Women's reservation Bill: ఇండియా కూటమి ఐక్యతకు 'లిట్మస్ టెస్ట్' కానుందా?

ABN , First Publish Date - 2023-09-19T16:51:14+05:30 IST

పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు కల్పించే 'నారీ శక్తి వందన్ అభియాన్' బిల్లు ఎట్టకేలకు మంగళవారంనాడు లోక్‌సభకు ముందుకు వచ్చింది. దీంతో ఈ బిల్లు నేషనల్ డపవల్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ బ్లాక్ ఐక్యతకు తొలి పరీక్ష కానుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

Women's reservation Bill: ఇండియా కూటమి ఐక్యతకు 'లిట్మస్ టెస్ట్' కానుందా?

న్యూఢిల్లీ: పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు కల్పించే 'నారీ శక్తి వందన్ అభియాన్' బిల్లు ఎట్టకేలకు మంగళవారంనాడు లోక్‌సభకు ముందుకు వచ్చింది. దీంతో ఈ బిల్లు నేషనల్ డపవల్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ (I.N.D.I.A.) బ్లాక్ ఐక్యతకు తొలి పరీక్ష (Litmus test) కానుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడున్న రూపంలోని ఈ బిల్లును గతంలో పలు విపక్ష పార్టీలు విభేదించడమే ఆ అనుమానాలకు కారణం.


ప్రధానమంత్రి అధ్యక్షతన సోమవారం సాయంత్రం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో పార్లమెంటు కొత్త భవనంలోకి మంగళవారంనాడు అడుగుపెట్టిన వెంటనే ఈ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనికి నారీ శక్తి వందన్ అభియాన్ అనే పేరు కూడా పెట్టారు.


కాగా, ప్రస్తుత రూపంలో ఉన్న ఈ బిల్లును గతంలో లాలూప్రసాద్ యాదవ్ సారథ్యంలోని రాష్ట్రీయ జనతా దళ్, సమాజ్‌వాదీ పార్టీ వంటి కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. 33 శాతం రిజర్వేషన్ కోటాలోనే వెనుకబడిన తరగతుల మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్నది ఈ పార్టీల ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఇది రాజ్యాంగ బిల్లు కూడా కావడంతో లోక్‌సభలో మూడింట రెండు వంతుల మంది మద్దతు ఈ బిల్లుకు అవసరం. 2014లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇది ఒక భాగంగా కూడా ఉంది.


ఇండియా కూటమి మూడో సమావేశం ఆగస్టు 31న ముంబైలో సమావేశం కావడం, 2024 లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై సంప్రదింపులను ప్రారంభించి, సాధ్యమైనంత తర్వగా ముగించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ముందుకు రావడం విశేషం. మహిళా రిజర్వేషన్ బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన అనంతరం అప్పటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వానికి ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. దాంతో 2010లో ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదానికి నోచుకోలేదు. అయితే, వామపక్షాలు, నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యూనైటెడ్‌‌లు బిల్లుకు మద్దతుగా నిలిచాయి.


బిల్లు మాది, అప్నాపై...

కాగా, మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌‌సభలో బీజేపీ మంగళవారంనాడు ప్రవేశపెట్టడానికి ముందు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ స్పందించారు. ''ఇది మాది, అప్నా హై'' అంటూ ఆ బిల్లు తాము తెచ్చినదేనంటూ క్లుప్తంగా వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని సోమవారంనాడు పార్లమెంటులో ప్రసంగిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ఆ పార్టీ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సైతం డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన రెండు రోజుల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలోనూ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటూ ఒక తీర్మానం కూడా చేశారు.


మహిళా రిజర్వేషన్ బిల్లును 27 ఏళ్ల క్రితం హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 1996 సెప్టెంబర్ 12న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దానికి పార్లమెంటు సంయుక్త కమిటీ పరిశీలనకు పంపారు. 1996 డిసెంబర్ 9న లోక్‌సభకు కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే 11వ లోక్‌సభ రద్దు కావడంతో బిల్లు గడువుతీరింది. 1999లో రాజ్యాంగ (85వ సవరణ) బిల్లు తిరిగి ప్రవేశపెట్టగా, బిల్లుకు రాజకీయ ఏకాభిప్రాయం కుదరలేదు. 2008 రాజ్యాంగ సవరణ బిల్లు (108వ సవరణ)కు రాజ్యసభలో 2010 మార్చి 9న ఆమోదం లభించినప్పటికీ లోక్‌సభలో ప్రవేశపెట్టనే లేదు.


ఇది మా చిరకాల డిమాండ్..

మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది కాంగ్రెస్ పార్టీ చిరకాల డిమాండ్‌గా ఉందని, బిల్లు ప్రవేశపెట్టడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపందన్న విషయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ సోమవారంనాడు ఓ ట్వీట్‌లో తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై 2018లో రాహుల్ గాంధీ రాసిన లేఖను సైతం జైరామ్ రమేష్ తన ట్వీట్‌కు జోడించారు. మహిళా సాధికారతకు పాటుపడుతున్నట్టు చెప్పుకునే ప్రధానమంత్రి రాజకీయాలకు అతీతంగా పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేసేందుకు సమయం ఆసన్నమైందని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ బిల్లుకు బేషరుతుగా కాంగ్రెస్ ఆమోదం తెలుపుతుందని కూడా రాహుల్ భరోసా ఇచ్చారు. తన లేఖ ప్రతిని ప్రధానమంత్రి మోదికి సైతం ఆయన షేర్ చేశారు.

Updated Date - 2023-09-19T17:09:12+05:30 IST