New Parliament Sengol: రాజుల్లేరు, అధికార మార్పిడి లేదు.. రాజదండం అవసరం ఏమొచ్చింది..?

ABN , First Publish Date - 2023-05-26T14:11:27+05:30 IST

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్ వేదక సమీపంలో రాజదండం కొలువు తీరుతోంది. సహజంగా రాజ్యాధికారం ఒకరి నుంచి మరొకరికి అప్పగించడానికి ప్రతీకగా రాజదండం మార్పిడి జరుగుతుంటుంది. ఒకప్పటి రాజుల్లేరు, రాజరికాలు అంతకంటే లేవు. అధికార మార్పిడి జరుగుతున్న సందర్భమూ కాదు. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే.

New Parliament Sengol: రాజుల్లేరు, అధికార మార్పిడి లేదు.. రాజదండం అవసరం ఏమొచ్చింది..?

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్ వేదక సమీపంలో రాజదండం (Sengol) కొలువు తీరుతోంది. సహజంగా రాజ్యాధికారం ఒకరి నుంచి మరొకరికి అప్పగించడానికి ప్రతీకగా రాజదండం మార్పిడి జరుగుతుంటుంది. ఒకప్పటి రాజుల్లేరు, రాజరికాలు అంతకంటే లేవు. అధికార మార్పిడి జరుగుతున్న సందర్భమూ కాదు. ఎన్నికల వేళ కూడా కాదు. పాత పార్లమెంటు భవనం నుంచి కొత్త పార్లమెంటు భవనంలోకి అడుగుపెడుతున్న శుభతరుణం మాత్రమే. ప్రజాస్వామ్యంలో రాజదండం అవసరం ఏమొచ్చింది? స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల తర్వాత ఇప్పుడు 'రాజదండం' అనే సెంగోల్ మాట అందరి నోటా వినిపిస్తోంది. దీనిపై ఎవరి వాదన వారిదే. అసలు ఏమిటీ సెంగోల్? దీని కథాకమామిషు ఏమిటి?

అర్ధరాత్రి స్వతంత్రం

1947 ఆగస్టు 18వ తేదీ రాత్రి బ్రిటిష్ వలస పాలకుల నుంచి అధికార బదిలీకి గుర్తుగా స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 5 అడుగుల పొడవైన రాజదండాన్ని (సెంగోల్) అప్పటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ మౌంట్ బాటన్ చేతుల మీదుగా అందుకున్నారు. దీనికి ముందు కొంత కసరత్తు జరిగింది. అధికార బదిలీకి ఏ సింబాలిజాన్ని అవలంభించాలనే విషయంలో స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ రాజాజీని నెహ్రూ సంప్రదించారు. తమిళనాడులోని ధార్మిక మఠం తిరువ వడుతురై పీఠాధిపతిని రాజాజీ సంప్రదించారు. చోళ రాజ్య సంప్రదాయం ప్రకారం ఆయన నగల వ్యాపిరి వుమ్మిడి బంగారుకు రాజదండం తయారీ పని అప్పగించారు. 10 మంది నిపుణులైన బంగారు చేతి వృత్తుల బృందం 10-15 రోజులు శ్రమించి రాజదండం తయారు చేశారు. బంగారు ఫోతపోసిన వెండి దండంపైన.. పవిత్రతకు, న్యాయానికి గుర్తుగా నంది ప్రతిమను వారు చెక్కారు. తొలుత పూజారి ఆ రాజదండాన్ని రాత్రి 10.45 గంటల సమయంలో మౌంట్‌బాటెన్‌కు అప్పగించి, మళ్లీ ఆయన చేతుల నుంచి తీసుకుని దాన్ని గంగాజలంతో శుద్ధి చేసి ఊరేగింపుగా తీసుకెళ్లి.. 7వ శతాబ్దినాటి తమిళ సాధువు జ్ఞాన సంబంధర్‌ రాసిన ‘కోలారు పదిగం’ అనే కవితను ఒడువర్‌ పాడుతుండగా రాత్రి 11.45 గంటల సమయంలో నెహ్రూకు అప్పగించారు. దాన్ని తయారుచేసిన వుమ్మిడి ఎత్తిరాజులు (96), సుధాకర్‌ (88) ఇప్పటికీ చెన్నైలో నివసిస్తున్నారు. వారిని పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ సమయంలో ఆహ్వానించి సన్మానించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో రాజదండం ఎందుకు?

రాజులు పోయి, రాజ్యాలు పోయి, ప్రజలే పాలకులుగా, పాలకులు ఎన్నుకున్న నేత ప్రధానిగా పాలన సాగించే ప్రజాస్వామ్యంలో 'రాజదండం' అవసరం ఏముంది? నెహ్రూ ఆలోచన ఇలా సాగడంతో ఆ 'రాజదండం' కనుమరుగైంది. అలహాబాద్ మ్యూజియంలోకి చేరిపోయింది. ఆ తర్వాత కాలంలో ప్రఖ్యాత నృత్యకారిణి పద్మా సుబ్రహ్మణ్యం ఆ రాజదండం ఎక్కడ ఉందో కనిపెట్టాలంటూ పీఎంఓకు లేఖ రాశారు. ఎట్టకేలకు ఆ రాజదండం ఇప్పుడు తెరపైకి వచ్చింది. కొత్త పార్లమెంటు భవనంలోని లోక్‌సభ స్పీకర్ వేదిక సమీపంలో కొలువుతీరనుంది.

ఆత్మ లేని ప్రజాస్వామ్యం

పార్లమెంటు భవన ప్రారంభోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా జరగాలని, ప్రజాస్వామ్య ఆలయానికి ఆత్మ లేకుండా ప్రారంభోత్సవం ఏమిటని నిలదీసిన 19 ప్రతిపక్షాలు పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సామూహికంగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి. విపక్ష పార్టీల నిర్ణయాన్ని అనాలోచిత నిర్ణయంగా బీజేపీ కొట్టిపారేసింది. ఇది బీజేపీ కార్యక్రమం కాదని, ప్రజలు ఎన్నుకున్న ప్రధానిగా మోదీ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందున్నందున ప్రజలందరి భాగస్వామ్యం ఇందులో ఉంటుందని బీజేపీ చెబుతోంది. పాలకులు ఏకపక్షంగా కాకుండా అందరికీ సమన్యాయంతో కూడిన పాలన అందించాలని ఎల్లప్పుడూ గుర్తు చేసే అధికారిక చిహ్నంగా ఈ రాజదండం ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

చరిత్ర ఏమి చెబుతోంది?

మహాభారతంతో సహా చరిత్రలో రాజదండం ప్రాముఖ్యం కనిపిస్తుంది. అధికార బదిలోకి చిహ్నంగా రాజదండం అందజేసే సంప్రదాయం ఉంది. పట్టాభిషేకం తర్వాత రాజుకు రాజదండాన్ని అప్పగించడం ఆనవాయితీ. మహాభారతంలో అర్జునుడు యుదిష్టిరునికి రాజదండం ప్రాముఖ్యతను వివరించినట్టు శాంతిపర్వంలో కనిపిస్తుంది. మౌర్య, గుప్త, చోళ రాజవంశాల్లోనూ రాజదండం సంప్రదాయం ఉంది. ఈమధ్యనే బ్రిటన్‌లో కింగ్ చార్లెస్ III పట్టాభిషేక వేడుకల్లో కూడా రాజదండాన్ని ఉపయోగించారు.

ప్రశ్న పునరావృతం?

భారతదేశంలో 75 ఏళ్లుగా కనుమరుగైన రాజదండం ఇప్పుడు తెరపైకి మోదీ సర్కార్ తీసుకువస్తోంది. ఇది అధికార మార్పిడి జరుగుతున్న తరుణం కానప్పుడు, కేవలం భవన మార్పిడి కార్యక్రమే అయినప్పుడు రాజదండం ఏర్పాటు ఆంతర్యం ఏమిటి? ప్రజాస్వామ్యంలో రాజరికమా? ఇది దేనికి సంకేతం? అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్యను దేశ పురాతన వారసత్వాన్ని పునరుద్ధరిస్తున్నామనే బీజేపీ ప్రచారంలో భాగంగా గత పాలకుల విధానాలను కనుమరుగు చేస్తుండటంగా వారు అనుమానిస్తున్నారు. తమిళనాడు ప్రజలకు చేరువయ్యేందుకు, ముఖ్యంగా 2024 ఎన్నికల వ్యూహం ఇందులో ఉన్నట్టు విపక్షాలు అనుమానిస్తున్నాయి.

Updated Date - 2023-05-26T14:20:00+05:30 IST