Rahul Gandhi: భారత్‌ జోడో యాత్ర ముగిసింది.. రాహుల్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు?

ABN , First Publish Date - 2023-01-31T16:39:28+05:30 IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రారంభించిన భారత్ జోడో (Bharat Jodo) యాత్ర సోమవారంతో ముగిసింది

Rahul Gandhi: భారత్‌ జోడో యాత్ర ముగిసింది.. రాహుల్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రారంభించిన భారత్ జోడో (Bharat Jodo) యాత్ర సోమవారంతో ముగిసింది. గతేడాది సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి(Kanyakumari)లో ప్రారంభమైన యాత్ర 4,080 కిలోమీటర్ల మేర సాగింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మీదుగా సాగుతూ జమ్మూ కశ్మీర్‌లో ముగిసింది. యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ఆదివారం జాతీయ జెండాను రాహుల్ ఎగురవేశారు.

దేశాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా రాహుల్ ఈ యాత్రను ప్రారంభించినట్టు కాంగ్రెస్ పేర్కొంది. అంతులేని పరాజయాలు, పార్టీని వీడుతున్న నాయకులు, వరుస రాజీనామాల నడుమ రాహుల్ ప్రారంభించిన ఈ పాదయాత్ర పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపింది. యాత్ర ముగిసింది సరే.. మరి ఈ ఐదు నెలల పాదయాత్రలో రాహుల్ లక్ష్యం నెరవేరిందా? పార్టీకి మళ్లీ పునర్వైభవం వస్తుందా? అన్నది ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కానీ తెలియదు.

ఆశించిన స్పందన

Rahul1.jpg

కేరళ, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల మీదుగా సాగిన రాహుల్ యాత్ర వెనుక ఉన్న అసలు ఉద్దేశం కచ్చితంగా రాజకీయమే. వరుస ఓటములతో కునారిల్లిపోయిన కాంగ్రెస్‌ను తిరిగి నిలబెట్టడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగింది. యాత్రకు ఆశించిన స్పందన లభించింది. రాహుల్ పాదయాత్రలో పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ఈ యాత్ర కాంగ్రెస్ అదృష్టాన్ని మారుస్తుందని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఫిబ్రవరిలో జరగనున్న ఉపఎన్నికలు మొదలు ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కానీ రాహుల్ యాత్ర లక్ష్యాన్ని చేరుకుందా? లేదా? అన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేం. జమ్మూకశ్మీర్‌(Jammau And Kashmir)కు కూడా ఈ ఏడాదే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఎవరికి వారే..

rahul2.jpg

ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో బీజేపీ(BJP)ని ఢీకొట్టే ప్రతిపక్ష కూటమిలో అగ్రగామిగా ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు అంత శక్తి ఉందా? అన్నది అనుమానమే. చాలా వరకు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌వైపు చూసేందుకే ఇష్టపడడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి లోక్‌సభ ఎంపీలు లేరు. అయినప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. మోదీకి తానే ప్రత్యామ్నాయమని కేజ్రీవాల్(Arvind Kejriwal) చెబుతున్నారు. మరోవైపు, బీజేపీకి శత్రువైన కాంగ్రెస్‌ను ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు లేవు. అలాగే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ప్రధానమంత్రి పీఠంపై కన్నేశారు. ఇంకోవైపు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా కత్తిగట్టి ప్రధాని కుర్చీపై కన్నేసినవారే. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారే యమునా తీరే.. అన్నట్టు సాగితే కాంగ్రెస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు.

సన్నిహితంగా ఉంటూనే దూరం

rahul.jpg

కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉన్నప్పటికీ బీహార్ సీఎం నితీశ్ కుమార్ భారత్ జోడో యాత్రలో పాల్గొనలేదు. అలాగే, కేసీఆర్ ఇటీవల నిర్వహించిన ప్రతిపక్షాల ఐక్యత ర్యాలీకి కూడా నితీశ్ దూరమయ్యారు. ఆర్జేడీ కూడా కాంగ్రెస్‌కు మిత్ర పక్షమే అయినప్పటికీ ఆ పార్టీ కూడా రాహుల్ పాదయాత్రకు దూరంగానే ఉండిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.

సొంతంగానే ఎదగాలనుకుంటున్న మమత

rahul3.jpg

సోమవారం శ్రీనగర్‌లో నిర్వహించిన ర్యాలీకి భావ సారూప్యత ఉన్న 24 పార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించినప్పటికీ చాలామంది డుమ్మా కొట్టారు. వారిలో జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ దేవెగౌడ కూడా ఉన్నారు. నితీశ్ కూడా హాజరు కాలేదు. కొన్ని పార్టీల నేతలు మాత్రం హాజరయ్యారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సొంతంగానే బీజేపీని ఢీకొట్టి ఎదగాలనుకుంటోంది. ఇక, ర్యాలీకి ఆప్, కేసీఆర్(KCR) పార్టీ బీఆర్ఎస్‌(BRS)లను ఆహ్వానించలేదు. అలాగే, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని బీజేడీ, వైఎస్సార్ సీపీని కూడా ఆహ్వానించలేదు. అవి బీజేపీతో సన్నిహితంగా ఉండడమే అందుకు కారణం. కాంగ్రెస్ తమిళనాడు మిత్ర పక్షం డీఎంకే, రెండు కశ్మీర్ పార్టీలు ఎన్‌సీ, పీడీపీ, ఝార్ఖండ్ మిత్రపక్షం జేఎంఎం, సీపీఐ ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు.

తలోదారి చూసుకుంటే కష్టమే..

digvijay.jpg

ప్రతిపక్షాలు తలోదారి చూసుకుంటే కాంగ్రెస్‌ ఆశలు నెరవేరవడం కష్టమే అవుతుంది. పార్టీని పునర్నిర్మించడంలో భాగంగా రాహుల్ ఈ యాత్ర చేపట్టారు. ఆ పునర్నిర్మాణం ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వారి విశ్వాసాన్ని చూరగొనాలి. బీజేపీ విధానాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నా అది అంతగా పనిచేయడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోరాడి విజయం సాధించడం కత్తిమీద సామే అవుతుంది. కాబట్టి బీజేపీ వ్యతిరేక పక్షాలను కలుపుకుని పోయేందుకు కాంగ్రెస్ చొరవ తీసుకోవాలి. ఈ విషయంలో కొంత పట్టువిడుపు ధోరణి ప్రదర్శించాలి. ఫలితంగా బలమైన ప్రతిపక్షంగా ఎదిగేందుకు ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలు అమలు చేయాలి. అప్పుడు మాత్రమే కాంగ్రెస్ ఆశలు నెరవేరుతాయి. లేదంటే మళ్లీ ఎదురుచూపులు తప్పకపోవచ్చు.

ఈ పరిస్థితులన్నింటినీ బేరీజు వేసుకునే కాంగ్రెస్ తదుపరి అడుగులు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ కూడా పార్టీలో మరింతగా కలిసిపోయి పార్టీలో జోష్ నింపే ప్రయత్నాల్లో ఉన్నారని, త్వరలోనే ఆయన ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తారని చెబుతున్నారు.

Updated Date - 2023-01-31T17:19:27+05:30 IST