Rahul Gandhi: వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకూ రాహుల్ ట్రక్ యాత్ర

ABN , First Publish Date - 2023-06-13T18:54:02+05:30 IST

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల తన అమెరికా పర్యటనలో ఒక ట్రక్కులో ప్రయాణించారు. అక్కడి ట్రక్ ఉద్యోగుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకూ 190 కిలోమీటర్ల మేరకు ఆయన ప్రయాణం సాగించారు.

Rahul Gandhi: వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకూ రాహుల్ ట్రక్ యాత్ర

న్యూయార్క్: అడపాదడపా సామాన్య ప్రజల్లోకి వెళ్లడం, వారి కష్టనష్టాలు, జీవన స్థితిగతులను తెలుసుకోవడం ఇష్టపడే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల తన అమెరికా (USA) పర్యటనలో ఒక ట్రక్కులో ప్రయాణించారు. అక్కడి ట్రక్ ఉద్యోగుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ (Washington to New York) వరకూ 190 కిలోమీటర్ల మేరకు ఆయన ప్రయాణం సాగించారు. ట్రక్కు డ్రైవర్ తల్జీందర్ సింగ్ వికీ గిల్ (Taljinder Singh Vicky Gill)తో కలిసి ప్రయాణం సాగించారు.

ఈ ప్రయాణంలో అమెరికాలోని భారత సంతతి ట్రక్కు డ్రైవర్ల పరిస్థితి, వారి జీవన స్థితిగతులు, ట్రక్కు ఫీచర్లు, డ్రైవర్ల ఆదాయం వంటి విషయాలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. "ఎంత సంపాదిస్తావు?'' అని రాహుల్ అడిగినప్పుడు ఇండియాలో ఉంటే ఎంత సంపాదిస్తానో అంతకంటే ఎక్కువే సంపాదిస్తారని తల్జిందర్ సింగ్ సమాధానమిచ్చారు. డ్రైవర్లకు సౌకర్యంగా ఉండేలా ట్రక్కుల డిజైన్ ఉంటుందని, పని పరిస్థితుల విషయంలోనూ ఇండియాకు, అమెరికాకు చాలా తేడా ఉంటుందని ఆయన వివరించారు. వీరి సంభాషణల్లో నిత్యావసరాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, భారత రాజకీయాలపై చర్చకు వచ్చాయి. విద్వేష వ్యాప్తిని ఏ మతం ప్రబోధించదని గిల్ చెబుతున్నప్పుడు రాహుల్ సావధానంగా విన్నారు. ఏదైనా పాట వినిపించమంటారా? పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా పాటా ప్లే చేయనా? అని డ్రైవర్ అడిగినప్పుడు '295' పాటను ప్లే చేయమని రాహుల్ కోరారు. వారు ప్రయాణిస్తున్న వాహనం ఓ రెస్టారెంట్ వద్ద ఆగడంతో రాహుల్ అక్కడి వారందరినీ కలిసి వారితో ఫోటోలు దిగారు. అల్పాహారం తీసుకుని తల్జీందర్ సింగ్‌కు వీడ్కోలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను తల్జీందర్ సింగ్ తన యూబ్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. కేవలం రెండు గంటల్లోనే 1.84 లక్షల మందికి పైగా దీనిని వీక్షించారు.

రాహుల్ గాంధీ గత నెలలోనూ ఢిల్లీ నుంచి చండీగఢ్ ప్రయాణి వరకూ ట్రక్కులో ప్రయాణించారు. వారితో కలిసి ముచ్చటించారు. ఆ తర్వాత ఒక డాబా వద్ద ఆగి డ్రైవర్ల సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్, వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా అప్పట్లో పోస్ట్ చేసింది.

Updated Date - 2023-06-13T18:54:02+05:30 IST