Modi Documentary Row : బీబీసీపై నిషేధం... సుప్రీంకోర్టు ఆగ్రహం...

ABN , First Publish Date - 2023-02-10T14:46:07+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసిన బీబీసీ (BBC) కార్యకలాపాలను భారత

Modi Documentary Row : బీబీసీపై నిషేధం... సుప్రీంకోర్టు ఆగ్రహం...
Supreme Court

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసిన బీబీసీ (BBC) కార్యకలాపాలను భారత దేశంలో నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం తోసిపుచ్చింది. పూర్తిగా తప్పుడు అవగాహనతో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారని పేర్కొంది. హిందు సేన చీఫ్ విష్ణు గుప్త (Vishnu Gupta) ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. మోదీపై రెండు భాగాలుగల డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.

బీబీసీ ఈ డాక్యుమెంటరీలో భారత దేశ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించిందని విష్ణు గుప్త తన పిటిషన్‌లో ఆరోపించారు. అంతర్జాతీయంగా ఎదుగుతున్న భారత దేశానికి, మోదీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర ఫలితమే ఈ డాక్యుమెంటరీ అని పేర్కొన్నారు. మోదీ, భారత్ ఎదుగుదలను భారత దేశ వ్యతిరేక లాబీ, మీడియా, మరీ ముఖ్యంగా బీబీసీ జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు.

దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం స్పందిస్తూ, ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ డాక్యుమెంటరీని ప్రభుత్వం నిషేధించడం సహా ఇతర అంశాలు ప్రత్యేకమైనవని తెలిపింది.

పిటిషనర్ తరపున న్యాయవాది పింకీ ఆనంద్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ పూర్తిగా తప్పుడు అవగాహనతో కూడుకున్నదని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించడంతో పింకీ మాట్లాడుతూ, దయచేసి ఈ డాక్యుమెంటరీ వెనుకగల నేపథ్యాన్ని గమనించాలని కోరారు. బ్రిటన్‌కు ప్రధాన మంత్రిగా ఓ భారతీయుడు రుషి సునాక్ (Rishi Sunak) ఉన్నారని, భారత దేశం ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని చెప్పారు. దీనిపై జస్టిస్ ఖన్నా మాట్లాడుతూ, ‘‘ఈ వాదన ఎలా సాధ్యమవుతుంది? మీరు పూర్తి సెన్సార్‌షిప్ విధించాలని కోరుకుంటున్నారా? ఏమిటిది?’’ అన్నారు.

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, పాత్రికేయుడు ఎన్ రామ్, సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ఇదే అంశంపై దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గత వారం విచారణ జరిపింది. ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన లింక్స్‌తో కూడిన ట్వీట్లను తొలగించాలని ఎందుకు నిర్ణయించారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల్లోగా ఈ వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ ఏప్రిల్‌లో జరుగుతుందని తెలిపింది.

నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో (2002లో) జరిగిన అల్లర్లు, హింసాకాండ గురించి డాక్యుమెంటరీ 'India: The Modi Question'ని బీబీసీ ప్రసారం చేసింది. ఇది వలసవాద భావజాలం, ఆలోచనా విధానాలతో రూపొందించిన ప్రచారాస్త్రమని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. దీనికి సంబంధించిన లింకులతో కూడిన ట్వీట్స్, వీడియోలను తొలగించాలని సామాజిక మాధ్యమాలను ఆదేశించింది.

Updated Date - 2023-02-10T14:46:12+05:30 IST