Share News

PM Narendra Modi: ఒమన్ సుల్తాన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ఆ విషయాలపై కీలక చర్చ

ABN , Publish Date - Dec 16 , 2023 | 02:52 PM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఇద్దరి మధ్య కీలక చర్చ నడిచింది. వాణిజ్యం, పెట్టుబడులతో పాటు విభిన్న రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడంపై...

PM Narendra Modi: ఒమన్ సుల్తాన్‌తో ప్రధాని మోదీ భేటీ.. ఆ విషయాలపై కీలక చర్చ

PM Modi - Haitham Bin Tarik Meeting: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఇద్దరి మధ్య కీలక చర్చ నడిచింది. వాణిజ్యం, పెట్టుబడులతో పాటు విభిన్న రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడంపై తారిక్‌తో మోదీ చర్చించారు. భారత్ పర్యటనలో భాగంగా ఒమన్ సుల్తాన్ ఢిల్లీకి చేరుకున్న తరుణంలో.. ఇద్దరి మధ్య ఈ కీలక సమావేశం సాగింది. గల్ఫ్ దేశానికి చెందిన ఒక అగ్రనాయకుడు భారత్ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి.


‘‘భారత్-ఒమన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊతమిస్తూ.. హైదరాబాద్ హౌస్‌లో ఒమన్‌కు చెందిన సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌ను ప్రధాని నరేంద్రమోదీ సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరి మధ్య ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చలకు ఈ హైదరాబాద్ హౌస్ వేదికగా నిలిచింది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఎజెండాలో ద్వైపాక్షిక సంబంధాలను పరిగణనలోకి తీసుకోవడం.. రెండు దేశాల మధ్య భవిష్యత్ సహకారం కోసం మార్గాలను నిర్ణయించడం వంటివి ఉన్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు.

అంతకుముందు శనివారం ఉదయం రాష్ట్రపతి భవన్ ముందు కోర్టులో సుల్తాన్ బిన్ తారిక్‌కు లాంఛనప్రాయ స్వాగతం లభించింది. ‘‘ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌ మొదటి భారతదేశపు పర్యటన.. ఇది భారత్, ఒమన్ మధ్య దౌత్య సంబంధాలకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంతకుముందే ఒక ట్వీట్‌లో పేర్కొంది. కాగా.. వ్యూహాత్మక భాగస్వాములైన భారత్, ఒమన్ మధ్య ద్వైపాక్షిక, వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా పరోగమిస్తున్నాయి.

Updated Date - Dec 16 , 2023 | 02:52 PM