China Map Controversy: చైనా మ్యాప్ వివాదం.. ప్రధాని మోదీకి ఆ దమ్ముందా అంటూ సంజయ్ రౌత్ సవాల్

ABN , First Publish Date - 2023-08-29T16:53:02+05:30 IST

భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్ భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ.. ‘2023 చైనా ఎడిషన్’ పేరుతో చైనా ఒక మ్యాప్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో అరుణాచల్ ప్రదేశ్‌ను...

China Map Controversy: చైనా మ్యాప్ వివాదం.. ప్రధాని మోదీకి ఆ దమ్ముందా అంటూ సంజయ్ రౌత్ సవాల్

భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్ భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ.. ‘2023 చైనా ఎడిషన్’ పేరుతో చైనా ఒక మ్యాప్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో అరుణాచల్ ప్రదేశ్‌ను తమ దక్షిణ టిబెట్‌గా చైనా చూపించింది. అంతేకాదు.. తైవాన్, దక్షిణ చైనా సముద్రాన్ని కూడా తమ దేశ ప్రాంతాలుగా ఆ మ్యాప్‌లో చూపింది. బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో మోదీ కలవడం, చైనా అధికారుల్ని ఆలింగనం చేసుకున్న కొన్ని రోజుల్లోనే ఈ మ్యాప్ విడుదలైన నేపథ్యంలో.. భారత్‌లో రాజకీయ దుమారం రేగింది. ఈ క్రమంలోనే తాజాగా శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. చైనాపై సర్జికల్‌ స్టైక్‌ చేసే దమ్ము ప్రధాని మోదీకి ఉందా? అని ఆయన ప్రశ్నించారు.


ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘‘భారత్ భూభాగాలైన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్‌లను తమ ప్రాంతాలుగా చూపుతూ చైనా ఒక మ్యాప్ విడుదల చేసింది. మరి, దీనిపై మోదీ సమాధానం ఏంటి? దమ్ము, ధైర్యం ఉంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయండి. ఈ విషయంపై మోదీ దృష్టి సారించాల్సిందే. ఇటీవలే జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా అధికారుల్ని మోదీ ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యాలు భారతీయుల మనసుల్ని గాయపరిచాయి. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనై చైనా ఈ వివాదాస్పదమైన మ్యాప్‌ని విడుదల చేసింది. భారత్‌లోకి చైనా ప్రవేశించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందే చెప్పారు. లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద భారత భూభాగాన్ని చైనా కాజేసిందని రాహుల్‌ చెప్పిన మాట నిజమే’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వచ్చే ఏడాదిలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ సర్జికల్ స్ట్రైక్ డ్రామా కూడా ఆడొచ్చన్న అనుమానం వ్యక్తం చేసింది.

ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయని.. ఎలక్షన్స్‌ ముందు అల్లర్లు జరిగే అవకాశం ఉందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రామభక్తులు రైళ్లపై రాళ్లు రువ్వడం, బాంబులు విసరడం, అల్లర్లు చెలరేగడం వంటివి జరిగే అవకాశం ఉందని ప్రజల్లో భయం ఉందన్నారు. ప్రజల్లోనే కాదు.. ప్రధాన రాజకీయ పార్టీల మనస్సులోనూ ఈ ఆందోళన ఉందని చెప్పారు. హర్యానాలో జరిగిన అల్లర్లే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ఇదంతా లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం కోసమేనన్నారు. ఇదే టైంలో.. పుల్వామా దాడి కూడా కుట్రపూరితంగా జరిగిందని జమ్మూ కాశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ చేసిన వ్యాఖ్యల్ని సంజయ్ రౌత్ గుర్తు చేశారు. కాగా.. ఈనెల 17న లడఖ్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ, మన భూభాగాన్ని చైనా కాజేసిందన్న విషయం లడఖ్‌లో ఉన్న వాళ్లందరికీ తెలుసని వ్యాఖ్యానించిన సంగతి విదితమే!

Updated Date - 2023-08-29T16:53:02+05:30 IST