Share News

Supreme Court: సుప్రీంకోర్టులో ‘కేరళ పంచాయితీ’.. రెండేళ్లుగా ఏం చేస్తున్నారంటూ గవర్నర్‌ తీరుపై తీవ్ర అసహనం..!

ABN , First Publish Date - 2023-11-30T12:55:38+05:30 IST

కేవలం 8 బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రెండేళ్ల సమయం కూడా సరిపోలేదా..? గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అసలు ఏం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శాసన సభ ఆమోదించిన 8 బిల్లులను గవర్నర్ తొక్కి పెడుతున్నారంటూ కేరళ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Supreme Court: సుప్రీంకోర్టులో ‘కేరళ పంచాయితీ’.. రెండేళ్లుగా ఏం చేస్తున్నారంటూ గవర్నర్‌ తీరుపై తీవ్ర అసహనం..!

న్యూఢిల్లీ: కేవలం ఎనిమిది బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రెండేళ్ల సమయం కూడా సరిపోలేదా..? కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అసలు ఏం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శాసన సభ ఆమోదించిన ఎనిమిది బిల్లులపై గవర్నర్ ఏ నిర్ణయమూ తీసుకోకుండా తొక్కి పెడుతున్నారంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బుధవారం ఆ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గవర్నర్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. బిల్లులను ఎందుకు తొక్కిపెడుతున్నారంటూ సూటి ప్రశ్నలను సంధించింది.

కేరళ సర్కారు ఎనిమిది బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ పరిశీలనకు పంపించింది. అయితే ఆ ఎనిమిది బిల్లులపై ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఆయన వాటిని పెండింగ్‌లోనే ఉంచారు. బిల్లులును ఆమోదించడం కానీ.. వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపించడం కానీ చేయలేదు. అలా అని ఆ బిల్లులను తిరస్కరిస్తూ కూడా ప్రభుత్వానికి తిప్పి పంపలేదు. గవర్నర్ పరిశీలనలో ఉన్నాయంటూ ఆ ఎనిమిది బిల్లులపై నిర్ణయంపై తాత్సారం చేస్తూ వస్తున్నారు. దీంతో గవర్నర్ తీరు సరిగా లేదంటూ.. ప్రభుత్వాన్ని కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కేరళ రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టు మెట్లెక్కింది. రెండేళ్లవుతున్నా ఎనిమిది బిల్లులపై గవర్నర్ ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదంటూ ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది.

బుధవారం ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోనే ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం పంపించిన బిల్లులను ఎందుకు తొక్కి పెడుతున్నారంటూ గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గవర్నర్ రెండేళ్లుగా ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది. అయితే గవర్నర్ కార్యాలయం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకట రమణి వాదిస్తూ.. కేరళ ప్రభుత్వం చేస్తున్న వాదన పూర్తి అవాస్తవమంటూ సుప్రీంకోర్టుకు తెలిపారు. ‘మొత్తం 8 బిల్లులు గవర్నర్ వద్దకు వచ్చాయి. వాటిల్లో ఏడు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వులో ఉంచారు. మరో బిల్లుకు గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు..’ అంటూ అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తెలిపారు. అయితే.. గవర్నర్ తరపు న్యాయవాది వాదనలను నోట్ చేసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. మరి రెండేళ్లుగా ఆ బిల్లులతో గవర్నర్ ఏం చేస్తున్నారంటూ మరోసారి ప్రశ్నించారు.

రాజ్యాంగబద్దమైన పోస్టుల్లో ఉన్నవారు.. రాజ్యాంగానికి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే సమయంలో.. ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ ఎన్నాళ్లలోగా రాష్ట్రపతి పరిశీలనకు పంపించాలన్నది కూడా మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందంటూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టును కోరారు. ఆయన వాదనలతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం.. ఈ అంశంపై మార్గదర్శకాలను రూపొందించే విషయాన్ని పరిశీలిస్తామని వ్యాఖ్యానించింది.

ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు.. విచారణను మాత్రం పెండింగ్‌లోనే ఉంచింది. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ వ్యవస్థ మధ్య ఇదొక సజీవ సమస్య అంటూ సుప్రీం వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదే సమయంలో కేరళ గవర్నర్‌కు సుప్రీంకోర్టు కొన్ని కీలక సూచనలను చేసింది. బిల్లులను తొక్కిపెట్టడం సమంజసం కాదంటూనే.. ఆ బిల్లుల విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆ బిల్లుల తాలూకా మంత్రులతో గవర్నర్ చర్చించాలని సూచించింది. బిల్లుల విషయంలో రాజకీయ వివేకంతో గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Updated Date - 2023-11-30T12:55:39+05:30 IST