Unacademy Issue: అసలు అన్అకాడమీ వివాదం ఏంటి? ఆ టీచర్ చేసిన తప్పేంటి? చివరికి ఏమైంది?

ABN , First Publish Date - 2023-08-18T16:20:20+05:30 IST

ఉపాధ్యాయుల్లో చాలామంది ‘ఏదో వచ్చామా, పాఠాలు చెప్పేశామా, వెళ్లిపోయామా’ అన్నట్టు ఉంటారు. కానీ.. కొందరు అలా ఉండరు. పిల్లల భవిష్యత్తుకి మెరుగులు దిద్దడంలో తమకు...

Unacademy Issue: అసలు అన్అకాడమీ వివాదం ఏంటి? ఆ టీచర్ చేసిన తప్పేంటి? చివరికి ఏమైంది?

ఉపాధ్యాయుల్లో చాలామంది ‘ఏదో వచ్చామా, పాఠాలు చెప్పేశామా, వెళ్లిపోయామా’ అన్నట్టు ఉంటారు. కానీ.. కొందరు అలా ఉండరు. పిల్లల భవిష్యత్తుకి మెరుగులు దిద్దడంలో తమకు చేతనైంత సహాయం చేస్తారు. మంచి, చెడుల మధ్య ఉండే వ్యత్యాసం తెలియజేస్తారు. సమాజం గురించి అవగాహన కల్పిస్తారు. ఒక నాగరికుడిగా మనం నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని సైతం అలవర్చుకునేలా తోడ్పడుతారు. అందుకే.. ఉపాధ్యాయుల్ని తల్లిదండ్రుల్ని మించిన గురువుగా భావిస్తారు. కానీ.. ఇప్పుడు ఆ గురువులకే సమాజంలో విలువ లేకుండా పోయింది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా.. కరణ్ సాంగ్వాన్ వ్యవహారాన్నే తీసుకోవచ్చు. రాబోయే ఎన్నికల్లో చదువుకున్న అభ్యర్థులకే ఓటు వేయమని చెప్పిన పాపానికి.. ఆయన్ను ఉద్యోగంలో నుంచి తొలగించడమే కాకుండా, ఏదో పెద్ద నేరం చేసినట్టుగా అభాసుపాలు చేస్తున్నారు.


అసలేం జరిగిందంటే.. అన్అకాడమీలో ఒక ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కరణ్ సాంగ్వాన్ ఇటీవల ఒక క్లాసులో భాగంగా ఓ ప్రకటన చేశాడు. ఈసారి ఎన్నికల్లో చదువుకున్న అభ్యర్థులకే ఓటు వేయమని నొక్కి వక్కానించాడు. అంతే.. ఆ ఒక్క మాట చెప్పాడో, లేదో అతనిపై విమర్శలు తలెత్తాయి. కొన్ని వర్గాల వారు కావాలనే టార్గెట్ చేసుకొని.. అతనిపై ఎగబడ్డారు. ‘నువ్వు క్లాసులు చెప్పే ఉపాధ్యాయుడివా? లేక కొన్ని రాజకీయ పార్టీలకు డప్పు కొట్టే సేవకుడివా?’ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. కొందరైతే దేశద్రోహి అంటూ ఆరోపణలు కూడా చేశారు. విశ్వ హిందు పరిషత్ నాయకురాలైన సాధ్వి ప్రాచి కూడా అన్అకాడమీ చర్యకి మద్దతు తెలిపారు. ఆ ఉపాధ్యాయుడ్ని తొలగించి మంచి పని చేశారని ట్వీట్ చేశారు. ఆ టీచర్ ఒక యాంటీ-నేషనలిస్ట్ అంటూ పేర్కొన్నారు. అన్అకాడమీని మొబైల్ ఫోన్ల నుంచి తొలగించాల్సిన అవసరమూ లేదని తెలిపారు.


ఇలా.. కరణ్ సాంగ్వాన్ కి వ్యతిరేకత వస్తున్న తరుణంలో చాలామంది అతనికి మద్దతుగా నిలిచారు. ఈ విషయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా జోక్యం చేసుకొని.. ఆ ఉపాధ్యాయుడికి తన మద్దతు తెలిపారు. చదువుకున్న అభ్యర్థులకే ఓటు వేయమని అప్పీల్ చేయడం నేరం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ‘‘నేను నిరక్షరాస్యుల్ని గౌరవిస్తాను కానీ, ప్రజాప్రతినిధి అనేవాడు చదువుకున్నవాడై ఉండాలి. ఎందుకంటే, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ యుగం’’ అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. రాజకీయ నాయకులతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు సైతం.. అన్అకాడమీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ.. కరణ్ ఏం తప్పు చేశాడంటూ ఆ సంస్థని నిలదీస్తున్నారు. అటు నెటిజన్లు కూడా #UninstallUnacademy అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ.. కరణ్ సాంగ్వాన్ కి తమ మద్దతు తెలుపుతున్నారు.

అయితే.. కరణ్ ని తొలగించడంపై అన్అకాడమీ సంస్థ చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. తమ ఎకాడమీలో పని చేసే ఉపాధ్యాయులందరికీ ప్రవర్తనా నియమావళిని ఏర్పాటు చేశామని, ఇందుకు తప్పకుండా కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశామని పేర్కొంది. తరగతి గదుల్లో (ఆన్ లైన్ పాఠాలు చెప్తున్నపుడు) కేవలం పాఠాలు చెప్పాలే గానీ.. విద్యార్థుల ఆలోచనని ప్రభావితం చేసే వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేయకూడదన్నదే ఆ నియమావళి అని స్పష్టం చేసింది. ఇక్కడ కరణ్ ఈ నియమాన్ని అతక్రమించడం వల్లే అతడ్ని తొలగించాల్సి వచ్చిందని అన్అకాడమీ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? ఆ ఉపాధ్యాయుడు చేసింది నేరమా?

Updated Date - 2023-08-18T16:20:20+05:30 IST