Tamil Nadu : కోర్టుల్లో అంబేద్కర్ ఫొటోలను తొలగించాలనే ఆదేశాలేవీ లేవు : తమిళనాడు మంత్రి

ABN , First Publish Date - 2023-07-25T15:32:32+05:30 IST

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. BR Ambedkar) ఫొటోలు తమిళనాడులోని అన్ని కోర్టుల్లోనూ కొనసాగుతాయని, వీటిని తొలగించాలనే ఆదేశాలేవీ లేవని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎస్ రఘుపతి తెలిపారు. మహాత్మా గాంధీ, తమిళ కవి తిరువళ్లువర్ ఫొటోలను మాత్రమే ఉంచాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించినట్లు వార్తలు రావడంతో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో మంత్రి ఈ వివరణ ఇచ్చారు.

Tamil Nadu : కోర్టుల్లో అంబేద్కర్ ఫొటోలను తొలగించాలనే ఆదేశాలేవీ లేవు : తమిళనాడు మంత్రి

చెన్నై : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. BR Ambedkar) ఫొటోలు తమిళనాడులోని అన్ని కోర్టుల్లోనూ కొనసాగుతాయని, వీటిని తొలగించాలనే ఆదేశాలేవీ లేవని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎస్ రఘుపతి తెలిపారు. మహాత్మా గాంధీ, తమిళ కవి తిరువళ్లువర్ ఫొటోలను మాత్రమే ఉంచాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించినట్లు వార్తలు రావడంతో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో మంత్రి ఈ వివరణ ఇచ్చారు.

తమిళనాడులోని కోర్టుల్లో మహాత్మా గాంధీ, తమిళ కవి తిరువళ్లువర్ ఫొటోలను మాత్రమే ఉంచాలని మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఆదేశించిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాడు, పుదుచ్చేరిలలోని అన్ని జిల్లా కోర్టులకు ఈ ఆదేశాలను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పంపించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు రఘుపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సోమవారం కలిశారు. అనంతరం రఘుపతి విడుదల చేసిన ప్రకటనలో, డాక్టర్ అంబేద్కర్ ఫొటోలను రాష్ట్రంలోని కోర్టుల నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశించలేదని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారని తెలిపారు.

నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ ఫొటోలను కోర్టుల నుంచి తొలగించాలని ఆదేశించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఈ సర్క్యులర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఫొటోలను కోర్టుల్లో పెట్టడానికి అనుమతించాలని కోరినప్పటికీ, ఈ వినతులను 2023 ఏప్రిల్ 11న జరిగిన హైకోర్టు ఫుల్ బెంచ్ సమావేశం తిరస్కరించిందని ఈ సర్క్యులర్ పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయని తెలిపారు.

తమిళనాడు బీజేపీ చీఫ్ తీవ్ర ఆవేదన

బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కే అణ్ణామలై ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆదేశాలు తనను తీవ్ర ఆవేదనకు గురి చేశాయని తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ ఫొటో పెట్టుకోవడానికి వివిధ సంఘాలు చేసిన వినతులను తిరస్కరించినట్లు, కోర్టులు, కోర్టు ప్రాంగణాల నుంచి అంబేద్కర్ ఫొటోలను తొలగించాలని ఆదేశించినట్లు తెలుసుకుని తన మనసు కకావికలమైందన్నారు. అంబేద్కర్ మన దేశ రాజ్యాంగ రూపశిల్పి అని, రాజ్యాంగ విలువలను కాపాడటమే న్యాయస్థానాల బాధ్యత అని, దేశ తొలి న్యాయ శాఖ మంత్రి అయిన అంబేద్కర్ ఫొటోను పెట్టడానికి సరైన ప్రదేశం కోర్టులేనని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

CBSE: సీబీఎస్‌ఈలో తెలుగు మాధ్యమం

Manipur : మయన్మార్ నుంచి మణిపూర్ రాష్ట్రానికి ఆగని అక్రమ వలసలు.. రెండు రోజుల్లో 718 మంది చొరబాటు..

Updated Date - 2023-07-25T15:32:45+05:30 IST