Share News

Pickpocket: ప్రధాని పిక్‌పాకెట్ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్య.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశం

ABN , Publish Date - Dec 21 , 2023 | 06:13 PM

ప్రధాని పిక్‌పాకెట్ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దాఖలైన పిల్‌లో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాహుల్‌పై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించింది.

Pickpocket: ప్రధాని పిక్‌పాకెట్ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్య.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశం

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని మోదీ, అమిత్ షా, గౌతమ్ అదానీలను పిక్‌పాకెట్స్ (Pickpockets) అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించడంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఢిల్లీ హైకోర్టు (Delhi High court) తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కోర్టు ఆయనపై ఎనిమిది వారాల్లోగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మినీ పుష్కర్ణలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

రాజస్థాన్‌లోని (Rajasthan) జలోర్‌లో నవంబర్ 22న ఎన్నికల ర్యాలీ సందర్భంగా రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ (PM Modi), హోం మంత్రి అమిత్ షా (Amit Shah), ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీలపై (Gautam Adani) విమర్శలు గుప్పించారు. ముగ్గూరు జేబు దొంగలంటూ మండిపడ్డారు. అంతకుమునుపు, మరో సభలో ‘అపశకునం’ ప్రస్తావనతో ప్రధానిపై విమర్శలు గుప్పించారు. దీంతో, బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఈసీ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.


ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టులో రాహుల్ వ్యాఖ్యలపై ఓ ప్రజాప్రయోజనం వ్యాజ్యం కూడా దాఖలైంది. ఈ సందర్భంగా ఈసీ (Election Commission) తన వాదనలు వినిపిస్తూ రాహుల్ గాంధీకి అప్పటికే నోటీసులు పంపించామని కోర్టుకు తెలిపింది. తమ నోటీసులే హెచ్చరికలని పేర్కొంది. అయితే, ఇలాంటి వ్యాఖ్యలను నిరోధించేలా కఠినమైన నిబంధనలు కావాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. పిటిషనర్ తరుపున వాదిస్తున్న సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా రాహుల్ గాంధీని తప్పుబట్టారు. ఈసీ కేవలం నోటీసులతో సరిపెట్టిందని, రాహుల్ గాంధీపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి లేవని పేర్కొన్నారు.

అయతే, చట్టాల రూపకల్పనకు సంబంధించి తాము పార్లమెంటుకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘ఇలాంటి వ్యాఖ్యలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ, ఈసీ చర్యలు తీసుకున్నప్పుడు మేము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అయితే, ఈ కామెంట్స్ మాత్రం సరైనవి కావని మేము నమ్ముతున్నాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీపై తగు చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించింది.

Updated Date - Dec 21 , 2023 | 06:18 PM