Aditya L1 Launch: ఆదిత్య L1 ప్రయోగం సక్సెస్.. సూర్యుడిపై ల్యాండ్ అవుతుందా?

ABN , First Publish Date - 2023-09-02T13:06:44+05:30 IST

చంద్రుడిపై చంద్రయాన్-3ని ల్యాండ్ చేసినట్లుగా ఆదిత్య ఎల్-1ను కూడా సూర్యుడిపై ల్యాండ్ చేస్తారా అన్న సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. అయితే గ్రహాల మాదిరిగా సూర్యుడి ఉపరితలం ఘన స్థితిలో ఉండదు. సూర్యుడు వాయుగోళం మాదిరిగా ఉంటాడు. దీంతో సూర్యుడి బయటి పొర కరోనాలోకి రాకెట్ ప్రవేశిస్తే సూర్యుడిపై దిగినట్లుగానే పరిగణిస్తారు.

Aditya L1 Launch: ఆదిత్య L1 ప్రయోగం సక్సెస్.. సూర్యుడిపై ల్యాండ్ అవుతుందా?

ఇటీవల 10 రోజుల క్రితం అంతరిక్షంలో భారత్ తనదైన ముద్ర వేసింది. చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. విక్రమ్ ల్యాండర్ ద్వారా ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై దిగి అక్కడి పరిస్థితులను ఫోటోలు తీసి ఇస్రోకు పంపుతోంది. ఇప్పుడు ఇస్రో మరో చారిత్రక మిషన్‌ను చేపట్టింది. సూర్యుడిపై పరిస్థితుల అధ్యయనానికి ఆదిత్య L1 ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ మేరకు పీఎస్‌ఎల్వీ సీ57 వాహన నౌక ఆదిత్య ఎల్-1ను విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది. రాకెట్ నుంచి ఆదిత్య ఎల్-1 విజయవంతంగా విడిపోయిందని.. దానిని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందించారు. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం చాలా ప్రత్యేకమైందని.. 125 రోజుల పాటు ఈ ఉపగ్రహం ప్రయాణం చేస్తుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వివరించారు.

ఆదిత్య ఎల్-1 సక్సెస్‌తో భారత అంతరిక్ష సంస్థ ఘనకీర్తిలో మరో కలికితురాయి చేరింది. దీంతో అమెరికా, జపాన్, యూరప్, చైనా తర్వాత సూర్యుడిపై రాకెట్ పంపిన ఐదో దేశంగా భారత్ నిలిచింది. అయితే చంద్రుడిపై చంద్రయాన్-3ని ల్యాండ్ చేసినట్లుగా ఆదిత్య ఎల్-1ను కూడా సూర్యుడిపై ల్యాండ్ చేస్తారా అన్న సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. అయితే గ్రహాల మాదిరిగా సూర్యుడి ఉపరితలం ఘన స్థితిలో ఉండదు. సూర్యుడు వాయుగోళం మాదిరిగా ఉంటాడు. దీంతో సూర్యుడి బయటి పొర కరోనాలోకి రాకెట్ ప్రవేశిస్తే సూర్యుడిపై దిగినట్లుగానే పరిగణిస్తారు. ప్రస్తుతం నాసాకు చెందిన ప్రోబ్ అనే రాకెట్ కరోనాలోకి ప్రవేశించి పరిశోధనలు చేసింది. ఇప్పుడు ఆదిత్య ఎల్-1 నిరంతరాయంగా సూర్యుడిపై పరిశోధనలు చేయనుంది. చంద్ర, సూర్య గ్రహణాల సమయంలో కూడా నిరంతరంగా సూర్యుడిపై పరిశోధనలు చేయడానికి వీలుపడుతుంది. ఈ మేరకు ఆదిత్య ఎల్-1 నింగిలోకి ఏడు పేలోడ్స్‌ను తీసుకువెళ్లింది. ఈ మిషన్‌లో ఈ ఏడు పేలోడ్‌లు కీలకంగా పనిచేయనున్నాయి. ఇవి ఎలక్ట్రో మాగ్నటిక్, మాగ్నటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సహాయంతో సూర్యుడి లోపల పొరలైన ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఎల్-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతలను దృష్టిలో పెట్టుకుని నాలుగు పరికరాలు సూర్యుడి చుట్టూ పరిస్థితులను అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాలపై శోధించనున్నాయి.


సూర్యుడిపై ఐదు లాగ్రాంజ్ పాయింట్‌లు

అంతరిక్షంలో లాగ్రాంజ్ పాయింట్‌ అనేది పార్కింగ్ ఏరియా లాంటిది. ఆదిత్య-L1 ఇక్కడకు చేరుకున్న తర్వాత సూర్యుడి దగ్గర జరిగే పరిణామాలను మనకు అందిస్తుంది. ఇలా సూర్యుడి చుట్టూ ఐదు లాగ్రాంజ్ పాయింట్‌లు ఉన్నాయి. అందులో ఎల్‌-1 వద్దకు ఆదిత్య ఉపగ్రహాన్ని పంపిస్తున్నారు. అక్కడ నుండి సూర్యుడిని నిరంతర పరిశీలిస్తుంది. ఇతర గ్రహాలు, అక్కడ పర్యావరణ పరిస్థితులపై నిజ సమయంలో అధ్యయనం చేస్తుంది. లాగ్రాంజియన్ పాయింట్ 1 భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదిత్య మిషన్ నాలుగు నెలల వ్యవధిలో ఈ దూరాన్ని చేరుకోనుంది.కాగా ఇప్పటివరకు జరిగిన మొత్తం 22 సూర్య ప్రయోగాల్లో నాసా 2018లో చేసిన పార్కర్ ప్రోబ్ ప్రయోగం అత్యంత ఖరీదుగా నిలిచింది. దానికి ఏకంగా రూ. 12వేల కోట్లు ఖర్చు కాగా... ఇప్పుడు ఇస్రో చేస్తున్న ఆదిత్య L1 ప్రయోగానికి కేవలం రూ. 400 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. దీంతో సూర్యుడిపై అత్యంత చౌక ప్రయోగంగా ఆదిత్య ఎల్-1 నిలవనుంది.

Updated Date - 2023-09-02T13:24:31+05:30 IST