పార్టీ పంపిన షోకాజ్ నోటీసుకు ఆ పార్టీ ఎంపీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ (Preneet Kaur) సమాధానమిచ్చారు. పార్టీ తనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనుకుంటే అలాంటి చర్యలు తీసుకోవచ్చంటూ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాశారు. ''అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గానికి, నన్ను ఎన్నుకున్న ప్రజలకు, నా రాష్ట్రమైన పంజాబ్‌కు సంబంధించిన సమస్యలను లేవనెత్తడానికి నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. నాపై చర్చలు తీసుకోవాలని అనుకుంటే, మీకు ఆ స్వేచ్ఛ ఉంది'' అని ప్రణీత్ కౌర్ తన లేఖలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. శ్రీమతి గాంధీ విదేశీయురాలనే కారణంతో 1999లో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి, 2019 వరకూ 20 ఏళ్ల బయటే ఉన్న వ్యక్తి, క్రమశిక్షణా చర్యను ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పుడు క్రమశిక్షణా చర్యలంటూ తనను ప్రశ్నించడం ఏమిటని తారిఖ్ అన్వర్‌కు రాసిన ఆ లేఖలో ప్రణీత్ కౌర్ నిలదీశారు.

పార్టీకి చేతనైంత చేశాను...

దీనికి ముందు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరోపణపై తనను సస్పెండ్ చేయడాన్ని ప్రణీత్ కౌర్ స్వాగతించారు. శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ, పార్టీ కోరుకుంటే ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చునని, కానీ పార్టీ కోసం ఎంతగా కష్టపడగలనో అంతగా తాను కష్టపడ్డానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గత శుక్రవారంనాడు ప్రణీత్ కౌర్‌ను సస్పెండ్ చేస్తూ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించరాదో వివరణ ఇవ్వాలని కౌర్‌ను అడిగింది.

అమరిందర్ సింగ్ రాజా ఆరోపణ

పాటియాలాలో కాంగ్రెస్‌ను ప్రణీత్ కౌర్ బలహీనపరచారని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా ఇంతకుముందు ఆరోపణలు చేశారు. తనంత తాను ఆమె పార్టీని వీడితే మంచిదన్నారు. దీనిపై కాంగ్రెస్ క్రమశిక్షణా ప్యానల్ మెంబర్ సెక్రటరీ తారిఖ్ అన్వర్ మాట్లాడుతూ, పంజాబ్‌లో బీజేపీకి ప్రణీత్ కౌర్ సహకరిస్తున్నారంటూ అమరీందర్ సింగ్ రాజా. ఇతర రాష్ట్ర నేతలు చేసిన ఫిర్యాదు మేరకే ఆమెపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.

2021లోనూ ప్రణీత్ కౌర్‌కు షోకాజ్..

కాగా, ప్రణీత్ కౌర్‌కు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2021 నవంబర్‌లోనూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలపై వివరణ ఇవ్వాలంటూ ఆమెకు షోకాజ్ నోటీసు పంపింది. అయితే, తనకు అలాంటి నోటీసు ఏదీ అందలేది, వార్తాపత్రికల్లోనూ, సోషల్ మీడియాలోనూ ఆ విషయం చదివానని ఆమె అప్పట్లో చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో ప్రణీత్ కౌర్ ఇంకెంతమాత్రం ఉండబోవడం లేదని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గత ఏడాది మేలో సంకేతాలిచ్చారు. 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె తన భర్త, బీజేపీ భాగస్వామ్యంతో పోటీ చేసిన అమరీందర్ సింగ్‌కు ప్రచారం చేశారు. కౌర్ 1999, 2004, 2009లో ఎంపీగా పనిచేశారు. 2014లో పాటియాలా లోక్‌సభకు పోటీ చేసి ఓడిపాయారు. అయితే, తిరిగి 2019లో పాటియాలా నుంచి గెలిచారు.

Updated Date - 2023-02-06T14:22:20+05:30 IST