Jammu: జమ్మూలో జంట పేలుళ్లు, ఆరుగురికి గాయాలు, భారత్ జోడోకు హైఅలర్ట్

ABN , First Publish Date - 2023-01-21T14:13:48+05:30 IST

జమ్మూ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం జంట కారు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఆరుగురు వ్యక్తులు..

Jammu: జమ్మూలో జంట పేలుళ్లు, ఆరుగురికి గాయాలు, భారత్ జోడోకు హైఅలర్ట్

శ్రీనగర్: జమ్మూ (Jammu) రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం జంట కారు బాంబు పేలుళ్లు (Twin car blasts) చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. రిపబ్లిక్ డే మరో నాలుగు రోజుల్లో ఉండటం, రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' జమ్మూలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అగంతకులు కారులో ఐఈడీలు ఉంచి పేల్చివేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఉదయం 10.47 నిమిషాలకు ఒక కారు బాంబు పేలుడు చోటుచేసుకోగా, మరో 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే మరో బాంబు పేలినట్టు తెలుస్తోంది.

నార్వాల్‌లోని ట్రాన్స్‌పోర్ట్ నగర్ బస్‌యార్డ్ సమీపంలో ఒక దాని వెంట మరొకటి బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గాయపడిన ఆరుగురు పౌరులను సమీప ఆసుపత్రికి తరలించామని చెప్పారు. జంట కారు పేలుళ్ల ఘటనను జమ్మూ ఏడీజీ ముఖేష్ సింగ్ ధ్రువీకరించారు. సమాచారం తెలియగానే పోలీసులు, బాంబ్ డిస్కోజల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడకు చేరుకున్నారని, ఇవి ఏ తరహా పేలుళ్లనేవి నిర్ధారించేందుకు విచారణ జరుపుతున్నామని ముఖేష్ సింగ్ చెప్పారు. ఘటనా స్థలిని తమ అధీనంలోకి తీసుకుని విస్కృతంగా గాలింపు చర్యలు జరుపుతున్నామని, వాహనాలను తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు భారీ బందోబస్తు మధ్య రాహుల్ యాత్ర కొనసాగుతున్నప్పటికీ జంట పేలుళ్లు చోటుచేసుకోవడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

Updated Date - 2023-01-21T14:18:38+05:30 IST