Rains: 12 జిల్లాలకు భారీ వర్ష సూచన

ABN , First Publish Date - 2023-09-18T08:53:32+05:30 IST

పశ్చిమ గాలుల ప్రభావం అధికంగా ఉండటంతో రాష్ట్రంలో 12 జిల్లాలకు వర్ష సూచన ఉందని చెన్నై వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా

Rains: 12 జిల్లాలకు భారీ వర్ష సూచన

చెన్నై, (ఆంధ్రజ్యోతి): పశ్చిమ గాలుల ప్రభావం అధికంగా ఉండటంతో రాష్ట్రంలో 12 జిల్లాలకు వర్ష సూచన ఉందని చెన్నై వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం వేకువజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. దీనికితోడు గాలుల వేగంగా అధికంగా ఉంది. దీంతో చెన్నై విమానాశ్రయం(Chennai Airport) నుంచి 38 విమాన సర్వీసులను రద్దు చేశారు. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటపాటు భారీ వర్షం కురిసింది. ఇందులో తిరువళ్లూరు జిల్లాలోని తిరుత్తణిలో గరిష్ఠంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా రానున్న 24 గంటల్లో 12 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం పేర్కొంది. కడలూరు, కళ్లకుర్చి, అరియలూరు, పెరంబలూరు, మైలాడుదురై, తిరుచ్చి, తంజావూరు, పుదుకోట, నాగపట్టణం, తిరువారూర్‌ జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఆలస్యంగా విమానాలు..

చెన్నైతో పాటు శివారు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వేకువజాము వరకు భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగించింది. చెన్నైలో ల్యాండ్‌ అయ్యేందుకు తూత్తుకుడి, తిరుచ్చి, కోయంబత్తూరు, మదురై, విశాఖపట్టణం, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరుతో పాటు విదేశాల నుంచి వచ్చిన 18 విమాన సర్వీసులు దిగడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఒక్కో విమానం చాలాసేపు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. అలాగే, చెన్నై నుంచి ఢిల్లీ, ముంబై, జైపూర్‌, కోల్‌కతా, పుణె, తిరువనంతపురం, కోళికోడ్‌, మదురై, బహ్రెయిన్‌, కువైట్‌, కౌలాలంపూర్‌, ప్యారీస్‌ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన దాదాపు 20 విమాన సర్వీసులు గంట నుంచి రెండు గంటల పాటు ఆలస్యంగా బయలుదేరి వెళ్లాయి.

Updated Date - 2023-09-18T08:53:32+05:30 IST