Stalin, Sitaram Yechury: వీరిద్దరి భేటీ వెనుక ఉన్న మతలబు ఏమిటో..

ABN , First Publish Date - 2023-05-17T10:29:00+05:30 IST

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ అయ్యారు.

Stalin, Sitaram Yechury: వీరిద్దరి భేటీ వెనుక ఉన్న మతలబు ఏమిటో..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)తో భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన సీతారాం... సుమారు గంటపాటు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ మంత్రి దురైమురుగన్‌, డీఎంకే సీనియర్‌ నేతలు కేఎన్‌ నెహ్రూ, ఆర్‌ఎస్‌ భారతి, ఎ.రాజా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌ తదితరులు కూడా పాల్గొన్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల ఐకమత్యం, అధికార పార్టీని ఎదుర్కోవడంపై ఈ నేతలు చర్చించినట్లు తెలిసింది. అంతేగాక జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని, ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే వ్యవహారంలో క్రియాశీలకపాత్ర పోషించాలని ఈ సందర్భంగా ఏచూరి స్టాలిన్‌ను కోరినట్లు సమాచారం. భేటీ అనంతరం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ... కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలిపారు. త్వరలోనే జాతీయస్థాయిలో సెక్యులర్‌ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించనున్నామన్నారు. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ సెక్యులర్‌ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామని, బీజేపీని ఓడించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. తమ అభిప్రాయాలతో స్టాలిన్‌ సైతం ఏకీభవించారని, బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు కలిసి సాగాలని ఆయన కూడా అభిప్రాయపడ్డారని సీతారాం ఏచూరి పేర్కొన్నారు.

Updated Date - 2023-05-17T10:29:02+05:30 IST