Rahul Case Update: పరువునష్టం కేసులో తుది ఆదేశాలు ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-04-13T19:16:09+05:30 IST

పరువు నష్టం కేసులో తీర్పును నిలిపేయాలని కోరుతూ దాఖలైన అప్పీలుపై సూరత్ సెషన్స్ కోర్టు (Surat court) ఈ నెల 20న తుది ఆదేశాలిస్తుంది.

Rahul Case Update: పరువునష్టం కేసులో తుది ఆదేశాలు ఎప్పుడంటే?
Rahul Gandhi defamation case

సూరత్: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) మోదీ ఇంటి పేరు (Modi surname) కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించిన పరువు నష్టం కేసులో (defamation case) తీర్పును నిలిపేయాలని కోరుతూ దాఖలైన అప్పీలుపై సూరత్ సెషన్స్ కోర్టు (Surat court) ఈ నెల 20న తుది ఆదేశాలిస్తుంది. రాహుల్ తరపున సీనియర్ అడ్వకేట్ ఆర్ఎస్ చీమా వాదనలు వినిపించారు. గాంధీని కేరళలోని వయనాడ్ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారని, ఆయనపై అనర్హత వేటు వేయడం వల్ల ఆ స్థానం ఖాళీగా ఉందని, ఫలితంగా ప్రజలకు తీరని నష్టం జరుగుతోందని తెలిపారు. ప్రధానమంత్రిని తీవ్రంగా విమర్శించినందుకే రాహుల్‌పై ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని చెప్పారు. పరువు నష్టం కేసులో విచారణ అన్యాయంగా జరిగిందని, కఠినంగా ఉందని ఆరోపించారు.

పరువు నష్టం కేసును బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ దాఖలు చేశారని చెప్తూ, రాహుల్ గాంధీ కర్ణాటకలోని కోలార్‌లో ప్రసంగించారని, దాని గురించి పూర్ణేశ్ మోదీకి వాట్సాప్‌‌లో సందేశం వెళ్లిందని తెలిపారు. పంజాబీలు జగడాలమారులని, తరచూ దూషిస్తూ ఉంటారని ఎవరైనా అంటే, నేను పరువు నష్టం కేసు దాఖలు చేయవచ్చునా? అని ప్రశ్నించారు. ఇలాంటి మాటలు గుజరాతీలను, వివిధ భాషలవారిని, మతపరమైన వ్యవస్థలను ఉద్దేశించి తరచూ అంటూ ఉంటారన్నారు. ఈ పరువు నష్టం కేసుపై విచారణ జరిపిన కోర్టు తీర్పు చెప్పిన రోజు ఉదయం 11.51 గంటలకు రాహుల్ గాంధీ దోషి అని తెలిపిందని, ఓ అరగంటలోనే ఆయనకు కఠినమైన, గరిష్ఠమైన శిక్షను విధించిందని చెప్పారు. రాహుల్‌ను ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ, ‘‘మీకు సుప్రీంకోర్టు హెచ్చరిక జారీ చేసింది. మీరు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మీరు కొంచెం కూడా అర్థం చేసుకోవడం లేదు’’ అని అన్నారని, ఇది చాలా దిగ్భ్రాంతికరమని చెప్పారు. ‘‘ఐయామ్ సారీ, నేను కఠిన పదాలను వాడుతున్నాను. జడ్జిని తప్పుదోవ పట్టించారు, ఆయన కఠినంగా ఉన్నారు’’ అని చీమా చెప్పారు.

‘‘చౌకీదార్ చోర్ హై’’ అని వ్యాఖ్యానించినందుకు రాహుల్ గాంధీ 2019 నవంబరులో సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారని, మోదీ ఇంటి పేరు గురించి ఆయన 2019 ఏప్రిల్‌లో మాట్లాడారని తెలిపారు. సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని మందలించిందని ఫిర్యాదుదారు చెప్పిన ప్రొసీడింగ్స్‌పై జడ్జి ఎలా ఆధారపడతారని ప్రశ్నించారు.

మరోవైపు సూరత్ కోర్టు రాహుల్‌‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించడంతో ఆ వెంటనే ఆయనపై అనర్హత వేటు పడింది. దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడింది. సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు దిగింది. కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని (Rahul Gandhi) సూరత్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దోషిగా తేల్చడంతో లోక్‌సభ సభ్యత్వం నుంచి అనర్హత వేటు పడింది. దోషిగా తేలిన 23 మార్చి 2023 నుంచి నుంచి అనర్హత వర్తిస్తుంది. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8లోని ఆర్టికల్ 102(1)(e) ప్రకారం నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొంటూ లోక్‌సభ సెక్రటరీయేట్ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ సర్క్యూలర్ జారీ చేశారు.

రాహుల్‌పై అనర్హత వేటు పడటంతో ఢిల్లీలో ఆయన ప్రస్తుతం ఉంటోన్న ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలని(vacate the government allotted bungalow) లోక్‌సభ హౌజింగ్ కమిటీ(Lok Sabha Housing Committee) నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 22లోగా ఆయన తన బంగళాను ఖాళీ చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. 2014 నుంచి రాహుల్ ఢిల్లీ 12 తుగ్లక్ లేన్ లోని ప్రభుత్వ బంగ్లాలో ఉంటున్నారు.

Updated Date - 2023-04-13T19:26:44+05:30 IST