Mamata severs Tea: ఛాయ్ వాలా అవతారంలో మమత దీదీ

ABN , First Publish Date - 2023-06-26T18:29:28+05:30 IST

పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారంనాడు ఛాయ్ వాలా అవతారమెత్తారు. రోడ్డు పక్క హోటల్‌లో స్వయంగా టీ తయారు చేసి, అక్కడున్న అందరికీ అందజేశారు.

Mamata severs Tea: ఛాయ్ వాలా అవతారంలో మమత దీదీ

జల్‌పాయ్‌గురి: ఎంత జనాకర్షణ కలిగిన నాయకులైనా జనంలోకి వెళ్తేనే, సామాన్యుడిలో సామాన్యుడిగా కలిసిపోతేనే ఆ ఆదరణ చెక్కుచెదరకుండా ఉంటుంది. ''నేనూ మీలో ఒకరినే'' అనే నమ్మకం కలిగించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఇది సాధారణమే అయినా...నాయకులు ఇందుకోసం పలు అవతారాలు ఎత్తుతుంటారు. పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారంనాడు ఛాయ్ వాలా అవతారమెత్తారు. రోడ్డు పక్క హోటల్‌లో స్వయంగా టీ తయారు చేసి, అక్కడున్న అందరికీ అందజేశారు. దీనితో జనం ఉబ్బితబ్బిబ్బయ్యారు. సీఎం నిరాడంబరతకు ఇదొక నిదర్శనంగా చెప్పుకున్నారు. 3 నిమిషాల 59 సెకన్లు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పంచాయతీ ఎన్నికల ప్రచారంలో సీఎం గతంలో పాల్గొన్న దాఖలాలు అంతగా లేనప్పటికీ, ఈసారి మాత్రం ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మమతా బెనర్జీ సుమారు 12 ఏళ్ల తర్వాత ప్రచారబరిలోకి దిగారు. జల్‌పాయ్‌గురిలోని మల్‌బజార్‌లో ఓటర్లను నేరుగా కలుసుకుని అక్కడున్న ఓ టీ స్టాల్ యజమాని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ వెంటనే స్వయంగా ఆమె టీ తయారు చేశారు. అక్కడున్న వారికి వేడివేడి ఛాయ్‌ను తన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు.

దీనికి ముందు, కూచ్‌బెహర్‌లో ఎన్నిక ప్రచారం సాగించిన మమతా బెనర్జీ బీజేపీపై నిప్పులు చెరిగారు. దేశాన్ని అమ్మేయాలనుకుంటున్న బీజేపీ డబుల్ ఇంజన్లకు త్వరలోనే చెల్లుచీటీ తప్పదని, రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో మొదటి ఇంజన్‌ను ఆ పార్టీ కోల్పోనుందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో రెండో ఇంజన్ కూడా మాయమవుతుందని జోస్యం చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలోనే అది కార్యరూపం దాలుస్తుందని చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో మూడంచెల పంచాయతీ ఎన్నికలు జూలై 8న ఒకే దశలో జరగనున్నాయి.

Updated Date - 2023-06-26T18:29:28+05:30 IST