Adani-Hindenburg row : అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం.. సెబీకి సుప్రీంకోర్టులో షాక్..

ABN , First Publish Date - 2023-05-12T18:03:35+05:30 IST

అదానీ గ్రూప్ (Adani Group)పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) చేసిన ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేయడానికి గడువును ఆరు

Adani-Hindenburg row : అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం.. సెబీకి సుప్రీంకోర్టులో షాక్..

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ (Adani Group)పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) చేసిన ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేయడానికి గడువును ఆరు నెలలపాటు పొడిగించాలని సెబీ (Securities and Exchange Board of India-SEBI) చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. పని చేయడంలో హుషారుగా ఉండాలని తెలిపింది. ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని, ఆగస్టు రెండో వారం తర్వాత తదుపరి విచారణ జరుపుతామని, అప్పటికి నివేదికను సమర్పించాలని తెలిపింది. అంటే దర్యాప్తు కోసం గడువును మూడు నెలలు పొడిగించింది.

అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వివాదంపై దర్యాప్తునకు గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని సెబీ దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. గడువును ఆరు నెలలపాటు పొడిగించలేమని స్పష్టం చేసింది. చేసే పనిలో కాస్త హుషారు ఉండాలని తెలిపింది. దర్యాప్తు కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని, కనీస గడువును ఆరు నెలలుగా నిర్ణయించలేమని చెప్పింది. ఆగస్టు రెండో వారం తర్వాత తదుపరి విచారణ జరుపుతామని, అప్పటికి నివేదికను సిద్ధం చేయాలని తెలిపింది. సెబీ నిరవధికంగా సుదీర్ఘ సమయాన్ని తీసుకోకూడదని, గడువును మూడు నెలలు మాత్రం పొడిగించగలమని తెలిపింది.

సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ (రిటైర్డ్) ఏఎం సప్రే కమిటీ నివేదిక సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి ఇటీవల చేరింది. ఈ విషయాన్ని ధర్మాసనం తెలిపింది. దీనిపై ఈ కమిటీ చేసిన పరిశీలనలను పరిశీలించిన తర్వాత మే 15న విచారణ జరుపుతామని తెలిపింది. దర్యాప్తు కోసం గడువును పొడిగించాలని సెబీ చేసిన విజ్ఞప్తిపై ఆదేశాలను మే 15న జారీ చేస్తామని తెలిపింది.

పిటిషనర్ తరపు న్యాయవాదికి హెచ్చరిక

పిటిషనర్, కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ తరపున హాజరైన ఓ న్యాయవాదిని సుప్రీంకోర్టు హెచ్చరించింది. సెబీ విషయంలో రెగ్యులేటరీ ఫెయిల్యూర్ జరిగినట్లు కోర్టు చెప్పలేదని పేర్కొంది. ‘‘ఆరోపణలు చేసేటపుడు జాగ్రత్తవహించండి. స్టాక్ మార్కెట్ సెంటిమెంట్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మీరు చేసిన ఆరోపణలపైనే దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేశాం’’ అని తెలిపింది.

అమెరికాలోని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరిలో విడుదల చేసిన నివేదికలో గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కంపెనీలు దశాబ్దాలుగా అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. స్టాక్ మేనిపులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్ జరుగుతోందని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కానీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అందుకు నిరాకరించింది. అయితే అదానీ గ్రూప్‌పై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. రెండు నెలల్లోగా దర్యాప్తు జరిపి, నివేదికను సమర్పించాలని సెబీని సుప్రీంకోర్టు మార్చిలో ఆదేశించింది. అదేవిధంగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఏఎం సప్రే, మాజీ బ్యాంకర్లు కేవీ కామత్, ఓపీ భట్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, సెక్యూరిటీస్ లాయర్ సోమశేఖర్ సుందరేశన్, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జేపీ దేవధర్‌లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కూడా రెండు నెలల గడువును ఇచ్చింది.

సెబీ మే 2 నాటికి దర్యాప్తును పూర్తి చేసి ఉండవలసింది. కానీ ఏప్రిల్ 29న సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తమకు మరో ఆరు నెలల గడువు కావాలని అడిగింది. ఈ దర్యాప్తును స్వాగతిస్తున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ దాదాపు 140 బిలియన్ డాలర్ల మేరకు క్షీణించింది.

ఇవి కూడా చదవండి :

Rajasthan: గెహ్లాట్‌కు ఆర్‍ఎస్ఎస్ ఫోబియా...బీజేపీ చీఫ్ ఫైర్..!

Karnataka election : ‘కింగ్‌మేకర్’ జేడీఎస్ సిద్ధం.. బీజేపీ, కాంగ్రెస్‌లకు సైగలు..

Updated Date - 2023-05-12T18:03:35+05:30 IST