Nitin Gadkari: రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపిన గడ్కరీ

ABN , First Publish Date - 2023-04-04T22:20:46+05:30 IST

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ధన్యవాదాలు తెలిపారు.

Nitin Gadkari: రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపిన గడ్కరీ
Union Minister Nitin Gadkari

ముంబై: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల వల్లే స్వాతంత్ర్య వీర సావర్కర్‌‌పై(Veer Savarkar) నిజమేంటో ప్రతి ఇంటికీ చేర్చగలిగే అవకాశం దక్కిందన్నారు. రాహుల్ భవిష్యత్తులో కూడా ఇలాగే వ్యాఖ్యానిస్తుండాలని గడ్కరీ సూచించారు. సావర్కర్‌ను ఎవరూ అవమానించలేరని గడ్కరీ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన ప్రభుత్వం చేపట్టిన 'సావర్కర్ గౌరవ్ యాత్ర'లో (Savarkar Gaurav Yatra)గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశానికి సావర్కర్ అందించిన సేవలను స్మరించుకునేందుకు రాష్ట్రంలో 'సావర్కర్ గౌరవ్ యాత్ర'ను చేపడుతున్నట్టు షిండే సారథ్యంలోని శివసేన గత మార్చిలో ప్రకటించింది. సావర్కర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శివసేన సర్కార్ ఈ యాత్రను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

స్వాతంత్ర్య వీర సావర్కర్ (Savarkar)పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్రలో ఇంకా రగడ కొనసాగుతూనే ఉంది. భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ విదేశాల్లో వ్యాఖ్యానించడంపై క్షమాపణలు చెబుతారా అని రాహుల్ గాంధీని ప్రశ్నించినప్పుడు తాను సావర్కర్‌ను కానని, గాంధీనని చెప్పడం దేశవ్యాప్తంగా కలకలం రేగింది. సావర్కర్ సొంత రాష్ట్రం మహారాష్ట్రలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Maharashtra Deputy CM Devendra Fadnavis) రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. బంగారు స్పూన్‌ ఉన్నవాళ్లు వీరసావర్కర్‌ను అవమానించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందిరా గాంధీ, యశ్వంత్ రావ్ చవాన్‌ లాంటి కాంగ్రెస్ పెద్దలు వీరసావర్కర్‌ను గౌరవించారని ఫడ్నవీస్ గుర్తు చేశారు. సావర్కర్‌ను అవమానించడానికి నువ్వెవరు అంటూ రాహుల్‌‌పై ఫడ్నవీస్ మండిపడ్డారు. సావర్కర్ బ్రిటీష్ వారికి క్షమాపణ కోరుతూ ఉత్తరం రాశారన్న రాహుల్ ఆరోపణలపై స్పందిస్తూ బ్రిటీష్ వారికి వ్యతిరేకం కాని తన తోటి ఖైదీలను విడుదల చేయాలని సావర్కర్ లేఖ రాశారని ఫడ్నవీస్ గుర్తు చేశారు.

సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యల కారణంగా మహారాష్ట్ర వికాస్ అఘాడి (MVA) కూటమి మధ్య సంబంధాలు ఇటీవలే ఇరకాటంలో పడ్డాయి. దీంతో మరాఠా దిగ్గజ నేత, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) కాంగ్రెస్ నాయకత్వాన్ని సంప్రదించారు. సావర్కర్‌పై విమర్శల విషయంలో సంయమనం పాటించాలని సూచించారు. మహారాష్ట్రలో సావర్కర్‌ను ప్రజలు ఆరాధిస్తుంటారని, ఆయన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం వల్ల అక్కడి విపక్ష కూటమికి ఏమాత్రం ప్రయోజనం చేకూరదని పవార్ కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పారు. విపక్ష పార్టీల నేతలతో పాటు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కూడా పాల్గొన్న సమావేశంలో పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. సావర్కర్ ఎన్నడూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యుడు కాదని, విపక్ష పార్టీల నిజమైన యుద్ధం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీతోనేనని రాహుల్‌కు పవార్ సూచించారు.

లండన్‌లో రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు భారత ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని, ఇందుకు గాను ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్లు ఉపందుకుంటున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ మీడియా ముందు ఈనెల 25న స్పందించారు. తాను సావర్కర్‌ను కాదని, తన పేరు గాంధీ అని, క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదని చెప్పారు. సావర్కర్‌‌పై ఆయన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టగా, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్ధవ్ వర్గం అధినేత ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) సైతం రాహుల్‌పై మండిపడ్డారు. సావర్కర్ తమ దేవుడని, ఆయనను అవమానిస్తే సహించేది లేదని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు నిరసనగా విపక్ష నేతలతో మల్లిఖార్జున్ ఖర్గే ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా థాకరే వర్గం శివసేన నేతలు గైర్హాజరయ్యారు. ఆ తర్వాత సోనియా గాంధీ రాహుల్‌తో కలిసి శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌తో సమావేశమయ్యారు. సమస్యను పరిష్కరించుకున్నారని తెలిసింది. అయితే మహారాష్ట్రలో మాత్రం అధికార శివసేన-బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీపై, ఉద్ధవ్ థాకరేపై మండిపడ్తున్నాయి. సావర్క్‌ర్‌ను రాహుల్‌ విమర్శిస్తున్నా థాకరే ఇంకా మహా వికాస్ అఘాడీలో కొనసాగడంపై ఫడ్నవీస్, మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే(Eknath Shinde) నిలదీశారు.

Updated Date - 2023-04-04T23:17:07+05:30 IST