Modi Surname: రాహుల్ గాంధీకి ఉపశమనం.. పాట్నా కోర్టు 'స్టే'
ABN , First Publish Date - 2023-04-24T16:06:50+05:30 IST
'మోదీ ఇంటిపేరు' కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఉపశమనం లభించింది. దిగువ కోర్టు...
పాట్నా: 'మోదీ ఇంటిపేరు' (Modi Surname) కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఉపశమనం లభించింది. దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పాట్నా హైకోర్టు (Patna High Court) మే 15వ తేదీ వరకూ స్టే (Stay) ఇచ్చింది.
కర్ణాటకలోని కోలార్‌లో 2019లో రాహుల్ గాంధీ 'మోదీ ఇంటిపేరు'పై చేసిన వ్యాఖ్యలపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ పరువునష్టం కేసు వేయగా, ఈ కేసులో ఏప్రిల్ 12న తమ ముందు హాజరు కావాలని పాట్నా దిగువ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను రాహుల్ గాంధీ పాట్నా హైకోర్టులో సవాలు చేశారు. దీనిపైనే సోమవారంనాడు పాట్నా హైకోర్టు మే 15వ తేదీ వరకూ స్టే ఇచ్చింది.
''కోర్టులో మేము క్వాషింగ్ పిటిషన్ వేశాం. ఇదే అంశంపై ఇప్పటికే సూరత్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఒకే విషయంపై విభిన్న కోర్టుల్లో విచారణ చట్టవిరుద్ధం. మే 15న తదుపరి విచారణ ఉంటుంది. అప్పటివరకూ దిగువ కోర్టు ప్రొసీడింగ్స్‌పై స్టే అమలులో ఉంటుంది'' అని రాహుల్ తరఫు న్యాయవాది వీరేంద్ర రాథోడ్ మీడియాకు తెలిపారు. కాగా, ఈ అంశంపై వాదనలు కొనసాగించాల్సిందిగా కోర్టు తనతో పేర్కొన్నట్టు సుశీల్ మోదీ అడ్వకేట్ ఎస్‌డీ సంజయ్ తెలిపారు.
మోదీ ఇంటిపైరు వ్యాఖ్యలపై సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా ఇటీవల నిర్ధారించింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, 30 రోజుల్లోగా పైకోర్టుకు వెళ్లే వీలు కల్పించడంతో పాటు, రాహుల్ విజ్ఞప్తి మేరకు బెయిల్ మంజూరు చేసింది. సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై వేటు పడింది. ఈ క్రమంలోనే ప్రోటోకాల్ ప్రకారం తన అధికారిక బంగ్లాను రాహుల్ గత శనివారంనాడు ఖాళీ చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి గెలుపొందిన తర్వాత రాహుల్‌కు ఈ బంగ్లా కేటాయించారు.