Rajya Sabha : నాకు పెళ్లయింది, కోపం రాదు.. రాజ్యసభలో నవ్వులు పూయించిన ఉప రాష్ట్రపతి..

ABN , First Publish Date - 2023-08-03T13:51:38+05:30 IST

మణిపూర్ హింసాకాండ జ్వాలల వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పార్లమెంటులో గురువారం నవ్వులు విరిశాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ మధ్య జరిగిన సంభాషణతో సభ్యులు గొల్లుమని నవ్వారు. రాజకీయ నినాదాలకు కాసేపు విరామం ఇచ్చి, ఆనందించారు.

Rajya Sabha : నాకు పెళ్లయింది, కోపం రాదు.. రాజ్యసభలో నవ్వులు పూయించిన ఉప రాష్ట్రపతి..
Jagdeep Dhankar, Mallikharjun Kharge

న్యూఢిల్లీ : మణిపూర్ హింసాకాండ జ్వాలల వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పార్లమెంటులో గురువారం నవ్వులు విరిశాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ మధ్య జరిగిన సంభాషణతో సభ్యులు గొల్లుమని నవ్వారు. రాజకీయ నినాదాలకు కాసేపు విరామం ఇచ్చి, ఆనందించారు.

మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) రాజ్యసభలో గురువారం మాట్లాడుతూ, రూల్ 267కు ప్రాధాన్యం ఇస్తూ సభా కార్యకలాపాలను వాయిదా వేయాలని, మణిపూర్ సమస్యపై చర్చను చేపట్టాలని కోరారు. ‘‘ఈ డిమాండ్‌ను అంగీకరించాలంటే, ఏదో ఓ కారణం ఉండాలని మీరు చెప్పారు. నేను మీకు కారణాన్ని చూపించాను. నిన్న (బుధవారం) కూడా ఇదే విషయం అడిగాను. కానీ బహుశా మీరు కోపంగా ఉండి ఉంటారు’’ అని అన్నారు. దీంతో ధన్‌కర్ అనూహ్యంగా సరదాగా స్పందించారు.

‘‘నాకు పెళ్లయి 45 ఏళ్లవుతోంది. నాకు ఎప్పుడూ కోపం రాదు. నన్ను నమ్మండి’’ అని ధన్‌కర్ అన్నారు. దీంతో సభ్యులంతా గొల్లుమని నవ్వారు. అనంతరం ధన్‌కర్ మాట్లాడుతూ, పీ చిదంబరం గొప్ప సీనియర్ అడ్వకేట్ అనే విషయం అందరికీ తెలుసునని, ఓ సీనియర్ అడ్వకేట్‌గా కోపం ప్రదర్శించే అధికారం మనకు లేదని చెప్పారు. ‘‘మీరొక అధికారి, ఈ స్టేట్‌మెంట్‌ను దయచేసి సవరించండి’’ అని కోరారు.

దీనిపై ఖర్గే స్పందిస్తూ, ‘‘మీకు కోపం రాదు, మీరు కోపాన్ని ప్రదర్శించరు, కానీ లోలోపల కోపంగా ఉంటారు’’ అన్నారు. దీంతో సభ్యులు మరోసారి మనసారా నవ్వుకున్నారు.


నేను మోదీని కాపాడటం లేదు : ధన్‌కర్

‘‘మణిపూర్ సమస్యపై చర్చించాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)ని మీరు కాపాడుతున్నారు’’ అని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించడంతో ధన్‌కర్ ఘాటుగా స్పందించారు.

‘‘ప్రధాన మంత్రికి నా రక్షణ అవసరం లేదు. ఎవరినైనా కాపాడవలసిన అవసరం నాకు లేదు. రాజ్యాంగాన్ని, మీ హక్కులను కాపాడవలసిన అవసరం నాకు ఉంది. ప్రతిపక్ష నేత నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం శ్రేయస్కరం కాదు’’ అని ధన్‌కర్ అన్నారు.

మణిపూర్‌లో మెయిటీలు, కుకీల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమస్యపై పార్లమెంటులో చర్చించాలని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిపై ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గత నెల 20న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ డిమాండ్‌తో పార్లమెంటు దద్దరిల్లుతోంది. చర్చకు సిద్ధమేనని ప్రభుత్వం చెప్తోంది. కానీ ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదరడం లేదు. మరోవైపు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో చర్చ జరగబోతోంది. ప్రధాని మోదీ ఈ నెల 10న ఈ చర్చకు సమాధానం చెబుతారు.


ఇవి కూడా చదవండి :

Haryana clashes : హర్యానాలో మత ఘర్షణలు.. ప్రశాంతంగా ఉండాలన్న అమెరికా..

Gyanvapi : జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి

Updated Date - 2023-08-03T13:51:38+05:30 IST