George Soros Vs India : జార్జి సొరోస్‌పై విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-02-18T13:05:44+05:30 IST

భారత దేశ ప్రజాస్వామ్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిలియనీర్, ఇన్వెస్టర్ జార్జి సొరోస్ (George Soros)పై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం

George Soros Vs India : జార్జి సొరోస్‌పై విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు
George Soros, Subrahmanian Jaishankar

న్యూఢిల్లీ : భారత దేశ ప్రజాస్వామ్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిలియనీర్, ఇన్వెస్టర్ జార్జి సొరోస్ (George Soros)పై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన ముసలాయన, సంపన్నుడు, ఆధారాలను పరిగణనలోకి తీసుకొనని, ఇతర అభిప్రాయాలను పట్టించుకోని నిగూఢమైన దూకుడు ప్రవర్తనగల వ్యక్తి, అత్యంత ప్రమాదకారి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొరోస్ వంటివారు తమకు నచ్చినట్లుగా ఎన్నికల ఫలితాలు రానపుడు ప్రజాస్వామిక వ్యవస్థను ప్రశ్నించడం ప్రారంభిస్తారన్నారు.

ఆస్ట్రేలియాలో జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, లక్షలాది మంది ముస్లింల పౌరసత్వాన్ని తొలగించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కొన్నేళ్ళ క్రితం జార్జి సొరోస్ ఆరోపించారన్నారు. అది జరగలేదని తెలిపారు. అదొక హాస్యాస్పదమైన వ్యాఖ్య అని ఎద్దేవా చేశారు. అయితే దీని వెనుకగల అసలు అర్థాన్ని మీరంతా అర్థం చేసుకోవాలన్నారు. సొరోస్ ముసలివాడు, సంపన్నుడు, ఆధారాలను పరిగణనలోకి తీసుకొనని, ఇతర అభిప్రాయాలను పట్టించుకోని నిగూఢమైన దూకుడు ప్రవర్తనగల వ్యక్తి అని తెలిపారు. ఆయన న్యూయార్క్‌లో కూర్చుని, తన అభిప్రాయాలు యావత్తు ప్రపంచం పనితీరును నిర్ణయించాలని అనుకుంటారన్నారు.

‘‘ముసలితనం, సంపద, నిగూఢ ప్రవర్తనల వద్ద నేను ఆగిపోవలసి వస్తే, నేను దాన్ని పట్టించుకోను. కానీ ఆయన ముసలివాడు, సంపన్నుడు, నిగూఢ ప్రవర్తనగలవాడు, ప్రమాదకారి. అందువల్ల ఏం జరుగుతోందంటే, అలాంటివారు అభిప్రాయాల నిర్మాణానికి, వాటికి రూపమివ్వడానికి వనరులను పెట్టుబడి పెడుతున్నారు’’ అని తెలిపారు.

జార్జి సొరోస్ ఇటీవల మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మౌనంగా ఉన్నారన్నారు. పార్లమెంటులోనూ, విదేశీ పెట్టుబడిదారుల నుంచి వచ్చే ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలన్నారు. భారత దేశ కేంద్ర ప్రభుత్వంపై ఆయన పట్టును ఇది చెప్పుకోదగ్గ స్థాయిలో బలహీనపరుస్తుందన్నారు. ఎంతో అవసరమైన సంస్థాగత సంస్కరణలకు తలుపులు తెరుస్తుందన్నారు. తాను కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, భారత దేశంలో ప్రజాస్వామిక పునరుజ్జీవం జరుగుతుందని భావిస్తున్నానని తెలిపారు.

ఈ నేపథ్యంలో జైశంకర్ మాట్లాడుతూ, సొరోస్ వంటివారు తాము కోరుకున్న వ్యక్తి ఎన్నికల్లో గెలిస్తే, ఆ ఎన్నికలు మంచివని భావిస్తారని, అదే ఎన్నికల ఫలితం వేరొక విధంగా ఉంటే, అది లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యమని అంటారని ఎద్దేవా చేశారు. అరమరికలు లేని సమాజానికి మద్దతిస్తున్నామనే ముసుగులో ఇదంతా జరుగుతుందన్నారు.

సొరోస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శుక్రవారం స్పందిస్తూ, భారత దేశంలో ప్రజాస్వామిక పునరుజ్జీవానికి అదానీ అంశం కారణమవుతుందా? లేదా? అనేది పూర్తిగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు, ఎన్నికల ప్రక్రియలపై ఆధారపడి ఉంటుందని, అంతేకానీ సొరోస్‌కు దీనితో ఎటువంటి సంబంధం లేదని తెలిపింది.

ఇవి కూడా చదవండి :

Black Water : కోహ్లీతో సహా కొందరు సెలబ్రెటీలు బ్లాక్ వాటర్ తెగ తాగుతుంటారు.. ఆ వాటర్ అంటే వాళ్లకు ఎందుకంత పిచ్చంటే..

S Naga Vamsi: సంవత్సరం తర్వాత మళ్లీ ‘సార్’ సినిమాకే..

Updated Date - 2023-02-18T13:05:47+05:30 IST