Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్‌కి పని చేసిన టెక్నీషియన్.. ఇప్పుడు ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు

ABN , First Publish Date - 2023-09-19T16:24:40+05:30 IST

కాలం అందరికీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొందరి జీవితాలు అనూహ్యంగా రాత్రికిరాత్రే మలుపు తిరిగితే.. మరికొందరు ఎంత కష్టపడినా అందుకు ఫలితం దక్కదు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారని అంటుంటారు కానీ..

Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్‌కి పని చేసిన టెక్నీషియన్.. ఇప్పుడు ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు

కాలం అందరికీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొందరి జీవితాలు అనూహ్యంగా రాత్రికిరాత్రే మలుపు తిరిగితే.. మరికొందరు ఎంత కష్టపడినా అందుకు ఫలితం దక్కదు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారని అంటుంటారు కానీ.. ఈ మాట అందరికీ వర్తించదు. ఎంత కృషి చేసినా.. ఇప్పటికీ ఎందరో బతుకీడ్చడం కోసం నానాతంటాలు పడుతూనే ఉన్నారు. ఇందుకు దీపక్ కుమార్ ఉపారియా జీవితమే ప్రత్యక్ష సాక్ష్యం. చంద్రయాన్-3 లాంచ్‌ప్యాడ్ తయారు చేయడంలో పని చేసిన ఈ సాంకేతిక నిపుణుడు.. ఇప్పుడు రోడ్డుపై ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు.

నిజానికి.. విజయవంతమైన ఈ చంద్రయాన్-3 మిషన్ మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పడమే కాదు, ఈ ప్రయోగంలో భాగమైన ఎందరో జీవితాల్ని మలుపు తిప్పేసింది. కానీ.. లాంచ్‌ప్యాడ్ తయారీలో కీలక పాత్ర పోషించిన దీపక్ కుమార్ జీవితం మాత్రం రోడ్డున పడింది. ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. చంద్రయాన్-3 కోసం ఫోల్డింగ్ ప్లాట్‌ఫారమ్, స్లైడింగ్ డోర్‌ను తయారు చేసిన హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (HEC) అనే ప్రభుత్వ సంస్థలో దీపక్ కుమార్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఆ సంస్థ దీపక్‌కు గత 18 నెలల నుంచి జీతం ఇవ్వడం లేదు. దీంతో.. బతుకుదెరువు కోసం మరో దారి లేక రాంచిలోని రోడ్డు పక్కనున్న ఓ దుకారణంలో ఇడ్డీలు విక్రయించడం మొదలుపెట్టాడు.


కేవలం దీపక్ కుమార్‌కే కాదు.. HEC లో పని చేసే మొత్తం 2,800 కార్మికులకు 18 నెలల జీతాలు అందలేదు. తమ జీతాలు ఇవ్వాల్సిందిగా వీళ్లందరూ కొంతకాలం నుంచి నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా దీపక్ మాట్లాడుతూ.. అవసరాలను తీర్చుకోవడం కోసం తాను ఇడ్లీలు విక్రయిస్తున్నానని తెలిపాడు. ఓవైపు ఇడ్లీలు అమ్ముతూనే, మరోవైపు ఆఫీస్‌కి వెళ్తున్నానని చెప్పాడు. సాయంత్రం ఆఫీస్ పనులు ముగించుకున్నాక మళ్లీ ఇండ్లీలు అమ్ముతున్నట్టు పేర్కొన్నాడు. క్రెడిట్ కార్డ్ నుంచి రూ.2 లక్షల రుణం తీసుకొని కొంతకాలం ఇల్లు నడిపానని, అనంతరం తనని డిఫాల్టర్‌గా ప్రకటించడంతో బంధువుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇంటిని నడపడం ప్రారంభించానని తన దుస్థితిని వివరించాడు.

ఇప్పటివరకూ తాను రూ.4 లక్షల అప్పు చేశానని.. ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తనకిప్పుడు ఎవరూ అప్పు ఇవ్వట్లేదని దీపక్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య నగలు తాకట్టు పెట్టి మరీ కొన్నాళ్లు ఇంటిని నడిపించానన్నాడు. ఇక పరిస్థితులు మరింత దిగజారిపోవడంతో.. ఇడ్లీలు అమ్మాలని నిర్ణయించుకున్నట్లు దీపక్ చెప్పాడు. తన భార్య ఇంట్లో ఇడ్లీలు తయారు చేస్తుందని, వాటిని అమ్మడం ద్వారా తనకు ప్రతిరోజూ రూ.300 నుంచి రూ.400 వస్తుందని పేర్కొన్నాడు. అయితే.. ఈ వ్యాపారంలో తనకు పెద్దగా లాభమేమీ రావడం లేదని.. కేవలం రూ.50-100 మాత్రమే లాభం వస్తుందని అన్నాడు. ఆ డబ్బులతోనే అతికష్టం మీద తాను ఇంటిని నడుపుతున్నానని చెప్పుకొచ్చాడు.

తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, వారికి ఇంకా స్కూల్ ఫీజు కట్టలేకపోయానని దీపక్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఫీజు కట్టకపోవడంతో తన పిల్లలు అవమానానికి గురయ్యారన్నాడు. వాళ్లు ఏడవడం చూసి తన గుండె తరక్కుపోయిందని ఉద్వేగానికి గురయ్యాడు. కాగా.. దీపక్‌లాగే జీతం అందుకోని ఇతర టెక్నీషియన్స్ సైతం ఇలాంటి పనులే చేస్తూ బతుకీడుస్తున్నట్టు తెలిసింది. కాగా.. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాకు చెందిన దీపక్ కుమార్.. 2012లో ఒక ప్రైవేట్ కంపెనీలో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, రూ.8,000 జీతానికి HECలో చేరాడు. ప్రభుత్వ సంస్థ కావడంతో తన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆశపడ్డాడు కానీ పరిస్థితులు అందుకు ప్రతికూలంగా మారాయి.

Updated Date - 2023-09-19T16:24:40+05:30 IST