Union Cabinet Meet: ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం.. ఆర్డినెన్స్‌పైనే ప్రధాన చర్చ..!
ABN , First Publish Date - 2023-07-25T20:47:31+05:30 IST
మణిపూర్ హింసపై చర్చ అంశంపై పార్లమెంటులో ఓవైపు ప్రతిష్ఠంభన కొనసాగుతుండగా, మరోవైపు కేంద్ర మంత్రివర్గం మంగళవారం రాత్రి సమావేశం అవుతోంది. అయితే, ఈ సమావేశంలో ప్రధానంగా ఢిల్లీ ఆర్డినెన్స్ పై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై చర్చ అంశంపై పార్లమెంటులో ఓవైపు ప్రతిష్ఠంభన కొనసాగుతుండగా, మరోవైపు కేంద్ర మంత్రివర్గం మంగళవారం రాత్రి సమావేశం అవుతోంది. అయితే, ఈ సమావేశంలో ప్రధానంగా ఢిల్లీ ఆర్డినెన్స్ (Delhi Ordinance)పై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
ఢిల్లీలో గ్రూప్-ఏ అధికారుల నియామకాలు, బదిలీలకు ఒక అథారిటినీ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మే 19న జారీ చేసిన ఆర్డినెన్స్ తీవ్ర దుమారం రేపింది. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై కేజ్రీవాల్ సారథ్యంలోని 'ఆప్' ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి గ్రూప్-ఎ అధికారుల నియామాకాలు, బదిలీల అధికారాన్ని దఖ లుచేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పినప్పటికీ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని తప్పుపట్టింది. పార్లమెంటు ముందుకు తీసుకు వచ్చే కేంద్ర ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించి, తమకు మద్దతివ్వాలంటూ కేజ్రీవాల్ ఇటీవల వరుసగా విపక్ష పార్టీల నేతలను నేరుగా కలిసి మద్దతు కూడగడుతున్నారు. 26 విపక్ష పార్టీల కూటమి 'INDIA'లో భాగస్వామి అయిన 'ఆప్'కు కాంగ్రెస్ సైతం ఇటీవల మద్దతు ప్రకటించింది. ఢిల్లీలో సివిల్ సర్వీసుల నియంత్రణకు సంబంధించిన ఆర్డినెన్స్ విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని, దానిని ఏ మాత్రం సహించబోమనీ కాంగ్రెస్ తెలిపింది. సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగేలా కేంద్రం తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా ఆమోదించేది లేదని, ముఖ్యంగా ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో ఆప్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.