Share News

Cash For Posting Row: కుమారస్వామి ఓ కుట్ర సిద్ధాంతాల నిపుణుడు.. కుమారుడి వీడియో వివాదంపై సీఎం సిద్ధరామయ్య ధ్వజం

ABN , First Publish Date - 2023-11-18T18:25:23+05:30 IST

తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యపై మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన చేసిన ‘క్యాష్ ఫర్ పోస్టింగ్’ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. ఆయనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Cash For Posting Row: కుమారస్వామి ఓ కుట్ర సిద్ధాంతాల నిపుణుడు.. కుమారుడి వీడియో వివాదంపై సీఎం సిద్ధరామయ్య ధ్వజం

CM Siddaramaiah: తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యపై మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి చేసిన చేసిన ‘క్యాష్ ఫర్ పోస్టింగ్’ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. ఆయనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కుమారస్వామి ఆరోపించినట్లు తన కుమారుడి ఫోన్ కాల్ ‘క్యాష్ ఫర్ పోస్టింగ్’ గురించి కాదని.. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్) నిధులకు సంబంధించినదని క్లారిటీ ఇచ్చారు. కుట్ర సిద్ధాంతాల్ని రూపొందించడంలో కుమారస్వామి ఒక నిపుణుడిలా తయారయ్యాడని, ఈ వివాదాన్ని క్షమాపణలు చెప్పి ముగించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ట్విటర్ మాధ్యమంగా కుమారస్వామిపై నిప్పులు చెరిగారు.

‘‘చూస్తుంటే.. కుమారస్వామి అటెన్షన్ కోసం పాకులాడుతున్నట్టు కనిపిస్తోంది. దీనిని వైద్యపరంగా హిస్ట్రియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. దీనికి వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకుంటే బెటర్. కుమారస్వామి కుట్ర సిద్ధాంతాలను రూపొందించడంలో ఒక నిపుణుడిగా మారాడు. కేవలం ‘వివేకానంద’ పేరుతో ఆయన కట్టుకథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు. సీఎస్‌ఆర్‌ నిధులతో పాఠశాలల అభివృద్ధిపైనే ఫోన్‌ కాల్‌ చేశామని ఒక క్లారిటీ పత్రాన్ని విడుదల చేశాం. విడుదల చేసిన పత్రంపై మైసూరు తాలూకా BEO వివేకానంద సంతకం చేశారు. పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన జాబితాపై సంతకం చేసిన ఈ వివేకానంద గురించే ఆ ఫోన్‌లో సంభాషించడం జరిగింది’’ అని ఎక్స్ వేదికగా సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు.


చాలా మందికి ఒకే రకమైన పేర్లు ఉండొచ్చన్న సిద్ధరామయ్య.. చెక్ బౌన్స్ కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎమ్‌పీ కుమారస్వామికి శిక్ష పడినప్పుడు, హెచ్‌డీ కుమారస్వామినే ఆ పని చేశారని తామేమైనా చెప్పామా? అని ప్రశ్నించారు. ‘యెల్లిడియప్ప నిఖిల్‌’ అంటూ కుమారస్వామి తనను హేళన చేసినప్పుడు.. నిఖిల్ అనే పేరున్న వాళ్లంతా కుమారస్వామికి సమాధానం చెప్పారా? అని నిలదీశారు. ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడు.. వాస్తవాల గురించి మాట్లాడాలే గానీ, కుట్ర సిద్ధాంతాలకు పాల్పడకూడదని సూచించారు. కుమారస్వామి వరుస విఫల ప్రయత్నాలు.. అతని బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తుందని ఎత్తి చూపారు. అటెన్షన్ కోసం అతడు పడే పాట్లు అతడ్ని ఎక్స్‌పోజ్ చేస్తాయన్నారు.

నకిలీ కథనాలను సృష్టించి, సమయాన్ని వృథా చేయడం కన్నా.. తన కూటమి భాగస్వాములతో మాట్లాడి, కర్ణాటకలోని వివిధ సమస్యలపై న్యాయం జరిగేలా కుమారస్వామి చూడాలని సిద్ధరామయ్య సూచించారు. కుమారస్వామి తన తప్పును అంగీకరించి.. తన విఫల ప్రయత్నానికి బహిరంగంగా క్షమాపణ చెప్పే అవకాశం ఇప్పటికీ ఉందన్నారు. అబద్ధాల సహకారంతో రాద్ధాంతం చేయడం కన్నా.. క్షమాపణలతో ఈ వివాదాన్ని ముగించాలని డిమాండ్ చేశారు. ఈ ట్వీట్‌కి ఆయన వివేకానంద సంతకం చేసిన పాఠశాలల అభివృద్ధికి సంబంధించి జాబితాను సైతం ఎటాచ్ చేశారు. చివర్లో.. #GetWellSoonKumaraswamy అనే వ్యంగ్య హ్యాష్‌ట్యాగ్‌ని కూడా జోడించారు.

ఇదిలావుండగా.. ఇటీవల యతీంద్ర కుమారస్వామి ఒక కార్యక్రమానికి వెళ్లినప్పుడు, ఫోన్‌లో ఏదో మాట్లాడుతూ కనిపించారు. ఫోన్‌లో ఆయన ‘ఈ జాబితాపై పని చేయండి’ అని తన తండ్రి సిద్ధరామయ్యకు చెప్పారు. అంతేకాదు.. ‘‘నేను ఐదు మాత్రమే ఇచ్చాను, వివేకానంద ఎవరు?’’ అని కూడా చెప్పడాన్ని ఆ వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. దీనిని హెచ్‌డీ కుమారస్వామి ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. యతీంద్ర ‘పోస్టింగ్ స్కామ్’లో పాల్గొన్నారని ఆరోపించారు. ఇందుకు కౌంటర్‌గానే సిద్ధరామయ్య పైవిధంగా ఘాటు బదులిచ్చారు.

Updated Date - 2023-11-18T18:25:24+05:30 IST