Prime Minister: మీ ప్రేమ, అప్యాయతను ఎన్నటికీ మరువలేను.. ఏప్రిల్‌లో మళ్లీ వస్తా...

ABN , First Publish Date - 2023-03-26T07:43:42+05:30 IST

ఏప్రిల్‌లో మళ్లీ కర్ణాటకకు వస్తానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రకటించారు. కర్ణాటక ప్రజలు తనపై చూపుతున్న

Prime Minister: మీ ప్రేమ, అప్యాయతను ఎన్నటికీ మరువలేను.. ఏప్రిల్‌లో మళ్లీ వస్తా...

బెంగళూరు: ఏప్రిల్‌లో మళ్లీ కర్ణాటకకు వస్తానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ప్రకటించారు. కర్ణాటక ప్రజలు తనపై చూపుతున్న ప్రేమ, అప్యాయతలను ఎన్నటికీ మరువలేనన్నారు. తొలుత మోదీ కన్నడలో ప్రసంగిస్తూ ‘దావణగెరెయ నన్న సహోదర, సహోదరియెరిగె నమస్కారగళు. కర్ణాటకద నన్న బీజేపీ కార్యకర్త బాంధవరిగె నమస్కారగళు...’ అంటూ కన్నడలో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌(Nalin Kumar Katil) తొలుత మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగేళ్ల బీజేపీ పాలన, కేంద్రంలో 8 ఏళ్ల మోదీ పాలన అభివృద్ధికి తిరుగులేని తార్కాణంగా నిలిచాయన్నారు. బీజేపీ విజయసంకల్ప యాత్రలు శాసనసభ ఎన్నికల్లో జయభేరి యాత్రగా మారాలని ఆకాంక్షించారు. మాజీ సీఎం యడియూరప్ప(Former CM Yeddyurappa) మాట్లాడుతూ బీజేపీ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. మరో రెండు నెలలపాటు అవిశ్రాంతంగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపొందేంతవరకు తాను కూడా సొంతింటికి వెళ్లబోనని శపథం బూనారు. ధనబలం, కండబలంతో అబద్ధపు హామీలతో కాంగ్రెస్‌ ప్రజల విశ్వాసం పొందడం సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమాలను వివరించారు. పాకిస్థాన్‌, చైనా దేశ ప్రజలు మోదీ లాంటి ప్రధాని కావాలని కోరుకుంటుంటే కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రధాని మోదీని అవహేళన చేస్తూ అవమానిస్తున్నారన్నారు. కిసాన్‌ సమ్మాన్‌ పథకం ద్వారా రాష్ట్రానికి రూ.16వేల కోట్లు లభించడానికి ప్రధాని మోదీయే కారణమని చెప్పారు. ర్యాలీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి, సీఎం బసవరాజ్‌ బొమ్మై(CM Basavaraj Bommai), మాజీ సీఎం యడియూరప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌, మాజీ సీఎంలు జగదీశ్‌ శెట్టర్‌, డీవీ సదానందగౌడ, మంత్రులు బైరతి బసవరాజ్‌, కారజోళ, శ్రీరాములు, సీసీ పాటిల్‌, మాజీ మంత్రి ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T07:43:42+05:30 IST