Share News

Assembly polls 2023: నామినేషన్ వేసిన సీఎం

ABN , First Publish Date - 2023-11-06T14:27:43+05:30 IST

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. సదర్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన నామినేషన్ వేశారు. గెహ్లాట్ వెంట ఆయన కుమారుడు వైభవ్ గెహ్లాట్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

Assembly polls 2023: నామినేషన్ వేసిన సీఎం

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Assembly polls) పోటీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) సోమవారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. సదర్‌పుర (Sadarpura) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన నామినేషన్ వేశారు. గెహ్లాట్ వెంట ఆయన కుమారుడు వైభవ్ గెహ్లాట్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్ వేసే ముందు గెహ్లాట్ తన సోదరి ఆశీస్సులు తీసుకున్నారు. 1998 నుంచి సదర్‌పర నియోజకవర్గం గెహ్లాట్‌కు కంచుకోటగా ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 63 శాతం ఓట్లు ఆయన గెలుచుకున్నారు.


జనం చూపు కాంగ్రెస్ వైపే..

ప్రధాన్ సేవక్‌ (సీఎం)గా తన బాధ్యతలను తాను సక్రమంగా నిర్వర్తించానని, తన అనుభవాన్ని ప్రజాసేవకే వినియోగించానని చెప్పారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలేనని గెహ్లాట్ అన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా కనిపిస్తోందని, తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ''గతంలో రాజస్థాన్ వెనుకబడిన రాష్ట్రంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇవాళ రాజస్థాన్‌లో ఎయిమ్స్, ఐఐటీలు, ఐఐఎంఎస్‌లు, ఇతర యూనివర్శిటీలు వచ్చాయి. నేను మొదటిసారిగా సీఎం అయినప్పుడు కేవలం 6 యూనివర్శిటీలు రాజస్థాన్‌లో ఉండేవి. ఇప్పుడు 100కు పైగా కాలేజీలు ఉన్నాయి. కాంగ్రెస్‌నే అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు'' అని గెహ్లాట్ చెప్పారు


గెహ్లాట్ పొలిటికల్ జర్నీ..

కాంగ్రెస్ సీనియర్ నేత అయిన గెహ్లాట్ 2018 నుంచి సీఎంగా ఉన్నారు. తొలుత 1998 నుంచి 2003 వరకూ సీఎంగా పనిచేశారు. తిరిగి 2008 నుంచి 2013 వరకూ సీఎంగా ఉన్నారు.1999లో సదర్‌పుర నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలిచిన ఆయన ఆ తర్వాత కూడా అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. 2003, 2008, 2013, 2018లో ఇక్కడి నుంచే గెలిచారు. 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శంభు సింగ్ ఖెటసర్‌పై 45 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 1985, 1994, 1997లో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా ఆయన ఉన్నారు. 1982లో ఇందిరాగాంధీ ప్రభుత్వంతో పర్యాటక, పౌరవిమానయాన, క్రీడల శాఖ డిప్యూటీ మినిస్టర్‌గా, రాజీవ్ గాంధీ హయాంలో టూరిజం, సివిల్ ఏవియేషన్ శాఖ సహాయమంత్రిగా, పీవీ నరసింహారావు హయాంలో జౌళి శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ చార్జ్)గా పనిచేశారు. 1990, 1993 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత 1998లో గెహ్లాట్ నాయకత్వంలో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది.


కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 73 సీట్లు, బీఎస్‌పీ 6, ఆర్ఎల్‌పీ 3, ఆర్ఎల్‌డీ ఒక సీటు గెలుచుకోగా, 13 మంది ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల బరిలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంది. నవంబర్ 25న పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి.

Updated Date - 2023-11-06T17:02:45+05:30 IST