RBI : రూ.2000 నోట్ల మార్పిడిపై ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-05-24T19:09:12+05:30 IST

రూ.2000 నోట్ల మార్పిడి ప్రక్రియ నిరంతరాయంగా పూర్తవుతుందని భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం చెప్పారు.

RBI : రూ.2000 నోట్ల మార్పిడిపై ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు
RBI Governor Shaktikanta Das

ముంబై : రూ.2000 నోట్ల మార్పిడి ప్రక్రియ నిరంతరాయంగా పూర్తవుతుందని భారతీయ రిజర్వు బ్యాంకు (Reserve Bank of India - RBI) గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) బుధవారం చెప్పారు. ఈ ప్రక్రియను ఆర్బీఐ నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. కరెన్సీ నిర్వహణలో భాగంగా ఈ నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. రోజుకు రూ.20,000 విలువగల రూ.2000 నోట్లను (10 నోట్లు) మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. అదేవిధంగా ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి కూడా అవకాశం ఇచ్చింది. ఆర్బీఐ ప్రకటన ప్రకారం రూ.2000 నోట్ల మార్పిడి లేదా బ్యాంకుల్లో జమ చేయడానికి సెప్టెంబరు 30 వరకు గడువు ఉంది.

శక్తికాంత దాస్ బుధవారం కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, రూ.2000 నోట్లను మార్చుకోవడానికి లేదా బ్యాంకుల్లో జమ చేసుకోవడానికి ఆర్బీఐ నాలుగు నెలల గడువు ఇచ్చిందన్నారు. దీని కోసం ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మంగళవారం ఎక్కడా రద్దీ కనిపించలేదన్నారు. తాము నిత్యం క్రమం తప్పకుండా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్నారు. ఏదైనా విపరీతమైన సమస్య కానీ, ఆందోళన కానీ ఎదురవుతుందని తాను భావించడం లేదన్నారు. వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. సెప్టెంబరు 30 వరకు గడువు ఇవ్వడం సరైనదేనని సమర్థించుకున్నారు. గడువు లేకపోతే సత్ఫలితాలు రావన్నారు.

మన దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 10.8 శాతం రూ.2000 నోట్లు ఉన్నాయి. అంటే వీటి విలువ రూ.3.6 లక్షల కోట్లు. వీటి జీవిత కాలం పూర్తయిందని, వీటిని ముద్రించడం వెనుక ఉన్న లక్ష్యం నెరవేరిందని తెలిపారు. ఈ నోట్లను లావాదేవీల్లో ఉపయోగించడం లేదన్నారు. అక్కడక్కడ హై డినామినేషన్ నోట్లు ఉన్నా, దానికి ఇతర సమస్యలు కూడా ఉన్నాయన్నారు.

2016 నవంబరులో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో చలామణిలో ఉన్న నోట్లలో ఇవి 86 శాతం ఉండేవి. అప్పుడే రూ.2,000 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చారు. వీటిని చలామణిలోకి తీసుకురావడానికి ముందే వీటి గతి నిర్ణయమైపోయింది. వీటి ముద్రణను చాలా కాలం క్రితమే నిలిపేశారు. ఈ నోట్లను ముద్రించరాదని 2017 జూలై-ఆగస్టు నెలల్లో సూత్రప్రాయంగా నిర్ణయించారు. అప్పటి వరకు రూ.7 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉండేవి. 2018-19లో ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపేసినట్లు ఈ నెల 19న ఆర్బీఐ విడుదల చేసిన పత్రికా ప్రకటన పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

New Parliament: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై 19 విపక్ష పార్టీల కీలక నిర్ణయం

New Parliament Building : ప్రతిపక్షాలకు అమిత్ షా హితవు

Updated Date - 2023-05-24T19:09:12+05:30 IST