Savarkar Row: కాంగ్రెస్‌ను తగ్గమన్న శరద్ పవార్..!

ABN , First Publish Date - 2023-03-28T16:25:02+05:30 IST

వీడీ సావర్కర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర వికాస్ అఘాడి...

Savarkar Row: కాంగ్రెస్‌ను తగ్గమన్న శరద్ పవార్..!

న్యూఢిల్లీ: సావర్కర్ (Savarkar)పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర వికాస్ అఘాడి (MVA) కూటమి మధ్య సంబంధాలు ఇరకాటంలో పడ్డాయి. దీంతో మరాఠా దిగ్గజ నేత, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) రంగప్రవేశం చేశారు. ఈ అంశంపై శివసేన ఆందోళనను కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి తెలియజేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ సైతం సావర్కర్‌పై విమర్శల విషయంలో సంయమనం పాటించేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఎన్‌సీపీ, శివసేన, కాంగ్రెస్ కలిసి మహారాష్ట్ర వికాస్ అఘాడిగా కొనసాగుతున్నాయి.

మహారాష్ట్రలో సావర్కర్‌ను ప్రజలు ఆరాధిస్తుంటారని, ఆయన లక్ష్యంగా చేసుకుని విమర్శించడం వల్ల అక్కడి విపక్ష కూటమికి ఏమాత్రం ప్రయోజనం చేకూరదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశం దృష్టికి పవార్ తీసుకువచ్చారు. విపక్ష పార్టీల నేతలతో పాటు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సావర్కర్ ఎన్నడూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యుడు కాదని, విపక్ష పార్టీల నిజమైన యుద్ధం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీతోనేనని రాహుల్‌కు పవార్ సూచించారు.

లండన్‌లో రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు భారత ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని, ఇందుకు గాను ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్లు ఉపందుకుంటున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ మీడియా ముందు ఈనెల 25న స్పందించారు. తాను సావర్కర్‌ను కాదని, తన పేరు గాంధీ అని, క్షమాపణలు చెప్పే ప్రసక్తి లేదని చెప్పారు. సావర్కర్‌‌పై ఆయన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టగా, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సైతం రాహుల్‌పై మండిపడ్డారు. సావర్కర్ తమ దేవుడని, ఆయనను అవమానిస్తే సహించేది లేదని అన్నారు. వాళ్లు (బీజేపీ) రెచ్చగొడుతూనే ఉంటారని, మనం కూడా రెచ్చిపోతే అది దేశంలో నియంతృత్వానికి దారితీస్తుందని హెచ్చరించారు. రాహుల్ వ్యాఖ్యలకు నిరసనగా విపక్ష నేతలతో మల్లఖార్జున్ ఖర్గే ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా థాకరే వర్గం శివసేన నేతలు గైర్హాజరయ్యారు.

Updated Date - 2023-03-28T16:25:18+05:30 IST