PM Modi: స్పెషల్ లుక్‌తో అదరగొట్టిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2023-04-09T22:03:33+05:30 IST

బండీపురలో సఫారీ సమయంలో మోదీ మిలిటరీ దుస్తుల్లో ఖాకీ జాకెట్‌తో నీలి కళ్లద్దాలు, హ్యాట్‌ ధరించి ప్రత్యేక లుక్‌తో అదరగొట్టారు.

PM Modi: స్పెషల్ లుక్‌తో అదరగొట్టిన ప్రధాని మోదీ
PM Modi at Bandipur Tiger Reserve

బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తుంటారు. తాజాగా బండీపురలో సఫారీ సమయంలో మోదీ మిలిటరీ దుస్తుల్లో ఖాకీ జాకెట్‌తో నీలి కళ్లద్దాలు, హ్యాట్‌ ధరించి ప్రత్యేక లుక్‌తో అదరగొట్టారు. ఫొటోగ్రఫిలో ప్రత్యేక శ్రద్ధ ఉండటంతో ఆయన తనవెంట కెమెరాను కూడా తెచ్చుకుని ప్రకృతి రమణీయ దృశ్యాలను తన కెమెరాలో బంధించారు.

ప్రాజెక్టు టైగర్‌ స్వర్ణోత్సవాల నేపథ్యంలో మైసూరులోని బండీపుర పులుల సంరక్షణా కేంద్రాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పులుల సంతతికి సంబంధించిన నివేదికను విడుదల చేశారు. ప్రపంచంలోని మొత్తం పులుల సంఖ్యలో 75 శాతం భారత్‌లోనే ఉన్నాయన్నారు. తాజా అంచనా ప్రకారం దేశంలోని అభయారణ్యాల్లో 3,167 పులులున్నాయన్నారు. వీటి సంరక్షణ బాధ్యత అందరిపై ఉందన్నారు. పులుల సంరక్షణా పథకం విజయవంతం కావడం దేశానికే కాక ప్రపంచానికే గర్వకారణమన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో పులుల సంఖ్య తగ్గుతుంటే.. భారత్‌లో క్రమేపీ పెరుగుతోందన్నారు. ప్రపంచపటంపై కేవలం 2.4 శాతంగా ఉన్న భారత్‌ ప్రకృతి వైవిధ్యతకు పేరు గాంచి 8 శాతం ఉండడం విశేషమన్నారు. దేశంలో సుమారు 30 వేల ఏనుగులు కూడా ఉన్నాయనీ, ప్రపంచంలో అతిపెద్ద ఏసియాటెక్‌ ఏనుగుల శ్రేణి కలిగిన దేశం కూడా భారతదేశమేనన్నారు. ఇదే సందర్భంగా ప్రధాని ఇంటర్నేషనల్‌ బిగ్‌ క్యాట్స్‌ అలయెన్స్‌‌కు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక నాణేన్ని కూడా విడుదల చేశారు.

ఆస్కార్‌ అవార్డు సాధించిన ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ డాక్యుమెంటరీలో కనిపించిన రఘు, బొమ్మి దంపతులను ప్రధాని కలిశారు. వారితో కలసి ఫొటో దిగారు. తమిళనాడులోని తెప్పకాడు అనే శిబిరంలో మోదీ.. ఆ దంపతులను కలవడంతోపాటు గజరాజు ఆశీర్వాదం అందుకున్నారు. ఏనుగులను అప్యాయంగా నిమిరారు. వాటికి చెరుకుగడలు తినిపించారు. ఏనుగుల సేవలోనే తరిస్తున్నామనీ, తమ జీవితానికి ఇదే చాలనీ, ప్రధాని తమను కలవడం గొప్ప అనుభూతిని కలిగించిందన్నారు.

Updated Date - 2023-04-10T14:35:19+05:30 IST